Business

మారటోరియం వడ్డీపై కేంద్రం శుభవార్త-వాణిజ్యం

మారటోరియం వడ్డీపై కేంద్రం శుభవార్త-వాణిజ్యం

* వివిధ రుణాలపై మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కేంద్రం రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రుణగ్రహీతలకు మారటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం తప్ప ఇంకో పరిష్కార మార్గం లేదని ఈ సందర్భంగా కేంద్రం అభిప్రాయపడింది.

* ముకేశ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. సంస్థకు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల జాబితాలో మరో రెండు విదేశీ సంస్థలు చేరాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ యూనిట్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. జీఐసీ రూ.5,512.5 కోట్లతో 1.22 శాతం, టీపీజీ రూ.1,837.5 కోట్లతో 0.41 శాతం వాటాల్ని సొంతం చేసుకోనున్నట్లు రిలయన్స్‌ అధికారికంగా ప్రకటింది. తాజా పెట్టుబడులతో కలిపి రిలయన్స్ రిటైల్‌లో ఇప్పటివరకు 7.28 శాతం వాటాల విక్రయించారు. దీంతో రూ.32,197 కోట్ల పెట్టుబడులు సమకూరాయి.

* హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్‌ టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సొరంగ మార్గం నిర్మాణంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ) కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. బీఆర్‌ఓను ప్రత్యేకంగా అభినందించారు. అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని సొరంగ నిర్మాణం పూర్తిచేసిన సరిహద్దు రహదారుల సంస్థకు భారత రత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 1234‘సంస్థలకు భారతరత్న పురస్కారం ఇవ్వొచ్చో లేదో కచ్చితంగా తెలియదు గానీ.. వీరత్వం, కఠినశ్రమతో పనిచేసే బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ మాత్రం ఇందుకు అర్హమైనది. ఇక బీఆర్‌ఓను భారతరత్న ఆర్గనైజేషన్‌ అనాలి’ అని ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

* పండుగల సీజను నేపథ్యంలో నెల రోజుల పాటు ‘ఇండియా హోమ్‌ ఫెయిర్‌’ నిర్వహిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. ఈ ఆన్‌లైన్‌ ప్రోపర్టీ షోలో దేశంలోని 50 నగరాల్లో 175కు పైగా డెవలపర్లకు చెందిన 350కి పైగా ప్రాజెక్టులను అందుబాటులో ఉంచనున్నారు. లండన్‌, సింగపూర్‌, మధ్య ప్రాచ్యానికి చెందిన ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు భారత్‌లో సొంత ఇంటిని సమకూర్చుకునేందుకు కేవలం తమ వెబ్‌సైట్‌లో ఒక క్లిక్‌ చేస్తే చాలునని హెచ్‌డీఎఫ్‌సీ అంటోంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి పలు నగరాల్లోని ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు రూ.35 లక్షల నుంచి ఇందులో ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ప్రాజెక్టులకు సంబంధించిన ఫొటో గ్యాలరీ, సమాచారంతో పాటు పోల్చిచూడడానికి, షార్ట్‌లిస్ట్‌ చేసుకోవడానికి కూడా వీలు కల్పించింది.