Movies

మెహరీన్ వెంట మధుశాలిని

మెహరీన్ వెంట మధుశాలిని

వెబ్‌సిరీస్‌లలో నటిస్తే సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయనే అభిప్రాయాన్ని తాను విశ్వసించనని అంటోంది మధుశాలిని. ఇతర భాషల్లో పేరున్న నటీనటులంతా వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారని,తెలుగులో మాత్రం గుర్తింపు ఉన్న తారలెవరూ వెబ్‌సిరీస్‌లు చేయడానికి ఇష్టపడటం లేదని తెలిపింది. కథానాయికగా దక్షిణాది చిత్రసీమలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మధుశాలిని ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఎక్స్‌పైరీడేట్‌’. టోనీ ల్యూక్‌, స్నేహా ఉల్లాల్‌, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు శంకర్‌ కె మార్తండ్‌ దర్శకత్వం వహించారు. జీ5 ద్వారా ఇటీవల విడుదలైంది. ఈ వెబ్‌సిరీస్‌ తాలూకు ప్రయాణాన్ని మధుశాలిని పాత్రికేయులతో పంచుకుంది. ‘సమాజం, తల్లిదండ్రులను ఎదురించలేక జీవితంలో రాజీపడి బతికే సునీత అనే యువతిగా ఇందులో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. తనలో పరివర్తనకు దారి తీసిన సంఘటన ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది. నా నిజజీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది. రియల్‌లైఫ్‌లో దేని గురించి ఎక్కువగా భయపడను. ఫలితం గురించి ఆలోచించకుండా ఏ పనైనా ధైర్యంగా చేస్తుంటాను. ఈ సిరీస్‌లో మాత్రం ప్రతి విషయంలో భయపడే అమ్మాయిగా కనిపించాల్సిరావడంతో పాత్ర కోసం చాలా పరిశోధన చేసి నటించాను. రిఫరెన్స్‌ కోసం చాలా సిరీస్‌లు, సినిమాలు చూశాను. థియేటర్లలో సినిమాలు చూసేందుకు భయపడుతున్న ప్రస్తుత తరుణంలో వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నాయి. కథ నచ్చితే బోల్డ్‌, గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి సిద్ధమే. ఏడాదికి ఒక్కటైనా మంచి సినిమా చేయాలన్నదే నా అభిమతం. ప్రస్తుతం హిందీలో ఆర్కా మీడియా నిర్మిస్తున్న ‘రైజ్‌ ఆఫ్‌ శివగామి’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా. ‘గూడఛారి-2’తో పాటు బాలా నిర్మాణంలో ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నా’ అని చెప్పింది మధుశాలిని.