Movies

Breaking: ఎస్పీబీ ఇకలేరు

Breaking: ఎస్పీబీ ఇకలేరు - SPB Dead - SP Balasubramanyam Is No More - Latest Update

అమృత కంఠం మూగబోయింది. గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మనకిక లేరు. కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. కొన్ని రోజుల కిందట కరోనా నెగెటివ్‌ రావడంతో ఎస్పీబీ కోలుకున్నారని, పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని అభిమానులంతా భావించారు. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై సమాచారం అందిస్తూ వచ్చారు. ‘నాన్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. ఫిజియో థెరఫీ కొనసాగుతోంది. ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి బయటపడాలనే ఆతృతతో ఉన్నారు’ అంటూ కొద్ది రోజుల కింద ప్రకటించడంతో బాలు క్షేమంగా బయటకొస్తారని, మళ్లీ సంగీతంతో తమను అలరిస్తారని అందరూ సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎస్పీబీ కన్నుమూశారు.
‘‘నాన్న మధ్యాహ్నం 1.04గంటలకు తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మరో గంటలో మీడియా ముందుకు వచ్చి నేనే స్వయంగా వెల్లడిస్తా’’- తనయుడు ఎస్పీ చరణ్‌