Food

మట్టిపాత్రల్లో వంట…మహశ్రేష్ఠం

మట్టిపాత్రల్లో వంట…మహశ్రేష్ఠం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న పెద్దల మాటను ఆసాంతం ఒంటపట్టించుకునే ప్రయత్నం చేస్తోంది ఆధునిక తరం. అందుకే రసాయనాలతో పండించే పంటలకు టాటా చెబుతూ ఆనందంగా సేంద్రియమంత్రాన్ని పఠిస్తోంది. ఆహారంలోనే కాదు, ఆఖరికి దాన్ని వండుకునే పాత్రల్లోనూ తినే ప్లేటులోనూ కూడా ఆరోగ్యం తాండవించాలని కోరుకుంటోంది. అందులో భాగంగా వస్తున్నవే ఈ సరికొత్త మట్టిపాత్రలు..!
*నిన్నమొన్నటివరకూ ఇంట్లో మట్టి పాత్ర అంటే మంచినీళ్ల కుండ మాత్రమే. అది కూడా కేవలం వేసవిలో కొందరి ఇళ్లలో మాత్రమే కనిపిస్తుండేది. ఫ్రిజ్‌లో నీళ్లు తాగితే జలుబు చేస్తుందనో లేదా దాహం తీరడం లేదనో కుండల్ని వాడేవారు. కానీ ఇప్పుడు సీను మారింది. తమ ఇంటిని ఎత్నిక్‌లుక్‌తో అలంకరించాలని కొందరూ ఆరోగ్యం కోసం మరికొందరూ మొత్తమ్మీద ఎక్కువమంది మట్టిపాత్రలవైపు మొగ్గు చూపుతున్నారన్నది నిజం. అందుకే నిన్నమొన్నటివరకూ కుండలకీ గృహాలంకరణ వస్తువులకీ పరిమితమైన టెర్రకోట నేడు వంటింటిలోనూ తిష్ట వేసేసింది.
*మట్టి… మహా రుచి!
పాతకాలంలో బామ్మలు కట్టెలపొయ్యి దగ్గర కూర్చుని మట్టికుండలో పప్పుకూర వండినా అది వీధి చివరి వరకూ గుబాళిస్తూ ఆకలి పుట్టించేది. ఆ రుచికి కారణం మట్టేనని గ్రహించిన ఈ తరం మళ్లీ మూలాల్లోకి తొంగిచూస్తోంది. దాంతో ఇడ్లీ ప్లేటుల నుంచి పోపుల డబ్బాల వరకూ అదీ ఇదీ అన్న తేడా లేకుండా వంటింట్లో వాడుకునే అన్ని రకాల సామాన్లూ మట్టితో తయారవుతున్నాయి. అనేక కంపెనీలు అచ్చంగా మట్టితోనే వాటర్‌బాటిళ్లూ ఫ్రిజ్‌లతోబాటు కుక్కర్లూ పాన్‌లూ ట్రేలూ డిన్నర్‌ సెట్లూ కప్‌ సెట్లూ… ఇలా ఎన్నో రకాల వంటింటి సామగ్రిని తయారుచేస్తున్నాయి. చివరకు చేటల్ని సైతం మట్టితో తయారుచేస్తూ మట్టిమీద తమ ప్రేమను చాటుకుంటున్నాయి.
పప్పులూ ఉప్పులూ నిల్వ చేసుకునే డబ్బాలూ టీ కప్పులూ జగ్గులూ వంటి వాటినయితే అందమైన వర్లి చిత్రాలతోనూ తీర్చిదిద్దుతున్నాయి. కేవలం ఎవరికి వాళ్లు ఇళ్లలో వండుకోవడమే కాదు, అత్యాధునిక రెస్టరెంట్లూ లస్సీ సెంటర్లలో సైతం మట్టి కప్పులూ గ్లాసులూ ప్లేట్లూ పాత్రల్లోనే వండి వడ్డిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పిజ్జా చేయడానికి వాడే రాళ్లకు బదులుగా మట్టితో చేసిన టైల్స్‌నూ కేకులూ కుకీలూ బిస్కెట్ల్ల తయారీకి టెర్రకోటతో చేసిన ఓవెన్‌ ట్రేలనే వాడటం విశేషం.నిజానికి టెర్రకోట అనగానే అదేదో ఎర్రమట్టి అనుకుంటారు కానీ, టెర్ర కోట అన్నది ఇటాలియన్‌ పదం. అంటే కాల్చిన మట్టి అని అర్థం. పాత్రకి వాడే మట్టి రంగుని బట్టి అది ఎరుపు, గోధుమ, ముదురు గోధుమ, నలుపు, తెలుపు, నారింజ… ఇలా రకరకాల రంగుల్లో ఉంటుంది. వీటిని సాధారణంగా 600 నుంచి 1200 డిగ్రీల సెంటీగ్రేడు వరకూ కాల్చి తయారుచేస్తుంటారు. ఇందుకోసం మట్టిని ముందు రకరకాల అచ్చుల్లోకి పోసి పాత్రల్లా మలిచి ఆ తరవాత కాలుస్తుంటారు. ఇలా కాల్చేటప్పుడు మట్టిలో ఉండే ఐరన్‌ శాతంమీద దాని రంగు ఆధారపడి ఉంటుంది. మండించేటప్పుడు అందులోని ఖనిజాలు- ముఖ్యంగా ఐరన్‌ ఆక్సిజన్‌తో చర్య పొంది ఐరన్‌ ఆక్సైడ్‌గా మారడం వల్లే ఆయా పాత్రలు ఎర్రని ఎరుపు రంగుని సంతరించుకుంటాయి. దాంతో ఆ రంగులో ఉండే మట్టి వస్తువులన్నీ టెర్రకోటగా ప్రాచుర్యం పొందాయి. అదీగాక, రాజస్థాన్‌లో ఈ పేరుతో ఓ ఊరు ఉండటమూ అక్కడ ఈ మట్టి కళాఖండాలను ఎక్కువగా తయారుచేయడంతో టెర్రకోట అనేదానికి రాజస్థాన్‌ పుట్టిల్లుగా మారిపోయింది. కానీ కాల్చినమట్టితో రకరకాల పాత్రల్నీ కుండీల్నీ ఇతర గృహాలంకరణ వస్తువుల్నీ తయారుచేసే విధానం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది.
*మట్టిపాత్ర మంచిదేనా?
మట్టిలో ఖనిజాలూ, బి12 వంటి విటమిన్లూ సహజంగానే ఉంటాయి. కాబట్టి మట్టిపాత్రలో వండటం వల్ల అవన్నీ ఆహారంలోనూ కలుస్తాయి. పైగా మట్టికుండలో ఆహారం నెమ్మదిగా ఉడకడంతో అది రుచిగానూ పోషకభరితంగానూ ఉంటుంది. బెంగాలీలు పెరుగుని తప్పనిసరిగా మట్టికుండల్లోనే తోడు పెడతారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కుండల్లోనే పెరుగు తోడుపెట్టడం వాడుకలో ఉంది. కుండలోని పెరుగు చల్లగానూ చిక్కగానూ మంచి రుచిగానూ ఉంటుంది. రంధ్రాలున్న మట్టి కుండ లేదా పాత్రలో వండటం వల్ల ఉష్ణోగ్రత, ఆవిరి అన్నివైపులా పరచుకోవడంతో వంటకం బాగా ఉడుకుతుంది, నూనె తక్కువ పడుతుంది. ముఖ్యంగా మాంసాహారం మట్టికుండలో వండితే ఎంతో రుచిగానూ, మెత్తగానూ ఉంటుంది. అందుకే ఈ మధ్య రెస్టరెంట్లలో కుండ బిర్యానీ బాగా ప్రాచుర్యం పొందింది. పైగా మట్టికి క్షార గుణం ఉండటం వల్ల ఆహారంలోని ఆమ్ల గుణాలు నశిస్తాయి. అంతేకాదు, మట్టికుండలో ఆహారం త్వరగా చల్లారదు. కాబట్టి మాటిమాటికీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు. ఓవెన్లలో బేక్‌ చేయడానికీ ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని వాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఒక్కసారిగా వేడిని పెంచినా తగ్గించినా పగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీటిల్లో వండేటప్పుడు అది చూసుకుంటుండాలి. పైగా మట్టి పాత్ర ఏదయినాగానీ రంధ్రపూరితం కాబట్టి సాధారణ డిటర్జెంట్‌ సబ్బులూ లోషన్లూ వేసి రుద్దితే వాటిల్లోకి ఆహారపదార్థాలు ఇంకాస్త ఇరుక్కుపోతాయి. వేడినీళ్లలో నానబెట్టి బ్రష్షుతో రుద్దడంగానీ కొద్దిగా ఉప్పు లేదా బేకింగ్‌ సోడా వేసి కొబ్బరిపీచుతో తోమడంగానీ చేయాలి. కొత్త పాత్రలో చేపలు, రొయ్యలు వంటివి వండితే వాటి వాసన పట్టి త్వరగా పోదు. కాబట్టి అలాంటి వంటకాలు కొంత వాడిన తరవాత వండితే అంతగా వాసన పట్టదు.
*అయితే మట్టితో చేసే ఏ పాత్రకయినా అది మెరిసేలా గాజుతో పూత పూస్తే ఆ మట్టికి సహజంగా ఉండే రంధ్రాలన్నీ పూడుకుపోయి, అందులోని సుగుణాలు దెబ్బతింటాయి. అప్పుడు మట్టిదైనా లోహపాత్ర అయినా ఒకటే. అందుకే ఎలాంటి పూతా లేని వాటిని వాడటమే మేలు. అయితే నునుపూ గట్టిదనంకోసం కొందరు టెర్రకోట పాత్రలకు గాజుపొడికి బదులుగా మట్టినే పూతగా పూసి తయారుచేస్తున్నారు. ఇందువల్ల అందులోని సుగుణాలు దెబ్బతినకుండా ఉంటాయి. అయితే అందరూ అనుకున్నట్లు టెర్రకోట పాత్ర నేలలో కలవదు. ఒకసారి మట్టిని కాల్చడం వల్ల అది క్రిస్టల్‌ మాదిరిగా గట్టిగా తయారవుతుంది. అది మళ్లీ తిరిగి మట్టిలా మారదు. దాన్ని ముక్కలుగా చేసినా భూమిలో కలవదు. వేల సంవత్సరాలక్రితం పూర్వికులు వాడిన పాత్రలూ శిల్పాలూ నేటికీ తవ్వకాల్లో బయటపడ్డానికి అదే కారణం. మట్టిపాత్ర పర్యావరణ ప్రియమా కాదా అన్నది పక్కనబెడితే, ఆరోగ్యానికి మంచిదనడంలో ఎలాంటి సందేహం లేదు. కారణమేదయినా మట్టిపాత్రల్లో వండటం, తినడం అనేది నేటి తరానికి పేషన్‌గా మారిందన్నది మాత్రం నిజం.