Food

పిల్లలకు మినప పాయసం పెట్టండి

Feed Your Kids Urad Dal For Iron Body

ఆరోగ్యం బాగుండాలన్నా, శరీరం దృఢంగా ఉండాలన్నా సంప్రదాయ ఆహారమే మేలని అంటున్నారు ఆహార నిపుణులు. కరోనా దెబ్బకి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం వైపు జనం మొగ్గు చూపుతున్నారు. అలాంటి వంటకాల్లో ‘మినుప పాయసం’ ఒకటి. తెలంగాణలో ఇది సంప్రదాయ వంటకం.
*‘మినుప పాయసం’ తయారు చేయడం చాలా సులభం. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ తాగవచ్చు. చలికాలంలో ఎక్కువగా చేసుకుంటారు. దీన్ని పొట్టు మినుప పప్పు, బెల్లంతో చేస్తారు. ముందుగా కావాల్సినంత పొట్టు మినుప పప్పును తీసుకోవాలి. దాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. అయితే పూర్తిగా పొట్టు పోకుండా చూడాలి. ఆ పప్పును అరగంటకుపైగా నానబెట్టాలి. నీటిలో నానిన పప్పును కుక్కర్‌ లేదా వంట పాత్రలో సరిపడా నీటిలో ఉడికించాలి. పప్పు ఉడికేంత వరకూ అలాగే ఉంచాలి. తర్వాత తురిమిన బెల్లం వేసి ఈ మిశ్రమాన్ని ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించాలి. అప్పడు పప్పు పూర్తి చిక్కగా మారుతుంది. వెంటనే స్టౌ మీది నుంచి దించి, కాస్త చల్లార్చాలి. అభిరుచిని బట్టి నెయ్యి, జీడిపప్పు, బాదం, కొబ్బరి పొడి వేసుకోవచ్చు.
బెల్లంలోని మినరల్స్‌ జీర్ణక్రియలో తోడ్పడే ఎంజైమ్స్‌ ఉత్పత్తికి సహాయపడతాయి. ఎముకల బలానికి కావలసిన క్యాల్షియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు మెండుగా అందుతాయి. అంతేకాదు, బెల్లంలో వ్యాధినిరోధక శక్తికి తోడ్పడే యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, జింక్‌ ఎక్కువగానే ఉంటాయి. ఫ్లూ, జలుబు వంటి వాటిని తగ్గించడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది.
మినుముల్లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, ఐరన్‌, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. మినుములను తరచూ తీసుకోవడం ద్వారా బి1, బి2, బి3, బి6, విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, విటమిన్‌-కె వంటివి అందుతాయి. మినుములు కండరాలకు బలాన్ని ఇస్తాయి. ఎదిగే పిల్లలకు చాలా మేలు చేస్తాయి. పెద్దల్లో రక్తహీనత నివారణకు, గుండె ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడతాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
*బెల్లం రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలకి మంచి ఔషధం. దీనిలోని పోషకాల వల్ల రక్తహీనత, జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బెల్లంలోని ఐరన్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గకుండా చేస్తుంది.
*పాయసానికి నెయ్యి మరింత రుచిని ఇస్తుంది. మితంగా వాడితే నెయ్యి ఆరోగ్య దాయకం. దీనివల్ల జీర్ణక్రియలు వేగంగా జరుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. *సౌందర్యాన్ని పెంచే శక్తి కూడా నెయ్యికి ఉంది. ముఖం కాంతిమంతం అవుతుంది. అనారోగ్యానికి గురిచేసే వైరస్‌లను నెయ్యి దరిచేరనీయదు.
*బాదం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందులోని పీచు పదార్థాలు శరీరానికి దివ్య ఔషధాలు. బాదంలోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.