DailyDose

నెల్లూరులో సంగీత వర్సిటీ పెట్టండి-తాజావార్తలు

నెల్లూరులో సంగీత వర్సిటీ పెట్టండి-తాజావార్తలు

* బాలీవుడ్‌ హీరోయిన్స్‌ సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌ శనివారం జరిగిన ఎన్సీబీ విచారణలో అబద్ధాలు చెప్పారని సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌ స్నేహితుడు యువరాజ్ ఆరోపణలు చేశారు. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసును డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న ఎన్సీబీ అధికారులు సారా, శ్రద్ధాకపూర్లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణలో పాల్గొన్న సారా, శ్రద్ధా.. సుశాంత్‌ మాదకద్రవ్యాలు వినియోగించడం చాలా సందర్భాల్లో చూశామని, కానీ తాము మాత్రం డ్రగ్స్‌ తీసుకోలేదని ఎన్సీబీ ఎదుట చెప్పినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ స్నేహితుడు యువరాజ్‌ సదరు నటీమణుల విచారణ గురించి స్పందించారు. ‘తాము ఎలాంటి తప్పు చేయలేదని, సుశాంత్‌ మాత్రం తరచూ డ్రగ్స్‌ వినియోగించడం చూశామని సదరు నటీమణులిద్దరూ పూర్తిగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లు చెప్పిన ఈ మాటలు గురించి వింటుంటే నవ్వొస్తోంది. వాళ్లు నా స్నేహితుడిపై బురద జల్లుతున్నారు. తాము కూడా డ్రగ్స్‌ వినియోగిస్తామని, సరఫరా చేస్తామని.. ఒకవేళ ఎన్సీబీ విచారణలో కనుక వాళ్లు అంగీకరించివుంటే వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకుంటారనే విషయం వాళ్లకి తెలుసు. అందుకే వాళ్లు కొన్ని విషయాలు బయటకు చెప్పలేదు.’

* భారత కరోనా టీకా సిద్ధమైతే ప్రపంచదేశాలకు అందించేందుకు‌ సిద్ధమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇవ్వడం ఎంతో గర్వించదగిన విషయమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధార్‌ పునావాలా అన్నారు. ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రపంచదేశాలకు మోదీ ఇచ్చిన ఆ హామీపై ఆయన ప్రశంసలు కురింపించారు. ఈమేరకు ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

* అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఏటా ఎస్పీబీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని.. సంగీత వర్సిటీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ ప్రాంతాన్ని బాలు కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

* కేంద్ర మాజీ మంత్రి, రిటైర్డ్‌ మేజర్‌ జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్‌ 25న దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం తీవ్ర గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా సోకలేదని వైద్యులు నిర్ధరించారు. 1938 జనవరి 3న రాజస్థాన్‌లోని జసోల్‌లో జన్మించిన ఆయన సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు. పదవీ విరమణ అనంతరం భాజపాలో చేరి 1980 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. గొప్ప పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదుసార్లు రాజ్యసభ, నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998-99 మధ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వాజ్‌పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. 1999లో నేపాల్‌ నుంచి భారత్‌ వస్తున్న ఎయిరిండియా విమానాన్ని తాలిబన్లు హైజాక్‌ చేసి అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించగా ఉగ్రవాదులతో జశ్వంత్‌ సింగ్‌ చర్చలు జరిపి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్యకేసులో అవంతి మేనమామ యుగంధర్‌రెడ్డి కీలక వ్యక్తని, తన అక్క అర్చన కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో నెలరోజుల క్రితమే ప్రణాళిక రచించాడని పోలీసులు గుర్తించారు. అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చనలు తరచూ బాధపడటం భరించలేక యుగంధర్‌రెడ్డి వారితో మాట్లాడి హేమంత్‌ను చంపేద్దాం అంటూ ప్రతిపాదించాడని.. వారిద్దరూ అంగీకరించడంతో అప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాడని భావిస్తున్నారు. ఒకరిద్దరితో కాకుండా కుటుంబ సభ్యులంతా కలిసి వెళితే అవంతి, హేమంత్‌లకు అనుమానం రాదంటూ యుగంధర్‌రెడ్డే అందరినీ కార్లలో గచ్చిబౌలికి తీసుకువచ్చాడని.. అవంతి, హేమంత్‌లను కార్లో లాక్కెళ్లాక బంధువులు, కుటుంబ సభ్యులను వెళ్లిపోవాలంటూ చెప్పి.. హేమంత్‌ను కిరాయిహంతకులతో కలిసి దారుణంగా చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను గచ్చిబౌలి పోలీసులు శనివారం సేకరించారు. మరోపక్క హేమంత్‌ హత్య కేసులో నిందితులైన ఎరుకల కృష్ణ, మహ్మద్‌పాషాలు శనివారం మధ్యాహ్నం స్వయంగా స్టేషన్‌కొచ్చి లొంగిపోయారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు జగన్‌, సయ్యద్‌ల కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* భాజపాకు అకాలీదళ్‌ షాక్‌ ఇచ్చింది. చిరకాల మిత్రునిగా కొన్నేళ్లుగా భాజపాతో పొత్తుకొనసాగిస్తున్న అకాలీదళ్‌ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. ఇటీవలే కేంద్ర మంత్రి వర్గం నుంచి బయటికొచ్చిన అకాలీదళ్‌ తాజాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన రైతు, వ్యవసాయ బిల్లుల విషయంలో భాజపా, అకాలీదళ్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. రైతు, వ్యవసాయ బిల్లుల విషయమై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని అకాలీదళ్‌ వ్యతిరేకించింది. అదే రోజు కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన పదవికి రాజీనామా సైతం చేశారు. రైతు బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణి మారక పోవడంతో కూటమి నుంచి బయటకు వచ్చినట్లు అకాలీదళ్ పేర్కొంది.

* లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ ఆటలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఇద్దరి నుంచి నలుగురు ఆడుకునే ‘లూడో’ ఆట కూడా విపరీతంగా పాపులర్‌ అయ్యింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతి లూడో ఆటలో తండ్రి మోసం చేశాడంటూ కోర్టు మెట్లెక్కింది. గెలిపిస్తాడని నమ్మానని, కానీ తన పావుల్నే చంపేశాడని.. తండ్రితో తన సంబంధాన్ని తెంచేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తోబుట్టువులు, తండ్రితో ఆడిన ఆటలో తండ్రి తనను గెలిపిస్తాడని భావించానని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ కోర్టుకు తెలిపింది. తనలో సంతోషాన్ని నింపేందుకు ఆయన ఓడిపోయి నన్ను గెలిపిస్తాడని నమ్మకం పెట్టుకున్నానని, కానీ అలా చేయలేదని పేర్కొంది. దీంతో తండ్రిపై ఉన్న గౌరవమంతా పోయిందని, ఆయనతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. సదరు యువతి ఫిర్యాదుపై ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్‌ సరిత స్పందించారు. ఆ యువతికి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించారు.

* మూసీనది ప్రక్షాళనపై మహ్మద్‌ నహీం పాషా దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. మూసీ ప్రక్షాళనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలుపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ ప్రక్షాళన పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ అప్జల్‌ పుర్కర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

* దేశంలో రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారవుతున్నట్లు కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. 110 చోట్ల నుంచి అందుబాటులోకి వస్తున్న ఈ కిట్లు అన్ని రాష్ర్టాలకు కావల్సినన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. గతంలో పీపీఈ కిట్లు కొరత ఉందన్న రాష్ర్టాలే ప్రస్తుతం వాటిని నిల్వ చేయడానికి స్థలం లేదనే స్థాయికి చేరుకున్నాయని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏడు కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన ఆయన రికవరీ రేటు 82 శాతం ఉన్నట్లు వివరించారు.

* చైనా దళాలు భారత్‌ను‌ ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చైనా సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ వాంగ్‌హాంగ్‌యాంగ్‌ హెచ్చరించారు. ఈయన గతంలో నాన్‌జింగ్‌ మిలటరీ రీజియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారత్‌ షాక్‌ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లిజిన్‌ అనే రక్షణ సంబంధ వ్యవహారాలను ప్రచురించే ఒక సామాజిక మాధ్యమ ఖాతాలో తెలిపినట్లు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు పేర్కొంది.

* ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు నాగార్జునసాగర్‌ ఆనకట్టను సందర్శించారు. భారీ వర్షాలకు ఆనకట్ట గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులు పీవీ రమణ, విజయతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులతో నాగార్జునసాగర్‌ వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా సింధుతో పాటు కుటుంబ సభ్యులంతా ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు.

* మూసీనది ప్రక్షాళనపై మహ్మద్‌ నహీం పాషా దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. మూసీ ప్రక్షాళనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలుపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ ప్రక్షాళన పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ అప్జల్‌ పుర్కర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

* మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల కోణంలోని దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఇవాళ కొత్తగా ముగ్గురు అనుమానితులు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ముగ్గురూ కడప నగరానికి చెందిన చెప్పుల దుకాణం డీలర్లుగా గుర్తించారు.

* ఉత్తరప్రదేశ్‌లోని మేరట్‌లో దారుణం చోటుచేసుకుంది. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించేలా కదులుతున్న బస్సులో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రంతా మహిళపై లైంగిక దాడిచేసి అనంతరం ఆమెను బస్సులోనుంచి బయటకు తోసేశారు. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని కొందరు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్న ఆమె తనపై జరిగిన లైంగిక దాడిని పోలీసులకు వివరించింది.