NRI-NRT

ఎన్నారైలకు ఇక ఇండియాలో వైద్య సీట్లు కష్టమే

Supreme Court Of India Says NRI Medical Seats Are Not A Right

ప్రైవేటు పీజీ వైద్య విద్యా కళాశాలల్లో ప్రవాస భారతీయుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు అతి ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఎన్నారైలకు సదరు కోటా కింద సీట్లు కేటాయించి తీరాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రైవేటు పీజీ వైద్య కళాశాలల్లో రిజర్వేషన్లు ఎన్నారై అభ్యర్థులు హక్కు కాదని.. వారికి సీట్లు కేటాయించాలా? వద్దా? అనేది ఆయా సంస్థల స్వతంత్ర నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్‌ పీజీ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ అడ్మిషన్‌ బోర్డు ఎన్నారై కోటాను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నారై అభ్యర్థులకు కోటా ప్రకారం కాకుండా వారి వారి అర్హతల ప్రకారం సీట్లు కేటాయిస్తామని కూడా బోర్డు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఇద్దరు విద్యార్థులు సవాలు చేసిన నేపథ్యంలో సుప్రీం, పై తీర్పును వెలువరించింది. ‘‘ఏ విద్యా సంవత్సరంలోనైనా ఎన్నారై కోటా ఉల్లంఘించరానిదేమీ కాదు. అయితే ఏదైనా విద్యా సంస్థ లేదా రాష్ట్ర స్థాయి అధికారిక సంస్థ ఆ కోటాను రద్దు చేయాలని భావించినప్పుడు.. ఆ నిర్ణయానికి వచ్చేందుకు గల సహేతుకమైన కారణాలను తెలుపుతూ ప్రకటనను విడుదల చేయాలి. ఈ చర్య అభ్యర్థులు ఇతర చోట్ల సీట్లను కోల్పోకుండా ఉండేందుకు సహాయకారి కాగలదు.’’ అని న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వర రావు, ఎస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.