NRI-NRT

నెల్లూరు కుర్రాడు న్యూజెర్సీలో మెరిశాడు

70th Birthday Special Story On The Life Of Chivukula Upendra

చివుకుల ఉపేంద్ర 70వ జన్మదినోత్సవం సందర్భంగా TNI ప్రత్యేక కథనం
ఆయన బాల్యం నెల్లురులో అల్లరిగా గడిచింది.
ఆయన తండ్రి ఆరు అణాల గుమస్తా.
అతి కష్టం మీద కొడుకును ఇంజనీరింగ్ చదివించి బ్రతుకు తెరువుకోసం బోంబేకు పంపించాడు.
ఆ కొడుకు అక్కడ అష్ట కష్టాలు పడి “మఠం నిద్ర సత్రం భోజనం లాగా కొంత కాలం గడిపాడు.
ఉన్నత చదువు కోసం అమెరికా వెళదామనుకున్నాడు.
తగిన డబ్బులు లేవని రెండు సార్లు వీసా నిరాకరించారు.
స్నేహితుడి సహకారంతో అమెరికా చేరుకున్నాడు.
అంచలంచలుగా ఎదిగి నేడు అమెరికాలో ఓ రాష్ట్రానికి మంత్రి అయ్యాడు. ఎవరాయన?
TNIనిర్వాహకుడు కిలారు ముద్దుకృష్ణతో ఆయన పంచుకున్న అంతరంగం చదవండి…
నెల్లూరు కుర్రాడు న్యూజెర్సీలో మెరిశాడు-70th Birthday Special Story On The Life Of Chivukula Upendra

##################

నా లక్ష్యం అమెరికా సెనెట్ – న్యూజెర్సీ మంత్రి చివుకుల ఉపెంద్ర ప్రస్థానం!

బడి ఎగ్గొట్టి పెన్నానది ఒడ్డున చేసిన షికార్లు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకున్న దాగుడుమూతలూ …. ట్రంకురోడ్డుపై చెక్కర్లు, నెల్లూరు నవాబుపేట సమీపంలోని అగ్రహారంలో గడచిన అందమైన బాల్యం నాది. నాకు ఊహ వచ్చే నాటికి మా నాన్న ఓ రైసె మిల్ లో గుమస్తాగా పని చేసేవారు. ఆయన మోసే భారం గురించి తెలియని వయసది. ఐదో తరగతి వరకు ఆడుతూ పాడుతూ అక్కడే చదివా. కాని అంతలోనే ఎదో తేడా తేలిసేది. బ్రతుకు భారమవుతున్నట్టు, ఇల్లు గడవటం కష్టమవుతోందని అర్ధమయ్యింది. ఆరుగురు పిల్లలం మరి. సంపాదన సరిపోకపోవడంతో మకాం మద్రాసుకు మార్చారు నాన్న. అప్పటిదాకా లోకం పోకడ తెలియని నాకు .మద్రాసు అదే ఇప్పటి చెన్నై ..ఎన్నో పాఠాలు నేర్పింది. జీవితంలో గెలవాలంటే చదువు ఎంత అవసరమో అక్కడే అర్ధమయ్యింది.

*** విద్యా పర్వం
మద్రాసులోని హిందూ థియొలాజికల్ ఉన్నత పాఠశాలలో పదకొండో తరగతి దాకా చదివాన్నెను. ఆ తర్వాత వివేకానందా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రధమ శ్రేణి మార్కులతో పీ.యూ.సీ పాసయ్యాను. గొప్ప కళాశాలగా పేరుపొందిన గిండి ఇంజనీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. అప్పట్లో నా చదువు చాలా వరకు స్కాలర్షిప్పుల మీదనే సాగింది. నా శ్రద్ధ గమనించిన నాన్న కుడా చాలా కష్టపడి సహకరించేవాడు. ఎంత కష్టపడినా పెదాలపై చిరునవ్వు చెరగనిచ్చేవాడ్ని కాదు. చిన్నప్పటీలాగానే స్నేహితులతో తిరుగుళ్ళూ షికార్లూ మామూలే. కాకపోతే ప్లేసు మారిందంతే! పెన్నొడ్డూకు బదులు మెరినా బీచ్. అలాగని చదువు నిర్లక్ష్యం చేసింది లేదు. అందులో ఎప్పుడూ ఫస్టే. 1972 నాటికి బీ.ఈ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఇంజనీరయ్యాను.

నెల్లూరు కుర్రాడు న్యూజెర్సీలో మెరిశాడు-70th Birthday Special Story On The Life Of Chivukula Upendra

*** ఉద్యోగ పర్వం
ఇంజనీరింగ్ పూర్తైన రెనెల్లకే ముంబై లోని బాబా ఆటమిక్ రీసర్చ్ సెంటర్ నుంచి ఇంటర్వూ కి రమ్మని పిలుపొచ్చింది. ఆశగా వెళ్ళాను. ఉద్యోగం మాత్రం రాలేదు. అంతలోనే నిరాశ . అక్కణ్ణుంచి తెరిగి చెన్నై వెళదామనె ఉంది…. కానీ అలా వెళ్ళి నాన్నకు భారం అవడం ఇష్టం లేకపోయింది. ఏదైతే అదే అయ్యిందని ఒక నిర్ణయానికొచ్చాను. ముంబైలోనే ఉండిపోయాను. చిన్నదా చితకదా అనే అలోచన లేకుండా ఎవేవో ఉద్యోగాలు చేశాను. సత్రం భొజనం , మఠం నిద్రలాగా పగలంతా ఉద్యోగం , రాత్రిపూట స్నేహితుల ఇళ్ళలో మకాం. అదిగో అక్కడే ఒక విలువైన జీవిత పాఠం నేర్చుకున్నాను. అదేంటంటే …..ఒక సారి ప్రయత్నించి విఫలమైనంత మాత్రాన డీలా పడిపోకూడదు. మనపని మనం చేసుకుంటూ పొతే తప్పక ఫలితం లబిస్తుందనేది ఆ పాఠం. నాకూ లభించింది… ఐ.ఒ.ఎన్ ఎక్సేంజ్ కంపెనేలో ఉద్యోగం రూపంలో నెలకు నాలుగొందల జీతం. జీవితంలో అదే నా తొలి గెలుపు. !

*** విదేశీ పర్వం
ఒక ఇంజనీరుగా అప్పట్లో నాకు జర్మనీ వెళ్ళలని ఉండేది. ఎందుకంటే ఆ దేశం ఇంజనీర్ల స్వర్గం. ముంబాయి లోని మాక్స్ ముల్లర్ భవనం లో కొన్నాళ్ళు జర్మన్ భాష కూడా నేర్చుకున్నాను. అయితే నా మిత్రులేమో అమెరికా అయితేనే బెటర్ అని నా చెవిన ఇల్లు కట్టుకొని మరీ పోరేవారు. సరే, అక్కడికెళ్ళి పైచదువులు చదవాలని నిర్ణయించుకున్నాను. విదేశమంటే మధ్యలో వీసా పర్వ(త)ం ఒకటి దాటాలి. కదా. అది నాకు రెండు సార్లడ్డొచింది. ‘నీకు అమెరికా వెళ్ళి చదివేంత స్థోమత లెదు ‘ అంటూ రెండుసార్లు వీసా నిరాకరించారు. కారణం మన ఖాతాలో నిల్వ నిల్ అక్కడ చదువు కోవాలంటే మన అకౌంట్లో నిర్ణీత మొత్తం ఉండాలి. అప్పుడు డాలర్ కు మనకు ఎనిమిది రూపయిలొచ్చేవి. అకౌంట్లో కనీసం నాలుగ వేల డాలర్లైనా ఉండాలి. అంటే అచ్చం గా 32 వేల రూపాయిలు. ఆశ వదిలేసుకుఇన్నాను. ముచ్చటగా మూడోసరి ముందుకే అడుగేశాను. చెప్పాను కదా పట్టు వీడని ప్రయత్నానికి ఫలితం తప్పక లబిస్తుందని … మరోసారి రుజువైంది. నా విషయంలో ఈసారి గోపాల్ బయ్ దేశాయి (గుజరాత్) ఆదుకున్నారు…. బ్యాంకు ఖాతాలో 32 వేల రూపంలో. డబ్బు అలా ఖాతాలో పడటమేంటి ఇలా వీసా నా చేతికొచ్చింది. 1974 మే ..అవకాశాల స్వర్గంగా పేరుపొందిన అమెరికా గడ్డపై తొలి సారిగా అడుగుపెట్టాను.

*** ప్రణయ పర్వం
న్యూయార్క్ సిటీ కాలేజీలో ఎం.ఎస్ లో చేరాను. అప్పట్లో దరఖాస్తు రుసుము పది డాలర్లు. అంటే నాలెక్కల ప్రకారం రూ.80 . రెండేళ్ళలోన ఎం.ఎస్ పూర్తయ్యింది. ఆ తర్వాత సరిగ్గా ఏడాది తిరిగే సరికి అంటే 1976 జూన్ లో నా సహాధ్యాయి డైసీతో (తనది క్యూబా) పెళ్లయింది. చదువుకునేటప్పుడు ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారి పెళ్ళయే సరికి మూడేళ్ళు పట్టింది. పెళ్ళయిన వెంటనే చెప్పలేదు కానీ కొన్నాళ్ళ తర్వాత ఇరువైపులా పెద్దవాళ్ళకు విషయం చెప్పాం. అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు వారికి .

*** రాజకీయ పర్వం
1981 నుంచి 1998 దాకా న్యూ జెర్సీలోని బెల్ లేబోరేటరీ లో ఇంజనీరింగ్ చేశాను. మరి రాజకీయ పర్వం అంటారా.. 1993 లో మొదలైంది. పాలిటిక్స్ మీద ఆసక్తి తో 93 లో డెమక్రటిక్ పార్టీ కార్య కలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాను. ఇండో అమెరికన్ ఫోరం ఫర్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో కీలక పాత్ర పోషించేవాడ్ని. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే రాజకీయ ఎదుగుదలకు నా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడ్ని. ఈసారి ఫలితం లభించింది. డెమొక్రటిక్ పార్టీ తరపున న్యూ జెర్సీ లో ని ఫ్రాంక్లిన్ నగర కౌన్సిలర్ గా ఎన్నికయ్యాను. అది 1997 ,1998 లో డిప్యూటీ మేయర్ ని. 2000 సంవత్సరం లో ప్రాంక్లిన్ నగర మేయర్ ని అయ్యాను. 2001 నా జీవితం లో మరచిపోలేని సంవత్సరమది. ఫ్రాంక్లిన్ నగరం నుంచే న్యూ జెర్సీ అసెంబ్లీ సభ్యుడి గా ఎన్నికయ్యా . నాటి నుంచి నేటి దాకా ప్రతి రెండెళ్ళకోసారి ఇక్కడి ప్రజలు తమ ప్రతినిధి గా అసెంబ్లీకి పంపుతూనే ఉన్నారు. 2007 లో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా నన్ను వరించింది. అప్పటి నుండి సెప్టెంబర్ 2014 వరకు న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నా. మొత్తం 7 సార్లు అసెంబ్లీ కి ఎన్నికయ్యా. ఇటీవలే న్యూజెర్సీ రాష్ట్ర ప్రజావసరాల శాఖ మంత్రి గా (బి.పి.ఓ) కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించా. నాకు వ్యక్తిగతంగా లభించిన సంతృప్తి ఎమిటంటే నేను అసెంబ్లీ కి ఎన్నిక అవకముందు అక్కడ రిపబ్లికన్ల హవా నడిచేది. ఇప్పుడా చాన్స్ లేదు. ఆ పార్టీ ప్రస్థానానికి అడ్డూగా అక్కడ చివుకుల ఉపెంద్ర అనే స్పీడ్ బ్రెకర్ ఉంది. ఆ స్థాయి లో ప్రజాభిమానం సంపాదించుకున్నా నన్నదే నా సంతృప్తి

*** కుటుంబ పర్వం
చెప్పాకదా , మా ఆవిడ డైసీ క్యూబా దేశస్థురాలు . మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ చక్కటి భారతీయ పేర్లే పెట్టుకున్నాం . అబ్బాయి సూరజ్ వాషింగ్టన్ డిసీ లో అటార్నీ గా పని చేస్తున్నాడు . అమ్మాయి దమయంతి గ్రాఫిక్ డెజైనింగ్ కోర్స్ లో శిక్షణపూర్తి చేసుకొని ప్రస్తుతం మాతోనే ఉంటుంది. అన్నట్టు మరో మాట డైసీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. నా కోసం నేర్చుకుంది. పిల్లలు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడతారు. మన పండగల్ని సాంప్రదాయ పద్ధతి లో జరుపుకుంటాం.

నెల్లూరు కుర్రాడు న్యూజెర్సీలో మెరిశాడు-70th Birthday Special Story On The Life Of Chivukula Upendra

*** భవిష్యత్ పర్వం
నెల్లూరులో ఎక్కడి అగ్రహారం..ఎక్కడి న్యూజెర్సీ అసెంబ్లీ తల్చుకుంటే ఇప్పుడనిపిస్తుంది…. ఒక నిర్ణయం … ఒకే ఒక్క నిర్ణయం! ఆ రోజు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం రాలేదన్న బాధతో వెనక్కి వెళ్ళిపోయుంటే …! వెళ్ళకూడదని ఆ నాడు తీసుకున్న నిర్ణయమే .. ఈనాడు నన్ను ఇంతటి స్థాయి లో నిలబెట్టింది. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అమెరికా కేంద్ర సెనెట్ (మన పార్లమెంట్ లాగా) అన్నట్టు నేను పుట్టీన తేదీ చెప్పనెలేదు కదూ…..1950 అక్టొబర్ 8. అరవైనాలుగు ఏళ్ళలోను సాధించిన విజయాలివి. ఇప్పుడు సగర్వంగా చెబుతున్నా. కేంద్ర సెనెటర్ గా ఎన్నికవ్వాలన్న నా లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తాను. ఇదే నా భవిష్యత్ పర్వం.

#####################

మనవాళ్ళకు ఆదర్శంగా..!

ఈ చిత్రంలో కన్పిస్తున్నది చివుకుల ఉపేంధ్ర. 40 ఏళ్ళ క్రితం చివుకుల ఉపేంధ్ర చదువు కోసం నెల్లూరు నుండి అమెరికాకు వచ్చారు. ఎలక్ర్టికల్‌ ఇంజినీర్‌గా స్థిరపడిన చివుకుల ఉపేంధ్ర అమెరికా రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. మన మంత్రుల్లాగా రాత్రికి రాత్రి డబ్బులు ఉండో లేదా పలుకుబడి ఉండో ఎమ్మేల్యేలుగా గానో మంత్రిగానో ఎన్నిక కాలేదు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రాంక్లీన్‌ నగర కౌన్సిలర్ గా ఉపేంద్ర రాజకీయ జీవితం ప్రారంభమయ్యంది. ఆ నగర డిప్యూటీ మేయర్‌గా, మేయర్‌గా పనిచేశారు. మంచి సమర్థుడైన ఉపేంధ్రను ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారి, రెండు సార్లు కాదు, ఏడు సార్లు ఎమ్మేల్యేగా ఎన్నుకున్నారు. ఐదు పర్యాయాలు న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. అమెరికాలో రాష్ట్రాలకు అధిపతులు గవర్నర్‌లు. మన దగ్గర ముఖ్యమంత్రిలాగానే గవర్నర్‌లు పరిపాలన చేస్తారు. ఆయన కింద పనిచేయటానికి కమీషనర్లను నియమించుకుంటారు. అంటే మన రాష్ట్రంలో మంత్రుల లాంటి వారే ఈ కమీషనర్లు. ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్లు ప్రతిపక్షాల వారికి కూడా పరిపాలనలో చోటు కల్పిస్తారు. చివుకుల ఉపేంధ్ర స్థానికంగా ప్రతిపక్షానికి చెందిన డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన సమర్థతను ప్రజల్లో ఆయనకు ఉన్న పలుకుబడిని గుర్తించిన న్యూజెర్సీ గవర్నర్‌ చివుకుల ఉపేంధ్రను తన టీమ్‌లోకి తీసుకున్నారు. న్యూజెర్సీ రాష్ట్ర ప్రజా అవసరాల శాఖ మంత్రిగా (బోర్డ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ యుటిలిటీస్‌ కమీషనర్‌) నియమించారు. చివుకుల ఉపేంద్ర అంచెలంచెలుగా ప్రముఖ స్థానానికి ఎదిగినప్పటికీ అమెరికా చట్టాలను, విధానాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఆయన కింద 400 మంది ఉద్యోగులు పనిచేస్తారు. వీరిలో ఒకరిని ఆయన తన వాహనం డ్రైవర్‌గా ఎంపిక చేసుకునే వెసులు బాటు ఉంది. అయినప్పటికీ ఉపేంధ్ర 65 ఏళ్ళ వయసులో తన కారును తానే నడుపుకుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకులో ఆయన వాహనానికి పెట్రోల్‌ నింపుకుంటున్నప్పుడు తీసిన చిత్రమిది. అమెరికా మంత్రిని చూసి మన మంత్రులు కొంతైనా నేర్చుకుని ఆదర్శంగా ఉంటే బాగుంటుందని ఇక్కడి ప్రవాసాంధ్రులు అభిప్రాయపడుతున్నారు.
నెల్లూరు కుర్రాడు న్యూజెర్సీలో మెరిశాడు-70th Birthday Special Story On The Life Of Chivukula Upendra