Business

ఇండియా చేతిలో స్విస్ బ్యాంకర్ల వివరాలు-వాణిజ్యం

India Gets Hold Of Indian Swiss Banker Details

* విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్‌ను అందుకుంది. ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్‌ నుంచి మొదటి సెట్‌ను భారత్‌ అందుకుంది. తాజాగా ఈ ఏడాది భారత్‌ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్‌టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

* కొత్త కారు కొనుగోలుదార్లకు రూ.2.50 లక్షల వరకు ప్రయోజనాలు ఇవ్వనున్నట్లు హోండా కార్స్‌ ఇండియా ప్రకటించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో అమ్మకాలు పెంచుకోవడానికి నగదు రాయితీలు, పొడిగించిన వారెంటీ, నిర్వహణ కార్యక్రమం రూపంలో ఈ ప్రయోజనాలు అందిస్తామంది.. అక్టోబరు 31 వరకు దేశవ్యాప్తంగా ఉన్న హోండా విక్రయశాలల్లో అమేజ్‌, 5వ తరం సిటీ, జాజ్‌, డబ్ల్యూఆర్‌-వీ, సివిక్‌ మోడళ్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. సివిక్‌ కొనుగోలుపై గరిష్ఠంగా రూ.2.50 లక్షల వరకు ప్రయోజనాలను పొందొచ్చని, 5వ తరం హోండా సిటీపై రూ.30,000 వరకు ప్రయోజనాలు ఇస్తున్నట్లు హోండా వెల్లడించింది. పాత హోండా కారును ప్రస్తుత వినియోగదారులు మార్చుకుంటే లాయల్టీ బోనస్‌, ప్రత్యేక ఎక్స్ఛేంజీ ప్రయోజనాలు పొందొచ్చని తెలిపింది. 100 శాతం వరకు ఆన్‌రోడ్‌ ఫైనాన్స్‌, తక్కువ ఈఎంఐ ప్యాకేజీలు, దీర్ఘకాల రుణాలను వినియోగదారులకు అందించేందుకు కంపెనీలు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టు కట్టింది.

* ఇతర పోటీ టెలికాం సంస్థల నుంచి తమ నెట్‌వర్క్‌కు మారే పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు సెక్యూరిటీ రుసుము రద్దు చేస్తున్నట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. ప్రస్తుత చందాదార్లకు ఇస్తున్న డేటా క్రెడిట్‌ లిమిట్‌ సౌలభ్యాన్ని ఈ వినియోగదారులకు కూడా వర్తింపజేయనున్నామని పేర్కొంది. ‘ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ ప్లాన్‌లో చేరే వినియోగదార్లకు క్రెడిట్‌ లిమిట్‌ క్యారీ ఫార్వర్డ్‌ సదుపాయాన్ని అందిస్తున్నాం. ఇలాంటి సౌలభ్యం గతంలో ఎన్నడూ లేదు. అది కూడా పూర్తి ఉచితంగా. సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా కట్టనవసరం లేద’ని జియో అధికారి ఒకరు తెలిపారు. పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్‌ తీసుకున్న వాళ్లకు 500 జీబీ డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. ‘వినియోగించగా మిగిలిన డేటాను వచ్చే నెలలోనూ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు వాడుకోవచ్చు. జియో వాట్సప్‌ నెంబరుకు మెసేజ్‌ చేసి జియో నెట్‌వర్క్‌కు మారొచ్చు. ఇప్పుడు వాడుతున్న టెలికాం సంస్థ పోస్ట్‌పెయిడ్‌ బిల్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంద’ని ఆ అధికారి అన్నారు.

* రూ.100 కోట్లకు మించి టర్నోవరు ఉన్న వ్యాపారులు/ కంపెనీలు కూడా జనవరి నుంచి బీటూబీ (కంపెనీల నుంచి కంపెనీలకు) లావాదేవీలకు ఎలక్ట్రానిక్‌ రశీదు (ఇ-రశీదు) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.500 కోట్లుగా ఉంది. రూ.500 కోట్లకు మించి టర్నోవరు ఉన్న కంపెనీలకు అక్టోబరు 1 నుంచి జీఎస్‌టీ ఇ-రశీదు విధానాన్ని ప్రభుత్వం వర్తింపజేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి దీనిని రూ.100 కోట్లకు మించి టర్నోవరు ఉన్న వ్యాపారులు/ కంపెనీలకూ విస్తరించనుందని ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. ఇ-రశీదు విధానంతో కాగితం రూపంలో రశీదు ఇవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత ఇ-వేబిల్లు వ్యవస్థను కూడా ఇది మార్చనుంది. పన్ను చెల్లింపుదార్లు ప్రత్యేకంగా ఇ-వేబిల్లు తీసుకోవాల్సిన అవసరం మున్ముందు ఉండకపోవచ్చు. ‘చిన్న వ్యాపారులు, ఎంఎస్‌ఎమ్‌ఈలకు ఇ-విధానం అందుబాటులోకి వస్తే జీఎస్‌టీ రిటర్న్‌లు నింపడం సులువు అవుతుంది. లావాదేవీల వివరాలు రిటర్న్‌ ఫారాల్లో ముందుగానే నిక్షిప్తం అవుతుండటమే ఇందుకు కారణం. అందువల్ల పన్ను చెల్లింపుదార్లు కేవలం పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. అటు ఇ-రశీదులు జారీ చేసిన సరఫరాదార్లు కూడా రిటర్న్‌లను సులభంగా నింపుకోవచ్చ’ని అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఇ-రశీదు విధానంలో ఇప్పటివరకు అంటే ఏడు రోజుల్లో ఇన్‌వాయిస్‌ రిఫరెన్స్‌ నెంబరు (ఐఆర్‌ఎన్‌) సంఖ్య 13.69 లక్షలకు చేరుకోవడం గమనార్హం.

* విదేశీ మారకపు నిల్వలు మళ్లీ పెరిగాయి. అక్టోబరు 2తో ముగిసిన వారంలో 361.80 కోట్ల డాలర్లు పెరిగి 54563.80 కోట్ల డాలర్లకు చేరాయి. అంతకుముందు సెప్టెంబరు 25తో ముగిసిన వారంలో మారకపు నిల్వలు 301.70 కోట్ల డాలర్లు తగ్గి 54202.10 కోట్ల డాలర్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. సమీక్షా వారంలో (అక్టోబరు 2తో ముగిసిన) మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 310.40 కోట్ల డాలర్లు పెరిగి 50304.60 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడం విదేశీ మారకపు నిల్వలు పెరిగేందుకు తోడ్పడ్డాయి. పసిడి నిల్వలు కూడా 48.6 కోట్ల డాలర్లు పెరిగి 3648.60 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌లు) 40 లక్షల డాలర్లు పెరిగి 147.60 కోట్ల డాలర్లుగా నమోదుకాగా.. ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల స్థితి కూడా 2.3 కోట్ల డాలర్లు పెరిగి 463.10 కోట్ల డాలర్లకు చేరాయి.