Business

కీలక వడ్డీరేట్లలో మార్పు లేదు-వాణిజ్యం

RBI Announces No Changes To Crucial Interest Rates

* భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఈ సారీ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రస్తుతమున్న స్థితినే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు సమీక్షించనుంది. అక్టోబర్‌ 1న ఎంపీసీ తన నిర్ణయాలను వెలువరించనుంది.

* దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యూందాయ్‌ మోటార్‌ కంపెనీ సరికొత్త సూపర్‌ కార్‌ను పరిచయం చేసింది. నెక్స్ట్‌ జనరేషన్‌ కు చెందిన ఆర్‌ఎం20ఈ కారును బీజింగ్‌ మోటార్‌షోలో తొలిసారి ప్రదర్శించింది. అత్యాధునికమైన ఫీచర్లతో ఈ కారును రూపొందించింది. భవిష్యత్తు తరానికి అవసరమైన అత్యధిక సామర్థ్యం ఉన్న ఆర్‌ఎం కార్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టును హ్యూందాయ్‌ 2012లో చేపట్టింది. దీనిలో ఆర్‌ఎం 14, 15, 16, 19 కార్లు వచ్చాయి. ఇక 2019లో హ్యూందాయ్‌ తొలి సారి ఎలక్ట్రిక్‌ రేసింగ్‌ కారేను పరిచయం చేసింది. దీనికి వెలాసిటర్‌ ఎన్‌ ఈటీసీఆర్‌ అని పేరుపెట్టింది. ఫ్రాంక్‌ఫర్ట్‌ మోటార్‌షోలో దీనిని ప్రదర్శించింది. తాజాగా విడుదల చేసిన ఆర్‌ఎం సిరీస్‌లో ఎలక్ట్రిక్‌ కారుపై హ్యూందాయ్‌ పరిశోధన విభాగం అధ్యక్షుడు అల్బర్ట్‌ బెర్మన్‌ మాట్లాడుతూ ‘‘ మా కొత్త కారు ఆర్‌ఎం సిరీస్‌ను కూడా విద్యుత్త కార్ల విభాగంలోకి చేర్చింది. 21వ శతాబ్దపు విద్యుత్త కార్ల విప్లవంలోకి చేరింది.’’ అని పేర్కొన్నారు. ఈ కారు 799 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 0-200 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.88 క్షణాల్లో చేరుకొంటుంది.

* దేశంలోనే రెండో అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ యూటీఐ ఈవారం ఐపీవోకు రానుంది. సెప్టెంబర్‌ 29న ఈ కంపెనీ బిడ్లను స్వీకరించనుంది. రూ.10 ముఖవిలువ కలిగిన 3.8 కోట్ల వాటాలను ఈ ఐపీవోలో విక్రయించనుంది. దీనిలో షేర్‌ ప్రైస్‌బ్యాండ్‌ రూ.552 – రూ.554 మధ్య ఉంటుందని అంచనా. ప్రజలు యూటీఐ ఐపీవో మీద చాలా ఆసక్తితో ఉన్నారు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారం అత్యధిక లాభాలను పంచుతుందోని లెక్కలు చెబుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 12.8 శాతం లాభంతో, నిప్పన్‌ ఏఎంసీ 9శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ ఐపీవోలో యూటీఐ షేర్లకు ఎంత డిమాండ్‌ ఉందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఇదే రంగంలోని తోటి సంస్థల కంటే తక్కువ విలువకు రావడంతో యూటీఐ ఏఎంసీకి మంచి ఆదరణే లభించవచ్చని ఈ రంగంలోని నిపుణులు అంచనావేస్తున్నారు.

* స్వయంగా రతన్‌ టాటానే సైరస్‌ మిస్త్రీ చేయిపట్టుకుని టాటా సన్స్‌ ఛైర్మన్‌ సీట్లో కూర్చోబెట్టారు. అది జరిగింది 2012లో. అయిదేళ్లు తిరిగేసరికి.. అదే మిస్త్రీని ఆ సీటు దిగి వెళ్లిపొమ్మంటూ గ్రూప్‌ ప్రకటించింది. కార్పొరేట్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఏమిటిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? అని తలలు బద్దలు కొట్టుకున్నారు. అయితే టాటా సన్స్‌లో మైనారిటీ వాటాదార్లుగా ఎస్‌పీ గ్రూప్‌ కొనసాగుతూ వచ్చింది. కాలచక్రం మరో నాలుగేళ్లు తిరిగింది. ఇపుడు ఉన్న ఆ కాస్త బంధం కూడా తెగిపోతోంది. టాటాసన్స్‌లో తమకున్న మైనారిటీ వాటాను తెగనమ్ముకుని బయటకు వచ్చేయాలని మిస్త్రీ బృందం భావిస్తున్నారు. ఇపుడు ఆ వాటాను కొనుగోలు చేయడం టాటాలకు అంత సులువా?