Editorials

నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

నేడు ప్రపంచతపాలాదినోత్సవం

ఉత్తరం అందుకోవడం, రహస్యంగా విప్పి చదువుకోవడం, ఎవరైనా వస్తుంటే దిండికింద దాచుకోవడం ప్రేమికులకు ఖర్చులేని ఓ మధురానుభూతి. దూరంగా సైన్యంలోనో , మరో ఉద్యోగంలోనో ఉన్న భర్తో, కోడుకో ఉత్తరం రాస్తాడనీ, క్షేమ సమాచారం చెబుతాడనీ వీధి వంక చూస్తూ గడిపే కాలం ఇంకా మధురమైనది. అయితే సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు రాసుకునే తరం అంతరించిపోయింది. ఇంటికి వచ్చిన ఉత్తరాలను పొడవాటి ఇనుప కమ్మీకి గుచ్చిఉంచడం. అవసరమైనపుడు మళ్లీ తీసి చదువుకోవడం రెండు మూడు దాశాబ్దాల క్రితం ప్రతి ఇంటా ఉండేది. ఆడపల్లిచదివి ఊళ్లేలాలా… ఉత్తరాలు చదువుకోగలదు చాలు అన్న కాలం కూడా అదే… రోజులు మారి, కంప్యూటర్, మొబైల్ ఫోన్లు, అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన నేటికాలంలో ఉత్తరాలు రాయటం దాదాపు లేదనే చెప్పాలి. ఇపుడు పోస్ట్ అంటే బ్యాంకు నుంచి, సెల్ ఫోన్ కంపెనీల నుంచీ వచ్చే బిల్లులు, డేటా వివరాలు మాత్రమే. కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ ఖర్చుతో సమాచారాన్ని దూరతీరాలలోని ఆత్మీయులకు చేరవేయడానికి తపాలా రంగం అందించిన సేవలు వెలకట్టలేనివి.

ఏటా అక్టోబర్ 09 తేదీని ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకుంటారు. 1874లో స్విస్ క్యాపిటల్ లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రారంభమైంది. 1969లో జపాన్లో జరిగిన యుపిసి సమావేశంలో ప్రపంచ తపాలా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. నిత్యజీవితంలో తపాలా పాత్రను ప్రజలకు గుర్తుచేయడానికి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తారు.

క్రీ.శ. 1600 లలో ఒక చిన్న పాయగా మొదలైన తపాలా విధానం తరువాత అన్ని దేశాలకు వేగంగా ప్రాకిపోయింది. 1800 నాటికి ప్రపంచ తపాలా వ్యవస్థ ఏర్పడింది. కాగా 1837లో మన దేశంలో తపాలా వ్యవస్థ ప్రారంభమైంది. జూలై1,1852లో తపాలాబిల్ల (పోస్టల్ స్టాంప్) అప్పటి సింధ్ (ఇప్పటి పాకిస్తాన్) ప్రాంతంలో తొలుత వాడుకలోకి వచ్చింది.