Business

ఇక డబ్బులు 24గంటలు పంపుకోవచ్చు-వాణిజ్యం

ఇక డబ్బులు 24గంటలు పంపుకోవచ్చు-వాణిజ్యం

* బ్యాంకు ఖాతాదారులకు ఊరటగా నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్టీజీఎస్‌) ఇక వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం మినహా మిగిలిన అన్ని వర్కింగ్‌ డేస్‌లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

* బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ కొండెక్కుతున్నాయి. రోజుకో తీరుగా సాగుతున్న పసిడి పయనంతో స్వర్ణం సామాన్యుడికి దూరమవుతోంది. ఇక డాలర్‌ క్షీణించడం, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో పసిడి భారమవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం 515 రూపాయలు పెరిగి 50,690 రూపాయలు పలికింది. కిలో వెండి ఏకంగా 1229 రూపాయలు పెరిగి 61,748 రూపాయలకు ఎగబాకింది.

* వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్‌ 327 పాయింట్లు జంప్‌చేసి 40,509 వద్ద నిలవగా.. నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 11,914 వద్ద ముగిసింది. తద్వారా 12,000 పాయింట్ల మైలురాయికి సమీపంలో స్థిరపడింది. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో మార్కెట్లు పాలసీ ప్రకటన తదుపరి మరింత బలపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,585 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,067 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 11,939- 11,805 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్‌-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కే సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. క్యూ4 నుంచీ జీడీపీ రికవరీ బాట పట్టనున్నట్లు అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అవసరమైతే మరిన్నివిధాన చర్యలకు సిద్ధమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

* ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 307 పాయింట్లు జంప్‌చేసి 40,450ను తాకింది. కాగా.. పీఈ సంస్థ క్లిక్స్‌ గ్రూప్‌ నుంచి నాన్‌బైండింగ్‌ ఆఫర్‌ వచ్చిన వార్తలతో ప్రయివేట్‌ రంగ సంస్థ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. మరోవైపు గుజరాత్‌ ప్లాంటు నుంచి సిమెంట్‌ విక్రయాలు ప్రారంభమైనట్లు వెల్లడించడంతో జేకే సిమెంట్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి.

* ఆర్‌బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుడుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో తొలుత లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 355 పాయింట్లు జంప్‌చేసి 40,538ను తాకగా.. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 11,918 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,543 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,067 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. పాలసీ నిర్ణయాలలో భాగంగా ఆర్‌బీఐ గృహ రుణాలపై రిస్క్‌ వెయిట్స్‌ను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. వ్యక్తిగత గృహ రుణాల విషయంలో రుణ పరిమాణం, రుణ విలువ తదితర అంశాల ఆధారంగా వివిధ రిస్క్‌ వెయిట్స్‌ అమలుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.