DailyDose

హైకోర్టుకు ఎక్కిన కృష్ణంరాజు అశ్వనీదత్-తాజావార్తలు

Krishnamraju And Aswanidutt File Case In High Court

* గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రయత్నిస్తోందంటూ సీనియర్‌ నటుడు కృష్ణంరాజు దంపతులు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, విమానాశ్రయం విస్తరణ కోసం తానిచ్చిన 39 ఎకరాల భూమికి గాను భూ సేకరణ చట్టం కింద రూ.210 కోట్లను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏఏఐని ఆదేశించాలని కోరుతూ నిర్మాత చలసాని అశ్వనీదత్‌ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. గన్నవరంలో తానిచ్చిన 39 ఎకరాల భూమి ప్రస్తుతం ఎకరా రూ.1.84 కోట్లు చేస్తుందని, భూ సేకరణ చట్టం కింద ఈ మొత్తానికి నాలుగు రెట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.

* చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కేసుకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రతాప్‌రెడ్డికి పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరుగుతుండగా వెళ్లిన రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి దాడి చేశారని డీజీపీ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించామని తెలిపారు. వైకాపా నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవావస్తమని డీజీపీ లేఖలో వివరించారు.

* రోజు రోజుకి మార్కెట్లో స్మార్ట్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఉత్పత్తులను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా షావోమి మూడు కొత్త స్మార్ట్ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. వీటిలో స్మార్ట్‌బ్యాండ్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ స్పీకర్ ఉన్నాయి.

* తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, సినీనటి నుస్రత్‌ జహాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. దుర్గామాత వేషధారణలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఆమెను చంపేస్తామంటూ సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమె ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ కోసం దుర్గామాత వేషధారణలో వస్త్రాలు ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకున్న ఓ ఫొటోను సెప్టెంబర్‌ 17న ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

* నిబంధనల ప్రకారం నవంబర్‌ రెండోవారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగవచ్చని.. ఎమ్మెల్సీతో పాటు బల్దియా ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆన్‌లైన్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు సహా త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల అంశంపై చర్చించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు.

* ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తుది తీర్పు వెలువడనుంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తుది తీర్పు చెప్పనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని తీర్పు సమయంలో కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ ఈ సెప్టెంబర్‌ 16న ఆదేశాలు జారీచేశారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 30నాటికి పూర్తిచేసి, తీర్పు వెలువరించాలని సుప్రీం కోర్టు ఇదివరకే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 30న ఈ కేసుపై తీర్పు వెలువడనుంది.

* భాజపా యువ మోర్చా అధ్యక్షుడు, బెంగళూరు సౌత్‌ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఖండించింది. గత ఆదివారం విలేకర్లతో తేజస్వి సూర్య మాట్లాడుతూ బెంగళూరు ‘ఉగ్రవాద కేంద్రం’గా తయారైందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి బెంగళూరులో ఎన్‌ఐఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ఉగ్రకార్యకలాపాలకు బెంగళూరు ‘ఇన్‌క్యూబేషన్‌ సెంటర్‌’గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై కర్ణాటకలో విపక్ష పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భాజపా అధికారంలోకి రాకముందు ఆరేళ్లపాటు కాంగ్రెస్‌, దాని భాగస్వామ్య పార్టీ (జేడీఎస్‌)కి చెందిన నేతలే సీఎంగా వ్యవహరించారు. దీంతో తేజస్వి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది.

* జీహెచ్‌ఎంసీ, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో కమిషనర్‌ పార్థసారథిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రామచందర్‌రావు మాట్లాడుతూ… తెరాస, మజ్లిస్‌ పార్టీలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని ఆరోపించారు.

* ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బిహార్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్‌ భాజపా బాధ్యుడు దేవేంద్ర ఫడణవీస్‌ తప్పుబట్టారు. ఆర్జేడీ ప్రకటనను ఖండించారు. పది లక్షల స్వదేశీ పిస్తోళ్లను కొనుగోలు చేసి, తమ కార్యకర్తలందరికీ పంచిపెట్టి కిడ్నాప్‌లు, దొంగతనాలు చేయమని పంపించి వాటినే ఉద్యోగాలుగా పరిగణిస్తారేమోనని దుయ్యబట్టారు.

* తెలంగాణలోని దుబ్బాక సహా దేశంలోని మొత్తం 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 54 స్థానాల్లో నవంబర్ 3న.. బిహార్‌లోని ఒక లోక్‌సభ స్థానం సహా మణిపూర్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. బిహార్‌ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నవంబర్‌ 10న జరగనుంది. దుబ్బాకలో తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శామీర్‌పేటలోని భారత్‌ బయోటెక్‌ను మంగళవారం సందర్శించిన గవర్నర్‌ .. వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌ మీద శాస్త్రవేత్తలు ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారన్నారు.

* రైతులు పూజించుకునే యంత్రాలు, పరికరాలకు నిప్పంటించి కొందరు వ్యక్తులు వారిని అవమానిస్తున్నారంటూ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ ఘటనను ఖండించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిన్న కొందరు ఆందోళనకారులు దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌కు నిప్పంటించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ ఉత్తరాఖండ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన అనంతరం ఈ ఘటనను ఉద్దేశించి మాట్లాడారు.

* ప్రముఖ నటుడు సోనూసూద్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు వరించింది. ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆయనకు ‘ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు’ను ప్రకటించింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కాలంలో లక్షలాది వలస కార్మికులు, విద్యార్థులకు సేవలందించినందుకు ఆయన ఈ గౌరవానికి ఎన్నికయ్యారు. ఈ అవార్డును ఆయనకు ఓ వర్చువల్‌ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం ప్రదానం చేశారు.