Devotional

17 నుండి భద్రాద్రిలో దసరా వేడుకలు

17 నుండి భద్రాద్రిలో దసరా వేడుకలు

మన కష్టాలను కడతేర్చి అష్టైశ్వర్యాలను అందించేందుకు అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు సాక్షాత్కరించనున్నారు. ఈ మహత్కార్యం విజయదశమి ఉత్సవాలలో నయనానందం చేయనుంది. ఇందుకు భద్రాచలం రామాలయం అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. లక్ష్మీతాయారు అమ్మ కోవెలను సుందరంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తమయ్యారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. 26న విజయ దశమి సందర్భంగా అమ్మవారు నిజ రూపంలో కనిపించనున్నారు. రామాయణ పారాయణం కొనసాగనుంది. విజయ దశమిని పురస్కరించుకుని 26న శ్రీరామ లీలామహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ కొనసాగే రావణ వధ ఘట్టం పరమానందం కలిగిస్తుంది. ఇదేరోజు శమీ పూజ సంప్రదాయబద్ధంగా ఉంటుంది. విజయ దశమికి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని ఈవో శివాజీ తెలిపారు. 17న ఆదిలక్ష్మి అలంకారం ఉంటుంది. 18న సంతానలక్ష్మి, 19న గజలక్ష్మి, 20న ధనలక్ష్మి, 21న ధాన్యలక్ష్మి, 22న విజయలక్ష్మి, 23న ఐశ్వర్యలక్ష్మి, 24న వీరలక్ష్మి, 25న మహాలక్ష్మి, 26న నిజరూపంలో దర్శనం ఉంటుంది. ధనం, ధాన్యం, సంతానం, విద్య, అధికారం, వీరం, విజయం, ఐశ్వర్యం.. ఇలా మనిషికి అవసరమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించడానికి అష్టలక్ష్మి రూపాలను ధరించిన అమ్మ కరుణా స్వరూపమైన తన నిజరూపంలో అందర్నీ అనుగ్రహిస్తుంది. 17 నుంచి 21 వరకు ఐదు రోజుల వరకు శ్రీమణవాళ మహాముని తిరునక్షత్ర ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సేవా కాలం నిర్వహించి మధుర పదార్థాన్ని నివేదించనున్నారు. నిజ అశ్వయుజ మాసోత్సవాలో భాగంగా 31న పౌర్ణమిని పురస్కరించుకుని శబరి మాత పేరిట యాత్రను నిర్వహించనున్నారు. వచ్చే నెల 14న దీపావళి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.