Devotional

ఈ ఏడాది దుర్గమ్మ ప్రసాదంగా ఒక్క లడ్డూ మాత్రమే

ఈ ఏడాది దుర్గమ్మ ప్రసాదంగా ఒక్క లడ్డూ మాత్రమే

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈసారి దసరా ఉత్సవాల్లో మూడు, నాలుగు రకాల ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉండవు. కేవలం లడ్డూ ఒక్కటే తయారుచేసి అందించాలని నిర్ణయించారు. అవి కూడా పరిమితంగానే అందించనున్నారు. గతంలో దసరా ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు లడ్డూ, పులిహోర, బంగి ప్రసాదం, దద్దోజనం, చక్రపొంగలి, అప్పాలు, డ్రైఫ్రూట్‌ ప్రసాదం వంటివి అందుబాటులో ఉంచేవారు. ఈసారి కరోనా నేపథ్యంలో అన్ని రకాల ప్రసాదాలు తయారు చేయడంతో పాటు భక్తులకు అదించడం ఇబ్బందికరంగా మారుతుందని భావించి లడ్డూ ఒక్కటే సిద్ధం చేయించాలని నిర్ణయించారు. గతంలో ఉత్సవాల తొమ్మిది రోజులకు కలిపి కనీసం 20 లక్షలకు పైగానే లడ్డూలను అందుబాటులో ఉంచేవారు. ఈసారి 7 లక్షలు మాత్రమే తయారు చేయిస్తున్నారు. అక్టోబరు 17 నుంచి 20 వరకు రోజుకు 50 వేల చొప్పున, 21న మూలానక్షత్రం నుంచి చివరి ఐదు రోజులు లక్ష చొప్పున లడ్డూలు సిద్ధం చేసి అందించాలని నిర్ణయించారు. తయారీలో పలు జాగ్రత్తలు.. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ప్రసాదం తయారీ చాలా జాగ్రత్తగా చేయించాల్సి ఉంటుంది. దీంతో తక్కువ మంది వంటవారితో లడ్డూ పోటు ప్రదేశంలో శానిటైజేషన్‌ చేసి, ఎక్కువ మంది రాకుండా చర్యలు తీసుకోనున్నట్టు దుర్గగుడి అధికారులు తెలిపారు. లడ్డూ తయారీలో పాల్గొనే వారందరికీ తప్పనిసరిగా మాస్క్‌లు, చేతి గ్లౌజులు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మిగతా ప్రసాదాలేవీ లేనందున.. తయారీ విషయంలోనూ ఒత్తిడి ఉండదు. రోజుకు 50వేల నుంచి లక్ష లడ్డూల తయారీకి పనిచేసేవాళ్లు సైతం ఎక్కువ మంది అవసరం ఉండదు. ఈ సారి అనవసర భారం పెట్టుకోకుండా ఉండేందుకే ప్రసాదం పంపిణీని కుదించినట్టు వెల్లడించారు. రోజుకు పది వేల మంది భక్తులనే అనుమతించనున్నందున ఒక్కొక్కరికి మూడు నుంచి ఐదు లడ్డూలను మాత్రమే ఇవ్వనున్నారు.