Politics

విశాఖ భూ అవకతవకలపై సిట్ విచారణ-తాజావార్తలు

విశాఖ భూ అవకతవకలపై సిట్ విచారణ-తాజావార్తలు

* కర్ణాటక – తమిళనాడు సరిహద్దుల్లోని సర్జాపుర, బాగలూరు పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆకాశం నుంచి బంగారు నాణేల పడినట్లు వదంతులు వ్యాపించాయి. ఇది తెలిసి వందల సంఖ్యలో స్థానికులు రహదారుల పైకి, ఖాళీ స్థలాల్లోకి వచ్చి నాణేల కోసం వేట కొనసాగించారు. ఉర్దూ అక్షరాలు చెక్కి ఉన్న వంద నాణేల వరకు స్థానికులు కొందరికి లభించాయి. నాణేలు దొరుకుతున్న విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆనేకల్‌ చుట్టుపక్కల ప్రాంతాల వరకు గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కొందరి నుంచి నాణేలను స్వాధీనపరుచుకున్నారు. అవి బంగారు నాణేలు అయి ఉండవని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో వాటిని నేలలో పూడ్చి పెట్టి ఉంటారని, వర్షానికి అవి పైకి వచ్చి ఉంటాయని, బురదతోపాటు కొంత దూరం కొట్టుకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. కొందరు స్థానికులు మాత్రం మళ్లీ వర్షం వస్తే నాణేలు కింద పడతాయాని ఆశగా ఎదురు చూశారు.

* అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో బాలికలకు ఉన్నత గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఒక్కరోజు అధికారులుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. ఎంపికైన బాలికల్లో గార్లదిన్నె మండలం కస్తూర్బా పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని శ్రావణి ఒక్కరోజు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు విద్యార్థిని శ్రావణిని స్వయంగా ఆహ్వానించి, కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. దిశ చట్టం కింద నమోదైన కేసులో బాధిత బాలికకు పరిహారం ఇచ్చే దస్త్రంపై ఒక్కరోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేశారు. ఒక్కరోజు జాయింట్‌ కలెక్టర్లు(జేసీ)గా మధుశ్రీ, సహస్ర బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో తహసీల్దార్లుగా బాలికలు ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా కలెక్టర్ మొదలు, జేసీ, ఆర్డీవో, తహసీల్దార్‌తో పాటు సమాచార పౌరసంబంధాల అధికారి, ఇతర శాఖల అధికారుల బాధ్యతలను ఇవాళ బాలికలే చేపట్టారు. కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రాల్లో బాలికా దినోత్సవాన్ని ఇలా వినూత్నంగా నిర్వహించారు.

* కరోనా వేళ బిహార్‌ ప్రజలను నీతీశ్‌ కుమార్‌ తన కంటికి రెప్పలా చూసుకున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే అధికారం ఆయన చేతిలోనే ఉండాలని చెప్పారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గయలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం ఆయన ప్రసంగించారు. ఎన్డీయే హయాంలో రాష్ట్రంలో గత ఆరేళ్లుగా జరిగిన అభివృద్ధిని వివరించారు.

* నేపాల్‌ పర్యాటకశాఖ మంత్రి యోగేష్‌ భట్టారాయ్‌ కరోనావైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలో నేపాల్‌ను కరోనా వైరస్‌ లేని దేశంగా అభివర్ణించిన మంత్రే చివరకు వైరస్‌ బారినపడటం గమనార్హం. నేపాల్‌ మంత్రి వర్గంలో కరోనా వైరస్‌ బారినపడిన తొలి మంత్రి కూడా ఈయనే. ఈ సమయంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు ఎవరైనా అస్వస్థతకు గురైతే..వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని యోగేష్‌ సూచించారు. నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో యోగేష్‌ భట్టారాయ్‌ ఒకరు. ఇప్పటికే ప్రధానమంత్రి సన్నిహితులు ఎనిమిది మందిలో వైరస్‌ బయటపడింది. వీరిలో ప్రధానమంత్రి వ్యక్తిగత వైద్యుడు, ఫొటోగ్రాఫర్‌, మీడియా ఎక్స్‌పర్ట్‌తోపాటు మరికొందరు సన్నిహితులకు వైరస్‌సోకింది. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

* దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మరింత ఆధునికీకరించేందుకు భారత రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా అత్యధిక వేగంతో (గంటకు 130-160కి.మీ) వెళ్లే రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇవి త్వరలోనే పట్టాలెక్కనున్నాయని.. అందుబాటు ధరల్లోనే టికెట్లు ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది. అంతేకానీ, సాధారణ మార్గాల్లో నడిచే అన్ని నాన్‌-ఏసీ కోచ్‌లను ఏసీ-కోచ్‌లుగా మార్చడం లేదని రైల్వేశాఖ అధికార ప్రతినిధి డీజే నరైన్‌ స్పష్టంచేశారు.

* రసవత్తరంగా సాగుతున్న టీ20 క్రికెట్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి×దిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్ఠంగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

* విశాఖలో జరిగిన భూ అవకతవకలపై త్వరలో సిట్‌ నిగ్గు తేలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష తెదేపాపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలనలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. విశాఖ భూముల సిట్‌ విషయంపై సీఎం జగన్‌తో చర్చించినట్లు బొత్స తెలిపారు. దోపిడీని వెలికి తీస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంపై ఆయన విమర్శలు చేశారు. అమరావతికి మద్దతుగా తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు స్పందించలేదని.. మూడు రాజధానులకే రాష్ట్ర ప్రజల మద్దతుందన్నారు.

* ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘటన కేర్‌ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం సెల్లార్‌లో నిలిచిన వర్షం నీటిలో పడి ప్రమాదవశాత్తు మరణించిన హైకోర్టు ఉద్యోగి రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి యువజన కాంగ్రెస్‌ రాష్ట్రాధ్యక్షుడు అనిల్‌యాదవ్‌ వెళ్లారు. ఆయనకు రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యులు తమ గోడును వెళ్లబోసుకుంటూ అధికారులెవరూ తమను పట్టించుకోలేదని, కరెంటు, తాగునీరు కూడా సరఫరా చేయలేదని వాపోయారు. అదే సమయంలో అక్కడే ఎదురుగా ఉన్న ఆర్వవైశ్య సంఘం సమావేశానికి ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ హాజరయ్యారు. ఆయన తిరిగొచ్చే సమయంలో బాధితులకు న్యాయం చేయాలంటూ అనిల్‌కుమార్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. సెల్లార్‌లో నీటిని తొలగించాలని సూచించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అదుకుంటామని రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యులకు ఆయన హామీ ఇచ్చారు.

* దళితులు, ముస్లింలు, ఆదివాసీలను దేశంలో చాలా మంది మనుషులుగా పరిగణించడం లేదని.. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. హాథ్రస్‌ హత్యాచార ఘటనను ఉద్దేశించి తాజాగా ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. ఎవరూ అత్యాచారానికి గురికాలేదని యూపీ సీఎం, అక్కడి పోలీసులు పదే పదే అంటున్నారని ఆరోపించారు. అంటే ఆ బాధితురాలు వారికి ‘ఎవరూ కాదు’ అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా వారు ఆమెను లేక్కే చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘బాధితురాలు చెప్పినా పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు అంటున్నారు’ అన్న కోణంలో బీబీసీలో ప్రచురితమైన ఓ వ్యాసాన్ని ట్వీట్‌కు జత చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో వైకాపా షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారని.. భూములు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయనగరం పార్లమెంటు తెదేపా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అక్రమ వసూళ్ల దందా చేస్తూ అన్ని వర్గాలను పీడిస్తున్నారని ఆరోపించారు. దందాపై నిలదీసిన వారిపై బెదిరింపులు, దాడులు పెరిగాయన్నారు. ప్రజల నుంచి జె ట్యాక్స్‌, వైకాపా ట్యాక్స్‌, గవర్నమెంట్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని చెడగొట్టే పాలకులను ఇప్పుడే చూస్తున్నాం అని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్టోబరు రెండో వారం వచ్చినా కరవు మండలాల ప్రకటన చేయలేదని.. పంటలు తగులబెట్టే పరిస్థితి రైతులకు తీసుకొచ్చారని చంద్రబాబు విమర్శించారు.

* చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా న్యాయస్థానాలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్న ప్రభుత్వం వైకాపాయేనని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో తెదేపా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై వైకాపా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం విడుదల చేసినా క్షేత్రస్థాయిలో వాటిని అందించకపోవటంపై ఆయన మండిపడ్డారు. ఇదే విషయమై ప్రజలు పడుతున్న కష్టాలు తెలియజేసేలా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పదివేల ఉత్తరాలు రాయనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు.

* రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై తెదేపా శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రులు, వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఇష్టారీతిన దోచుకుంటున్నారని ఆరోపించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ… న్యాయస్థానాల్లో రాజకీయ నాయకులపై పెండింగ్ కేసుల విచారణ త్వరగా పూర్తైతే రాజ్యాధినేతలెవరో.. జైలుకెళ్లే వారెవరో తేలిపోతుందని అన్నారు. నిత్యం అవినీతిని సహించబోనని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేల భూ దందాలపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

* గ్రామీణ ప్రజలకు సాధాకారత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సర్వే ఆఫ్‌ విలేజస్‌, మ్యాపింగ్‌ విత్‌ ఇప్రూవైజ్‌డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌(SVAMITVA) పథకంలో భాగంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రధాని మోదీ ప్రారంభించారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ భారతం సాధికారత సాధించడంలో ఈ పథకం ఎంతో చరిత్రాత్మకమైందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తొలుత దేశంలోని ఆరురాష్ట్రాల గ్రామీణ ప్రజలకు ఈ కార్డులను అందజేయనున్నారు.

* రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయని.. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, అధికారులు సీఎం కేసీఆర్‌ సూచించారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

* కరోనా సృష్టిస్తున్న అలజడికి ఎప్పుడెప్పుడు అడ్డుకట్ట పడుతుందా?అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి దేశాలన్నింటికీ పారదర్శకంగా అందించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పడిన కొవాక్స్‌ కూటమిలో పలు దేశాలు ఇప్పటికే చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు డబ్ల్యూహెచ్‌వో తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ కోసం మెక్సికో ప్రభుత్వం 159.88 మిలియన్‌ డాలర్లను( దాదాపు రూ.900కోట్లకు పైగా) డబ్ల్యూహెచ్‌వోకు చెల్లించింది.

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు నేటి నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతకుముందు ఈ ఘటనపై చాంద్‌పా పోలీసు స్టేషన్లో బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే.