Agriculture

మేమే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

మేమే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ సంస్థలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని, మార్కెట్లకు ధాన్యం తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై మంత్రులు, అధికారులతో మరోమారు సీఎం సమీక్ష నిర్వహించారు. కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ సంస్థలను గ్రామాలకు పంపి రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని తెలిపారు. వరికోతల కార్యక్రమం 45 రోజుల పాటు సాగుతుందని, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాలశాఖల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మొత్తం ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉందో పక్కాగా అంచనా వేయాలని, కొనుగోళ్ల కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సాగునీటి సౌకర్యం క్రమంగా పెరుగుతుండటంతో సాగులో లేని భూములు కూడా సాగులోకి వస్తున్నాయన్న సీఎం.. పట్టణాలకు వలస వెళ్లిన రైతులు కూడా రైతు బంధు సాయం వల్ల గ్రామాలకు తిరిగొచ్చి భూములను సాగు చేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీలు సహా రైతుల ధాన్యం అమ్మకం డబ్బు వెంటనే చెల్లించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.