DailyDose

రసాయన నోబెల్ అమెరికాదే-తాజావార్తలు

2020 Chemistry Nobel Goes To USA-Telugu Breaking News

* రసాయన శాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు గానూ ఈ ఏడాది ఇద్దరు వ్యక్తులకు నోబెల్‌ బహుమతి వరించింది. ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌, జెన్నీఫర్‌ ఏ డౌడ్నా సంయుక్తంగా నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘జీనోమ్‌ ఎడిటింగ్‌’ విధానంలో వారు చేసిన పరిశోధనలకు గానూ నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. కాగా ఈ ఇద్దరిలో ఇమ్మాన్యూయెల్‌ ఫ్రాన్స్‌, జెన్నీఫర్‌ అమెరికాకు చెందినవారు.

* విభజన చట్టంలో పేర్కొన్న విషయాలు ఎంతవరకు వచ్చాయో సీఎం జగన్‌ వివరించాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు. ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని అడిగారా?అని ప్రశ్నించారు. సీఎం దిల్లీ పర్యటనలో ఏం జరిగిందో మీడియాకు ఒక్కమాట కూడా ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. శ్రీకాకుళంలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రాన్ని అడుగుతూనే ఉండాలని ప్రజలు వైకాపాకు ఓటు వేసి గెలిపించలేదని.. దాన్ని సాధించాలని అధికారం కట్టబెట్టారన్నారు. ఎప్పటికప్పుడు దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో జగన్‌ భేటీ అవుతున్నారని.. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సీఎం జగన్‌ దిల్లీ వెళ్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

* కొవిడ్‌ నేపథ్యంలో ప్రపంచదేశాల విశ్వాసాన్ని కోల్పోయిన చైనా.. తాజాగా మానవహక్కుల విధానాలపైనా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. అమెరికా సహా 40 కీలక దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు చైనా మానవహక్కుల విధానాలపై పెదవి విరిచాయి. షింజియాంగ్‌ ప్రావిన్సు సహా టిబెట్‌ మైనారిటీలపై జరుపుతున్న అకృత్యాలను ఐరాస వేదికగా ఎండగట్టాయి. షింజియాంగ్‌లో వీగర్‌ ముస్లింల నిర్బంధాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకునేందుకు వెంటనే అంతర్జాతీయ నిపుణుల్ని అనమతించాలని డిమాండ్‌ చేశాయి. హాంకాంగ్‌ విషయంలోనూ చైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికాయి. అమెరికా, జపాన్‌, జర్మనీ సహా 39 ప్రముఖ దేశాలకు చెందిన ఈ ప్రకటనను జర్మనీ రాయబారి ఐరాస వేదికపై చదివి వినిపించారు. చైనా ఈ ప్రకటనను ఖండించింది.

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం ముమ్మర కృషి జరుగుతోంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌ల క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరుకున్నాయి. వీటిలో కొన్ని ప్రయోగదశల్లోనే స్వల్ప దుష్ప్రభావాలు చూపిస్తుండగా మరికొన్ని మాత్రం మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా చైనా తయారుచేసిన మరో వ్యాక్సిన్‌ కూడా ప్రయోగదశలో సురక్షితంగానే కనిపిస్తున్నట్లు ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ద్వారా కరివేపాకు కూడా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న సీతారామన్ జక్కులనెక్కలం వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మాట్లాడారు. రైతులు పండిస్తున్న పంటలు, గిట్టుబాటు ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో పరిస్థితిపై ఆరా తీశారు. రైతుల సమస్యలు, ఇబ్బందుల పరిష్కారానికే కేంద్రం నూతన చట్టం తీసుకొచ్చిందని చెప్పారు.

* దసరా, దీపావళి పండగల సీజన్‌లో ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్టు సంస్థ తెలిపింది. లఖ్‌నవూ-దిల్లీ, అహ్మదాబాద్‌-ముంబయిల మధ్య తేజస్‌ రైళ్లు అక్టోబర్‌ 17 నుంచి నడవనున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు.

* ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో అనిశా దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు నాంపల్లిలోని అనిశా కార్యాలయంలో నరసింహారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. అతని బినామీ ఆస్తులపై ఆరా తీశారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా నరసింహారెడ్డిని అధికారులు ఇప్పటికే రెండు రోజులు ప్రశ్నించినా పెద్దగా వివరాలు వెల్లడికాలేదని సమాచారం.

* అమెరికాలో ఎన్నికల ముందే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వస్తుందన్న అధ్యక్షుడి కల నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ విషయంలో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌తోపాటు నియంత్రణ సంస్థల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం అనుమతి నిబంధనలను అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(Fడా) కఠినతరం చేసింది. దీని ప్రకారం, వాలంటీర్లు వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న అనంతరం రెండు నెలల ఫాలోఅప్‌ సమాచారం అందించాలని స్పష్టం చేసింది.

* ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రాజకీయ నాయకుడు, నటుడు విజయకాంత్‌ మరోసారి ఆస్పత్రిలో చేరారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండడంతో గత నెల 22న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయనకి కొవిడ్‌-19 పరీక్షల నిర్వహించగా.. పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో చికిత్స అనంతరం ఈ నెల 2న ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి

* కరోనా సంక్షోభంతో నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఉపాసన, రామ్‌చరణ్‌ కలిసి ఆన్‌లైన్‌ డ్యాన్స్‌ షోను ఆరంభించబోతున్నారు. దివ్యాంగులు తమ జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించి.. వారి కలలను ఎలా సాకారం చేసుకుని, విజయం సాధించారో చూపించబోతున్నారు. దివ్యాంగుల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు అడుగులు వేయాలని ఉపాసన కోరారు. తపస్‌ అనే కుర్రాడు పుట్టుక నుంచి అనారోగ్యంతో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడో ఉపాసన వివరించారు.

* అమెరికన్‌ యూనివర్శిటీస్‌ కెన్నడీ పొలిటికల్‌ యూనియన్‌ ఇంటర్వ్యూలో ఫౌచి మాట్లాడారు. ‘కరోనా మహమ్మారి అభూత కల్పన అని నమ్మే మొండివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలి’ అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఫౌచి స్పందిస్తూ..‘‘ఈ వారం వైట్‌హౌస్‌ను చూడండి. అక్కడ జరుగుతున్నది వాస్తవం. ప్రతి రోజూ మరింత మంది కొవిడ్‌ బారిన పడుతుంటారు. ఇది అభూత కల్పన కాదు. ఇది దురదృష్టకర పరిస్థితి. అసలు ఇది చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చు’’అని అన్నారు.

* మాలీవుడ్‌ స్టార్‌ టొవినో థామస్‌ చిత్రీకరణలో గాయపడ్డారు. ‘కాలా’ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా ఆయన పొట్ట భాగానికి గాయమైంది. దీంతో ఆయన్ను చిత్ర బృందం కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 24 గంటలపాటు థామస్‌ ఆరోగ్యాన్ని పరిశీలించిన అనంతరం వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారట.

* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి కన్నకొడుకునే తల్లి హత్య చేసింది. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉష అనే మహిళ రెండునెలల క్రితం భర్త నుంచి విడిపోయి ప్రియుడు శ్రీనుతో ఉంటోంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తన కుమారుడిని ప్రియుడితో కలిసి తల్లి కడతేర్చింది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని నిందితులు తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చిపెట్టారు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి, ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.