DailyDose

తెదేపా పదవికి గల్లా గుడ్‌బై-తాజావార్తలు

Galla Aruna Resigns To TDP Post - Telugu Breaking News

* తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న గల్లా అరుణకుమారి.. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన ఆమె.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018లో ఆమెను పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చంద్రబాబు నియమించారు. గల్లా అరుణకుమారి తనయుడు జయదేవ్‌ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుంచి విజయం సాధించారు.

* అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎన్నికల ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ చేసిన తాజా ప్రకటన దీనికి బలాన్ని చేకూరుస్తోంది.

* స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో జరిగిన భారీ మోసం 1992 స్కామ్‌. స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా ఇందులో కీలక సూత్రధారి. అతడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్ ‌‘స్కామ్‌ 1992: ది హర్షద్‌ మెహతా స్టోరీ’. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టాక్‌ మార్కెట్లు, బ్యాంకుల కార్యాకలాపాల్లోని లొసుగులు పసిగట్టిన హర్షద్‌ మెహతా రూ.5వేల కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

* కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని కేంద్ర మాజీ మంత్రి భరత్‌సిన్హ్‌ సోలంకి అభిప్రాయపడ్డారు. ‘కరోనా వైరస్‌ వల్ల ఏమీ కాదనే అతి నమ్మకంతో వైరస్‌ను చాలా తేలికగా తీసుకున్నాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలందర్నీ కలవడం మొదలుపెట్టా. చివరకు వైరస్‌ బారినపడ్డాను’ అని సోలంకి పేర్కొన్నారు. ప్రస్తుతం 101 రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైరస్‌ నుంచి అంత తేలికగా బయటపడలేదని.. చికిత్స సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వైరస్‌ను తేలికగా తీసుకోకుండా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిపాలు కావడంకంటే మాస్కులు ధరించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని ప్రజలకు సూచించారు.

* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్‌ సోకినట్టు ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీలోని తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు.

* కరోనాతో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. విజయవాడలో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆయన చెక్కులు అందజేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సర్వీసుల అంశంపై స్పందించారు. అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయనేది అంతులేని ప్రశ్నగా మారిందని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పుడు నడుస్తాయనే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అడగాలని మీడియా ప్రతినిధులకు పేర్ని నాని సూచించారు.

* పండ్లరసం చేయడం చాలా సులభం. తాజా పండ్లను కట్‌ చేసి మిక్సీలో వేసి కాస్త చెక్కర కలిపేస్తే జ్యూస్‌ రెడీ. మరి పండ్ల వ్యర్థాల సంగతి? ఏముంది తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడమే అంటారా? ఇంట్లో పండ్ల రసాలు తయారు చేసే వారి దగ్గరి నుంచి జ్యూస్‌లు తయారు చేసే పెద్ద కంపెనీల వరకూ వ్యర్థాలను ఇలాగే పారేస్తున్నారు. అయితే ఇలా వృథా అయిపోతున్న దానిమ్మ పండ్ల వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే ఉపాయాన్ని సూచించమని అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. మంచి ఆలోచన చేసిన వారికి భారీ మొత్తంలో నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.

* తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవుడు హిమాన్షు బుధవారం గాయపడ్డాడు. కాలికి గాయాలతో పాటు శరీరంపై అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. వెంటనే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. గుర్రం స్వారీ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని సమాచారం. కుమారుణ్ని మంత్రి కేటీఆర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులతో చర్చించారు. వివిధ పరీక్షలు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

* కారులో మద్యం సీసాలు దొరికిన అంశం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు నాగ వరలక్ష్మి రాజీనామాకు దారి తీసింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, ఈవోలకు నాగ వరలక్ష్మి రాజీనామా లేఖ పంపారు. తనకు తెలియకుండా కారు డ్రైవర్‌ మద్యం బాటిళ్లు తరలించినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్‌ కూడా ఇప్పటికే తన తప్పును ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్‌ ఉదయభానుతోపాటు దేవాదాయశాఖ మంత్రికి కూడా తెలియజేశానన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు తాను ధర్మకర్తల మండలి సభ్యురాలిగా రాజీనామా చేస్తున్నట్లు నాగ వరలక్ష్మి తన లేఖలో స్పష్టం చేశారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ముఖాముఖిలో చెప్పిన మాటలు .. భారత్‌లో ఎవరినో గుర్తుచేస్తున్నాయి అంటున్నారు కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. ట్రంప్‌, డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య ఇటీవల తొలి ముఖాముఖి చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘47ఏళ్లు మీరు(డెమొక్రాట్లు) అధికారంలో ఉండి చేసిన దానికంటే ఈ 47 నెలల్లో నేను ఎంతో ఎక్కువ చేశాను’ అని అన్నారు. కాగా.. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ‘ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో ఎవరినైనా గుర్తుచేస్తున్నాయా? అది మీ ఊహకే వదిలేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

* రాజకీయాలకు అతీతంగా మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలు ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్ట్‌.. కుటుంబ, ప్రైవేట్‌ ఆస్తి కాదన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు అనేక చోట్ల భూములున్నాయని.. రూ.125 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని అశోక్‌ గజపతిరాజు తెలిపారు. అయినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం దారుణమని విమర్శించారు. ట్రస్ట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, చట్టాలపై గౌరవం లేదని ఆయన ఆరోపించారు.

* ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకినాడ సెజ్‌పై జగన్‌ కన్నేయడం ఇవాళ్టిది కాదని అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులైన రైతుల నోళ్లలో మట్టికొట్టడం హేయమైన చర్య అని ఆక్షేపించారు. రూ.5వేల కోట్ల విలువైన కోనసీమ భూములు బినామీల పేర్లతో జగన్‌ హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. కాకినాడ సెజ్‌ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లని.. అందులో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని ఆయన అన్నారు. అవినీతి లావాదేవీలపై దర్యాప్తు జరపాలని, పార్లమెంట్‌ ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ సెజ్‌లో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ పెడితే కోనసీమ ప్రాంతం కాలుష్యమై వందలాది హేచరీస్‌ అన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ నుంచి నెల్లూరు దాకా మొత్తం కోస్తా తీరాన్ని కబళిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే విశాఖ సెజ్ లో సీఎం బినామీలు పాగా వేసి ఉత్తరాంధ్ర భూములన్నీ కబ్జా చేశారని ధ్వజమెత్తారు. త్వరలో బందరు పోర్టు కూడా జగన్ బినామీల పరమవుతుందేమోనని వ్యాఖ్యానించారు.