Food

ముల్లంగి బాగా తినాలి

Raddish Is Not Rubbish - Eat It Plenty

మనం కొనే కూరగాయల జాబితాలో అన్ని రకాలూ ఉంటాయి కానీ, ముల్లంగి పేరు కనిపించదు. ఎవరైనా గుర్తు చేసినా అయిష్టంగానే జోడిస్తాం. కూరగాయల బండి మీద కూడా అంతే! అన్ని వెరైటీలూ చకచకా అమ్ముడైనా ఓ మూలన ముల్లంగి మూల్గుతూ పడి ఉంటుంది. అందులోని పోషకాల విలువలు తెలిస్తే మాత్రం ఎవరైనా ఎగబడి కొనేస్తారు. ఆ సూపర్‌ఫుడ్‌ చేసే మేలు గురించి పోషకాహార నిపుణురాలు కవితా దేవగణ్‌ ‘ఫిక్స్‌ ఇట్‌ విత్‌ ఫుడ్‌’ అనే పుస్తకంలో చెప్పిన సంగతులివి..
*బరువు తగ్గాలని రకరకాల డైటింగ్‌ సూత్రాలు పాటిస్తూ కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. కానీ, పోషకాలతో కూడిన ఆహారాన్ని తింటే ఆకలిని జయిస్తూనే బరువు తగ్గొచ్చు. అలా శరీరానికి సత్తువ ఇచ్చి కొవ్వును కరిగించే ఆహారాలే సూపర్‌ఫుడ్స్‌. వీటిలో ఒకటి ముల్లంగి. కొంచెం చేదుగా.. ఇంకొంచెం ఘాటుగా.. ఉండే ముల్లంగిని ఇష్టంగా తినేవాళ్లు తక్కువే! శీతకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ముల్లంగి సీజనల్‌ జబ్బులకు చెక్‌ పెడుతుంది. ఇందులో కేలరీలు తక్కువ. 100 గ్రాముల ముల్లంగిలో 20 కన్నా తక్కువ కేలరీలు ఉంటాయి. విటమిన్‌-సి, ఫోలేట్‌, బి6, రైబోఫ్లేవిన్‌, థయమిన్‌ లాంటి విటమిన్లు, ఇనుము, మెగ్నీషియం, రాగి లాంటి ఖనిజ లవణాలు దీనిలో పుష్కలం.
*బరువు తగ్గించే డాక్టర్‌
ముల్లంగిలో నీటి శాతం ఎక్కువ. ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ కాబట్టి రక్తంలో చక్కెరలను పెరగకుండా స్థిరంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికీ, షుగర్‌ నియంత్రణకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. డైట్‌లో ముల్లంగిని చేరిస్తే కడుపు నిండుగా అనిపిస్తుంది. తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
**యాంటీఆక్సిడెంట్ల గని
ఆంథోసయనిన్లు అనే యాంటీ ఆక్సిడెంట్లు ముల్లంగిలో పుష్కలం. ఇవి గుండెకు మేలుచేయడమే కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇందులోని ఆంథోసయనిన్లతోపాటు ఫోలిక్‌ ఆమ్లం, విటమిన్‌-సి క్యాన్సర్‌ నివారణలో సమర్థంగా పనిచేస్తాయి. క్రమం తప్పకుండా ముల్లంగి తింటే.. రక్తంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరగకుండా ఉంటాయి. ఫలితంగా గుండె నిశ్చింతగా ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది.
**చలికాలపు నేస్తం
శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలు చలికాలంలో ఎక్కువ. ఈ కాలంలో అధికంగా లభ్యమయ్యే ముల్లంగి ఈ జబ్బులను సమర్థంగా ఎదుర్కొంటుంది. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరకుండా నివారిస్తుంది. ముక్కు దిబ్బడ, గొంతులో ఇన్‌ఫెక్షన్‌, వాయునాళంలో ఇరిటేషన్‌ లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. జలుబు, శ్వాస మార్గాలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, అలర్జీల బాధను ఉపశమింపజేస్తుంది.
**కిడ్నీలకు మేలు
కిడ్నీల ఆరోగ్యానికి ముల్లంగి ఆకులు మేలు చేస్తాయి. ఇవి సహజసిద్ధమైన వడపోత వ్యవస్థగా పనిచేస్తాయి. పొట్టలో నీరు చేరి ఉబ్బరంగా ఉన్నవాళ్లకు ముల్లంగి ఆకులు ఔషధాల్లా ఉపయోగపడుతాయి. అంతేకాదు, వీటిలోని బి-6 విటమిన్‌ కిడ్నీలో రాళ్లు కరగడానికి సహాయపడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ముల్లంగి ఆకులను ఆహారంలో చేరిస్తే మలబద్ధకం పరారవుతుంది. ఇవి పేగుల్లో పెరిస్టాల్టిక్‌ కదలికలు సజావుగా జరిగేలా ప్రేరేపిస్తాయి. ఫలితంగా మలబద్ధకం, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది.
**ఎలా తినాలి?
రోజూ ముల్లంగిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది. వెజిటేబుల్‌ సలాడ్‌లో ముల్లంగి ముక్కలను కలుపుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఆకులను కూడా సలాడ్‌లో వాడుకోవచ్చు. ముల్లంగిని ఎక్కువమంది సాంబారులో వాడుతారు. కానీ, ముల్లంగి కూర టొమాటోతో బావుంటుంది. ముల్లంగి ఆకుల్లో పెసరపప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ముల్లంగితో పచ్చడి చేసుకోవచ్చు, ఊరగాయ పెట్టుకోవచ్చు. వెల్లుల్లితో రోస్ట్‌ చేసి, శాండ్‌విచ్‌తో లాగించేయొచ్చు. మరి, మార్కెట్‌కు బయల్దేరండి.
**ఆకులూ ముఖ్యమే
ముల్లంగిని కొనేటప్పుడు చాలామంది ఆకులను తొలగించి తీసుకుంటారు. వాటిని పడేస్తుంటారు. కానీ ముల్లంగి గడ్డలు ఎంత ఆరోగ్యాన్నిస్తాయో, ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి. వీటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ముల్లంగి ఆకులు నీరసాన్ని హరిస్తాయి, రక్తహీనతను తగ్గిస్తాయి. ముల్లంగి గడ్డలలో కన్నా ఆకుల్లో విటమిన్‌-సి ఆరువంతులు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. విటమిన్‌-ఎ, థయమిన్‌ (బి-1 విటమిన్‌), పైరిడాక్సిన్‌ (బి-6), ఫోలిక్‌ ఆమ్లం (బి-9), కాల్షియం వంటి పోషకాలు పుష్కలం. ముల్లంగి ఆకుల్లో అధికంగా ఉండే పొటాషియం, ఐరన్‌, విటమిన్‌-సి, డయెటరీ ఫైబర్లు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరగకుండా అడ్డుకొని గుండెకు మేలు చేస్తాయి. ఆకుల్లోని యాంటి ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వయసురీత్యా వచ్చే పిగ్మెంటేషన్‌ను వాయిదా వేస్తాయి. చర్మంపై ఏర్పడిన మచ్చలను త్వరగా మటుమాయం చేయడమే కాదు యవ్వనంతో మెరిసేలా చేస్తాయి. కాబట్టి, ముల్లంగి ఆకులను చిన్నచూపు చూడకండి.