Business

నాకు ఒక్క కారు మాత్రమే మిగిలింది-వాణిజ్యం

Anil Ambani Position Has Fallen So Low

* ‘నేను సాధారణ జీవితం గడుపుతున్నాను. ఒక్క కారు మాత్రమే వాడుతున్నాను. చట్టపరమైన రుసుములు చెల్లించడానికి నా బంగారాన్ని అమ్ముకున్నాను’ ఈ మాటలు మాట్లాడింది మరెవరో కాదు రుణాల ఊబిలో చిక్కుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త, దేశంలోనే ధనవంతుల్లో ఒకరిగా కొనసాగిన అనిల్ అంబానీ. భారత్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే హైకోర్టు ఎదుట హాజరైన ఆయన ప్రస్తుత తన జీవన శైలి, ఆస్తులు, అప్పుల గురించి తెలియజేశారు. అసలు సంగతి ఏంటంటే.. అంబానీ సంస్థ ఆర్‌కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్‌ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకునే యత్నాల్లో భాగంగా ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్‌ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్‌, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆయన్ను బ్రిటన్‌లో కోర్టుకు లాగాయి. ఈ ఏడాది మే 22న 21 రోజుల్లోగా ఈ మూడు బ్యాంక్‌లకు 717 మిలియన్‌ డాలర్లతో పాటు ఇతర ఖర్చులను చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. జూన్‌ 12తో గడువు ముగిసినప్పటికీ, ఆయన ఎటువంటి చెల్లింపులు చేయలేదు. దాంతో ఆ బ్యాంకు‌లు ఆయన ఆస్తులను బహిర్గతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించడంతో, దానికి అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దానిలో భాగంగా ఆయన శుక్రవారం విచారణను ఎదుర్కొన్నారు.

* ఆరు మ్యూచువల్‌ఫండ్‌ పథకాలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన ట్రస్టీ సంస్థ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియాపై చెన్నైకు చెందిన ది ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేసింది. మదుపర్ల బృందమైన చెన్నై ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ అండ్‌ అకౌంటెన్సీ ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మ్యూచువల్‌ఫండ్‌ పథకాలు మూసివేయడంపై దాఖలైన నాలుగు పిటీషన్లకు సంబంధించి, వాదనలను వినడం కర్ణాటక హైకోర్టు పూర్తి చేసిన నేపథ్యంలో, తాజా ఎఫ్‌ఐఆర్‌ దాఖలవ్వడం గమనార్హం. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌తో పాటు ట్రస్టీ కంపెనీ, ఫండ్‌ మేనేజర్‌ సహా సీనియర్‌ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదైంది. మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను మూసివేయడం ద్వారా 3 లక్షల మంది యూనిట్‌ హోల్డర్లను మోసం చేశారని ఆరోపించారు.

* ‘డిజిటల్‌ అప్నాయే’ ప్రచారం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను డిజిటల్‌ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఆగస్టు 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగాలను ఉపయోగించేలా వినియోగదార్లను ప్రోత్సాహించడమే దీని ఉద్దేశం. దీని కింద ఒక్కో శాఖ కనీసం 100 మంది ఖాతాదార్ల(మర్చంట్లు కూడా)కు డిజిటల్‌ చెల్లింపులను అలవాటు చేయాలని బ్యాంకులను కోరిన సంగతి తెలిసిందే.

* సెప్టెంబరు 18తో ముగిసిన వారానికి విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 3.378 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) పెరిగి జీవనకాల గరిష్ఠమైన 545.038 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.40.87 లక్షల కోట్లు)కు చేరాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 353 మిలియన్‌ డాలర్లు తగ్గి 541.660 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 3.943 బిలియన్‌ డాలర్లు పెరిగి 501.464 బిలియన్‌ డాలర్లకు చేరాయి. బంగారు నిల్వలు 580 మిలియన్‌ డాలర్లు తగ్గి 37.440 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు(ఎస్‌డీఆర్‌) 1 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.483 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశీయ నిల్వలు 14 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.651 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి.

* ఆన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌ రుణానికి సంబంధించి రూ.77.85 కోట్ల హామీ సమర్పించాలంటూ ఇచ్చిన ఆదేశాలపై పెన్నా ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసే దరఖాస్తును సత్వరం పరిష్కరించాలంటూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌-2 (డీఆర్‌టీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా తమకు హామీ సమర్పించాలంటూ డీఆర్‌టీ ఇచ్చిన గడువును అక్టోబరు 5 వరకు పొడిగించింది. ఆన్‌రాక్‌కు ఇచ్చిన రుణం వసూళ్లలో భాగంగా అస్సెట్‌ కేర్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎసీఆర్‌ఈ) దాఖలు చేసిన దరఖాస్తుపై విచారించిన డీఆర్‌టీ రుణానికి 15 రోజుల్లో హామీ ఇవ్వాలంటూ వ్యక్తిగత హామీదారు అయిన ప్రతాప్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో తాకట్టులోని 1.35 లక్షల పెన్నా సిమెంట్స్‌ ఈక్విటీ వాటాలను జప్తు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాలు చేస్తూ పి.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది విక్రమ్‌ పూసర్ల వాదనలు వినిపిస్తూ ఆన్‌రాక్‌ కంపెనీ రుణానికి పిటిషనర్‌ వ్యక్తిగత హామీ ఇచ్చారన్నారు. రుణానికి సంబంధించి ఓటీఎస్‌ (ఏకకాలంలో పరిష్కారం) ఎస్‌బీఐతో కూడిన బ్యాంకుల కన్సార్టియం అంగీకరించిందన్నారు. రూ.1275 కోట్ల ఓటీఎస్‌కు 94.80 శాతం వాటా ఉన్న రుణదాతలు అంగీకరించారన్నారు. ఇందులో భాగంగా రూ.400 కోట్లను చెల్లించిందని, కొవిడ్‌ నేపథ్యంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి గడువు కోరినట్లు తెలిపారు. దీంతో ఎస్‌బీఐ దివాలా ప్రక్రియ నిమిత్తం ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకుందన్నారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకు నుంచి ఆన్‌రాక్‌ రుణం తీసుకుందని, ఈ రుణాన్ని ఎసీఆర్‌ఈ స్వీకరించి ప్రస్తుతం డీఆర్‌టీని ఆశ్రయించిందన్నారు. ఈ ఏడాది జూన్‌ 15న జరిగిన రుణదాతల సమావేశంలో ఇది కూడా పాల్గొందని, ఓటీఎస్‌కు రుణదాతలు అంగీకరించిన విషయం కూడా తెలుసన్నారు. ఓటీఎస్‌ విషయాన్ని తొక్కిపెట్టి డీఆర్‌టీని ఆశ్రయించిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఈ వివాదాన్ని డీఆర్‌టీలోనే తేల్చుకోవాలంది. 15 రోజుల్లో హామీ ఇవ్వాలన్న ఉత్తర్వులను తొలగించాలంటూ పిటిషనర్‌ దాఖలు చేసే దరఖాస్తును అక్టోబరు 5లోగా పరిష్కరించాలంటూ డీఆర్‌టీని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.