DailyDose

విద్యాకానుకలో మోడీకి వాటా ఉంది-తాజావార్తలు

విద్యాకానుకలో మోడీకి వాటా ఉంది-తాజావార్తలు

* పంజాబ్‌కు మరో పరాజయం. గొప్ప ఆరంభం లభించినా ఓటమి చవి చూసింది. ఆఖరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో కోల్‌కతానే పైచేయి సాధించింది. అబుదాబి వేదికగా శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కార్తిక్‌ సేన రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు సాధించింది. సారథి దినేశ్‌ కార్తిక్‌ (58) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది.

* తెలంగాణలో వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వరిధాన్యం సేకరణ కోసం 5,690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ పంట కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా జరగనున్న వరిధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది.

* బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆయా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్‌ ఈ నెల 28న జరగనుండటంతో ప్రచారానికి కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 30 మంది ప్రచార తారలు (స్టార్‌ క్యాంపెయినర్లు)ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది.

* ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన సమరం జరుగుతోంది. దుబాయ్‌ వేదికగా చెన్నై, బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు.

* ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్న విద్యాకానుక’ పథకంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే ‘మోదీ-జగనన్న విద్యా కానుక’ అనడం సమంజసమన్నారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మాత్రమే భరిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులకు తదితరాలకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులు వెచ్చిస్తోందంటూ ట్వీట్‌ చేశారు.

* ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం 57 మంది మంత్రులతో ప్రధాని మోదీ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయగా అందులో 24 మంది కేబినెట్‌ మంత్రులు. వీరిలో భాజపాయేతరులు ముగ్గురు. అయితే రాజకీయ కారణావల్ల శివసేనకు చెందిన అరవింద్‌ సావంత్‌, శిరోమణి అకాళీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తాజాగా లోక్‌జన శక్తి పార్టీ నుంచి మంత్రిగా ఉన్న రామ్‌విలాస్‌ పాసవాన్‌ కన్నుమూయడంతో ఉన్న ఆ ఒక్క భాజపాయేతర కేబినెట్‌ మంత్రి కూడా లేనట్లయింది.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 73,625 కరోనా పరీక్షలు చేయగా 5,653 మందికి కరోనా బారినపడగా.. 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,50,517కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,659 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. మొత్తంగా 6,97,699 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,194 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. 46,624 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

* బిహార్‌ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ (భాజపా) కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశమైంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. బిహార్‌ ఎన్నికలపై వారం వ్యవధిలో జరుగుతున్న రెండో భేటీ కావడం గమనార్హం.

* యాపిల్‌ ఎట్టకేలకు ఐఓస్‌ 14తో హోంస్ర్కీన్‌ కస్టమైజ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో కస్టమ్‌ ఐకాన్‌ ప్యాక్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఫోన్‌ రూపురేఖలు మార్చుకోవచ్చు. ఇప్పటికే ఐఫోన్‌ వినియోగదారులు హోం స్ర్కీన్‌ను రకరకాలుగా మార్చి స్ర్కీన్‌షాట్‌లను సోషల్‌మీడియాలో పెడుతున్నారు. ఈ ట్రెండ్‌ కస్టమ్‌ యాప్‌ ఐకాన్స్‌ తయారు చేసే ఓ డిజైనర్‌కు కాసులు కురిపించింది. ఆయన ఆరు రోజుల్లో 1,15,000 డాలర్లు(సుమారు రూ.84లక్షలు) సంపాదించాడు.

* టీఆర్పీ కుంభకోణంలో ముంబయి పోలీసుల నుంచి సమన్లు అందుకున్న రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) శివ సుబ్రమణియం సుందరం విచారణకు గైర్హాజరయ్యారు. ఈ అంశంపై తమ టీవీ ఛానెల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిందన్న కారణం చూపుతూ విచారణకు హాజరుకాలేదు. వారంలోగా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని, అంతవరకకు తన వాంగ్మూలాన్ని నమోదు చేయొద్దని కోరినట్లు పోలీసులు తెలిపారు.