Business

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు-వాణిజ్యం

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు-వాణిజ్యం

* దిగొచ్చిన ఏపీ… దసరాకు ముందే ఏపీ, టీఎస్ మధ్య బస్సులు!ఒప్పందం దిశగా ఇరు రాష్ట్రాల అడుగులుతెలుగు రాష్ట్రాల మధ్య అతి త్వరలో ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు రంగం సిద్ధమైంది. అంతరాష్ట్ర బస్ సర్వీసులు నడిపేందుకు డీల్ కుదుర్చుకునే దిశగా రెండు ఆర్టీసీలు అడుగులు వేస్తున్నాయి. దసరా సీజన్ ప్రారంభం కావడానికి ముందే బస్సులు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు లక్ష కిలోమీటర్లను తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించినట్టు సమాచారం.రోజురోజుకూ ఆర్టీసీ భారీ నష్టాల్లోకి కూరుకుపోతూ ఉండటంతో, టీఎస్ అధికారులు పట్టుబట్టినట్టుగా, తెలంగాణలో తమ బస్సులను 1.61 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిప్పేందుకు ఏపీ అధికారులు ఒప్పుకుని, ఈ మేరకు సమాచారాన్ని పంపినట్టు తెలుస్తోంది. సోమ లేదా మంగళవారాల్లో జరిగే మరో సమావేశంలో దీనిపై మరింత స్పష్టత రానుంది.వాస్తవానికి ఏపీకి తెలంగాణ రూట్లలో రూ. 590 కోట్ల ఆదాయం వస్తుండగా, టీఎస్ కు ఏపీ రూట్లలో రూ. 290 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. బస్సులు ఆగిపోయిన తరువాత ఏపీకే అధిక నష్టం సంభవిస్తుండటంతో, నష్ట నివారణకు మరో మెట్టు దిగి, ముందు బస్సులు నడిపిస్తే చాలన్నట్టుగా, కిలోమీటర్లను తగ్గించుకునేందుకు సంకేతాలు ఇచ్చిందని సమాచారం.ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లది ఇష్టారాజ్యమైపోయి, అధిక చార్జీలను వసూలు చేస్తుండటం కూడా, సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు పడటానికి కారణమైంది. లాక్ డౌన్ కు ముందు ఏపీ నుంచి 72 రూట్లలో 1006 బస్సులు తెలంగాణకు నడుస్తుండగా, టీఎస్ నుంచి 27 రూట్లలో 746 బస్సులు మాత్రమే ఏపీకి వెళుతున్నాయి. ఈ వ్యత్యాసం ఇకపై ఉండరాదని టీఎస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.అందుకు అనుగుణంగానే ఏపీతో ఒప్పందం చేసుకోవాలని భావించిన టీఎస్, తాము మాత్రం కిలోమీటర్లను పెంచుకోబోమని, ఏపీ కిలోమీటర్లను తగ్గించుకుంటే, అభ్యంతరం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారుల చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడగా, ఏపీ దిగిరావడంతో దీనికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

* భారతదేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంది. దేశంలో బంగారాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. వివాహాది శుభకార్యాల్లో నగలు లేదా పెట్టుబడి కోసం బంగారం కొనేందుకు భారతీయులు ఇష్టపడతారు. బంగారంపై పెట్టుబడికి సంబంధించినంతవరకు, ఫిజికల్ బంగారానికి బదులుగా డబ్బును ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ ఎంపికలలో ఒకటి ఇటిఎఫ్ (ఎక్స్ ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్). పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను సంపాదించడానికి బంగారు ఇటిఎఫ్‌లు గొప్ప ఎంపిక. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా బంగారు ఇటిఎఫ్‌లపై ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సెప్టెంబరులో గోల్డ్ ఇటిఎఫ్ లో 579 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు డేటా విడుదలైంది. ఆగస్టులో బంగారు ఇటిఎఫ్‌ల మూలధనం రూ .907.9 కోట్లు. ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ .5,957 కోట్ల నికర పెట్టుబడిని సేకరించారు. మెరుగైన రాబడిని ఇచ్చే విషయంలో గోల్డ్ ఇటిఎఫ్‌లు చాలా ముందున్నాయి. ఈ కారణంగా పెట్టుబడిదారులు వాటిని చాలా ఇష్టపడుతున్నారు. ఇది మాత్రమే కాదు, నిపుణుల అభిప్రాయం ప్రకారం గోల్డ్ ఇటిఎఫ్ ల నుండి మెరుగైన రాబడి వచ్చే అవకాశం ఉంది.

* ఎక్స్‌ షోరూం ధర, ఆన్‌రోడ్‌ ప్రైస్‌.. ఆటోమొబైల్‌ రంగంపై అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పదాలివి. కానీ కొత్తవాళ్లకైతే బొత్తిగా తెలియదు. రెండు ధరల మధ్య ఆ తేడా ఎందుకో అర్థం కాదు. తేలిగ్గా చెప్పాలంటే.. వాహన తయారీకి అయ్యే ఖర్చునే ఎక్స్‌ షోరూం ధర అనొచ్చు. ఆపై ప్రభుత్వానికి కట్టే పన్నులు, డీలరు తీసుకునే లాభం, ఇతరాలన్నీ కలిపి వాహనం రోడ్డుపైకి వచ్చేసరికి అయ్యే మొత్తం రేటుని ఆన్‌రోడ్డు ధర అంటారు. ఈ రెండింటి మధ్య తేడా కనీసం పదిశాతమైనా ఉంటుంది. డీలరుతో జాగ్రత్తగా బేరమాడితే కొన్ని ఛార్జీలపై డబ్బు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

* 2050 నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్‌ 2050 నాటికి జపాన్‌, జర్మనీని వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరుకోనున్నట్లు లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాల్లో పని చేస్తున్న జనాభా, వారి వయసు, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆధారంగా ఈ పరిశోధన చేశారు. 2017లో భారత్‌ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ గణాంకాల ఆధారంగానే పరిశోధకులు తాజా అధ్యయనం చేశారు. 2030 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, 2050 నాటికి ఇండియా 3వ స్థానానికి చేరుకుంటుందని అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం మొదటి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, చైనా 2050 నాటికి వాటి స్థానాలను నిలబెట్టుకుంటాయని పేర్కొంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పయనిస్తోంది. అనేక వ్యాపారాలు నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణించింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం వెలువడటం గమనార్హం.

* అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా తమ డీలిస్టింగ్‌ ఆఫర్‌ విఫలమైనట్లు ఎక్స్ఛేంజీలకు శనివారం సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాటాదార్లు టెండర్‌ చేసిన షేర్లన్నీ ఎక్స్ఛేంజీల్లో కొనసాగుతాయి. డీలిస్ట్‌ను విజయవంతం చేయాలంటే 134.1 కోట్ల షేర్లు వెనక్కి రావాల్సి ఉంది. అయితే అయిదు రోరజుల రివర్స్‌ బుక్‌ బిల్డింగ్‌(ఆర్‌బీబీ) ప్రక్రియలో 125.47 కోట్ల ధ్రువీకృత బిడ్లు వచ్చాయి. అయితే కంపెనీ సవరించిన ధరతో ముందుకు రావొచ్చు కానీ రూ.320 కంటే దిగువన షేర్లు లభించకపోవచ్చు. ఎందుకంటే ఆ ధర వద్ద 24 కోట్ల షేర్లను ఎల్‌ఐసీ టెండర్‌ చేసింది.

* ప్రధానంగా కేన్సర్‌ ఔషధాలు తయారు చేసే ఫార్మా కంపెనీ శిల్ప మెడికేర్‌ లిమిటెడ్‌కు చెందిన జడ్చర్లలోని ఫార్ములేషన్ల ప్లాంటుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ‘హెచ్చరిక లేఖ’ జారీ చేసింది. ఈ సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు శిల్ప మెడికేర్‌ బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ)కి శనివారం వెల్లడించింది. ఈ ‘హెచ్చరిక లేఖ’ వల్ల కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వివరించింది. శిల్ప మెడికేర్‌కు ఒక ఫార్ములేషన్ల యూనిట్‌, రెండు ఏపీఐ(యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం జడ్చర్ల యూనిట్‌ విషయంలో తప్పించి ఇతర యూనిట్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవని కంపెనీ పేర్కొంది.