NRI-NRT

“ట్రంప్ డిఫీట్స్ కోవిడ్” నాణేలు

“ట్రంప్ డిఫీట్స్ కోవిడ్” నాణేలు

అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ ‘‘ట్రంప్‌ డిఫీట్స్‌ కొవిడ్’’ (ట్రంప్‌ కొవిడ్‌ను జయించారు) అనే పేరుతో స్మారక నాణేల విక్రయాన్ని చేపట్టింది. కొవిడ్‌ సోకిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వాల్టర్‌ రీడ్‌ ఆస్పత్రి నుంచి తిరిగి శ్వేతసౌధానికి వచ్చిన సందర్భంగా ఈ చర్య ప్రాముఖ్యం సంతరించుకుంది. శ్వేతసౌధంలోని అధికారిక విక్రయశాల ‘వైట్‌హౌస్‌ గిఫ్ట్‌ షాప్‌’ ఈ విషయాన్ని ప్రకటించింది. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే ఈ నాణెం విక్రయాలు స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. అయితే 100 డాలర్ల విలువ గల ఈ నాణెం పంపిణీ నవంబర్‌ 14నుంచి మొదలవుతుందని దీని రూపశిల్పి, వైట్‌హౌస్‌ గిఫ్ట్‌ షాప్‌ ఛైర్మన్‌ ఆంథోని గియాన్నిని తెలిపారు. ఈ నాణేల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కరోనా నివారణకు, క్యాన్సర్‌ బాధితుల చికిత్సకు అందచేస్తామని ఆయన వెల్లడించారు. ఇది ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో విడుదలయ్యే ఆఖరి స్మారక నాణెమని ఆంథొనీ అన్నారు. అయితే ఈ నాణెం నమూనా కానీ చిత్రాలు కానీ వెల్లడి కాలేదు. కాగా ట్రంప్‌కు బాక్సింగ్‌ అంటే ఇష్టం కనుక ఈ కొత్త నాణెం అధ్యక్షుడి ఓ సూపర్‌ హీరో లక్షణాన్ని కలిగి ఉంటుందని ఆయన సూచన ప్రాయంగా చెప్పారు.