Movies

సమాజానికి ఉపయోగపడే మంచిపని చేసిన ప్రకాశ్‌రాజ్

Prakash Raj Sponsoring Poor Students Education In Manchester University

పేద విద్యార్థిని పాలిట ఆప‌ద్బాంధ‌వుడైన ప్ర‌కాష్‌రాజ్‌.. మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దివించ‌డానికి ఏర్పాట్లు!

ఎదుటివాళ్ల‌కు సాయం చేయాల‌నే మంచి హృద‌యం ఉన్న‌వాళ్ల‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ ఒక‌రు. ఈ లాక్‌డౌన్ కాలంలో క‌ష్టాల్లో ఉన్న‌వాళ్ల‌కు త‌న వంతు సాయం చేస్తూ వ‌స్తున్నారు. వ‌ల‌స కార్మికుల‌కు ఆప‌న్న హ‌స్తం అందించిన ఆయ‌న, స్కూలు మిస్స‌వుతున్న పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించే బాధ్య‌త‌ను కూడా తీసుకున్నారు. అలాగే తెలంగాణ‌లో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని త‌న ఉదాత్త హృద‌యాన్ని చాటుకున్నారు.

తాజాగా ఆయ‌న ఓ బ్రిలియంట్ స్టూడెంట్‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయాన్ని చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ప‌శ్చిమ గోదావ‌రికి జిల్లాకు చెందిన సిరిచంద‌న స్కూలు నుంచే అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌నప‌రుస్తూ బీఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తి చేసింది. ఆమెకు మాంచెస్ట‌ర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్‌ డిగ్రీ చేయ‌డానికి సీటు వ‌చ్చింది. ఆమెకు తండ్రి లేడు. ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రం. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఆశ‌లు వ‌దిలేసుకున్న ఆమె పాలిట ఆప‌ద్బాంధ‌వుడ‌య్యారు ప్ర‌కాష్‌రాజ్‌. ఆమెను మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దివించ‌డానికి ముందుకు వ‌చ్చారు. దీంతో సిరిచంద‌న‌, ఆమె త‌ల్లి ఆనందాన్ని అవ‌ధులు లేవు. హైద‌రాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న ప్ర‌కాష్‌రాజ్‌ను క‌లుసుకొని, త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆమెను బాగా చ‌దువుకొని, వృద్ధిలోకి రావాల్సిందిగా ప్ర‌కాష్‌రాజ్ ఆశీర్వ‌దించారు.

ఈ సంద‌ర్భంగా సిరిచంద‌న మాట్లాడుతూ, “నాపేరు తిగిరిప‌ల్లి సిరిచంద‌న‌. మాది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పెద్దేవం గ్రామం. నేను డిగ్రీ కంప్యూట‌ర్ సైన్స్‌ చ‌దువుకున్నాను. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో మాస్ట‌ర్స్‌ డిగ్రీ చేయ‌డానికి మాంచెస్ట‌ర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో సీటు వ‌చ్చింది. నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మా నాన్న‌గారు చ‌నిపోయారు. అప్ప‌ట్నుంచీ మా అమ్మే క‌ష్ట‌ప‌డి మ‌మ్మ‌ల్ని చ‌దివించి ఇక్క‌డి దాకా తీసుకువ‌చ్చింది. యూనివ‌ర్సిటీలో సీటు వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డికి వెళ్ల‌డానికి నేను ధైర్యం చెయ్య‌లేదు. ఎందుకంటే ఆర్థికంగా మా కుటుంబం ప‌రిస్థితి నాకు తెలుసు కాబ‌ట్టి. న‌రేంద్ర అనే మా శ్రేయోభిలాషి ఒక‌రు నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన‌ప్పుడు, ప్ర‌కాష్‌రాజ్ గారు అదిచూసి, త‌న‌కు నేను హెల్ప్ చేస్తాను, త‌ను బాగా చ‌దువుకోవాలి అని ముందుకు వ‌చ్చారు. అన్ని ఖ‌ర్చులు ఆయ‌నే భ‌రిస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రేర‌ణ‌తో నేను బాగా చ‌దువుకొని, నాలాంటి స్థితిలో ఉన్న మ‌రో న‌లుగురికి సాయం చేయాల‌ని అనుకుంటున్నా. నిజానికి మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకొనే స్థాయి మాకు లేదు. కానీ ఆర్థికంగా, నైతికంగా ప్ర‌కాష్‌రాజ్ గారు ఇచ్చిన స‌పోర్ట్ ఎన్న‌టికీ మ‌ర్చిపోలేం. బుక్స్ ద‌గ్గ‌ర్నుంచి కంప్యూట‌ర్ దాకా ఆయ‌నే స‌మ‌కూర్చి పెట్టారు. క‌చ్చితంగా ఈ విష‌యంలో ఆయ‌న‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటాను. ఎప్ప‌టికీ ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను.” అని చెప్పింది.

సిరిచంద‌న వాళ్ల‌మ్మ ఉద్వేగంతో మాట్లాడుతూ, “నా పిల్ల‌లు చిన్న‌వాళ్లుగా ఉన్న‌ప్పుడే నా భ‌ర్త చ‌నిపోయారు. అప్ప‌ట్నంచీ అష్ట‌క‌ష్టాలు ప‌డి నా పిల్ల‌ల్ని పోషిస్తూ, చ‌దివించుకుంటూ వ‌చ్చాను. మాకు ఆస్తిపాస్తులు లేవు, వెనుకా ముందూ ఎవ‌రూ లేరు. నా రెక్క‌లే ఆధారం. పాప‌కు పీజీలో సీటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధేసింది. ప్ర‌కాష్‌రాజ్ గారికి నా బిడ్డ విష‌యం తెలిసి, త‌న బాధ్య‌తంతా ఆయ‌న తీసుకున్నారు. సిరిచంద‌న‌ను తాను చూసుకుంటాన‌నీ, చ‌దివిస్తాన‌నీ చెప్పారు. త‌న‌కో కూతురుంద‌నీ, సిరిని రెండో కూతుర‌నుకుంటాన‌నీ అన్నారు. ‘నువ్వు నా చెల్లెలివ‌మ్మా బాధ‌ప‌డ‌కు’ అని నాకు ధైర్యమిచ్చారు. ఏమిచ్చినా ఆయ‌న రుణం తీర్చుకోలేం. ఒక పెద్ద‌న్న‌లా ఆయ‌న న‌న్ను న‌డిపిస్తున్నారు.” అన్నారు.