Business

ఎయిరిండియా ఉద్యోగులకు తీపికబురు-వాణిజ్యం

Air India Announces Good News To Employees-Telugu Business News

* కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వినిమయం పెంచి డిమాండ్‌ కొరత తీర్చేందుకు కేంద్రం ప్రణాళికలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. పండగ వేళ పలు ప్యాకేజీలు ప్రకటించింది. ప్రయాణ ఓచర్లతో పాటు ప్రతి ఉద్యోగికి పండగ అడ్వాన్స్‌ ఇవ్వనుంది.

* మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం 9:49 గంటల సమయంలో సెన్సెక్స్‌ 334 పాయింట్లు ఎగబాకి 40,841 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 11,997 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.18 వద్ద కొనసాగుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందన్న వార్తలు ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ… దేశీయంగానూ మదుపర్ల సెంటిమెంటును పెంచింది. ఆర్థిక, ఐటీ రంగాల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలిచింది.

* తమ శాశ్వత ఉద్యోగులు వేతనం లేని సెలవు(ఎల్‌డబ్ల్యూపీ)ను వాడుకోవడం లేదంటే వారంలో 3 రోజులు మాత్రమే పని చేసి 60 శాతం వేతనం తీసుకొనే పథకాల్లో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకునేందుకు ఎయిరిండియా గతంలో విధించిన గడువును పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఈ పథకాల్లో ఒకదాన్ని ఉద్యోగులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్‌డబ్ల్యూపీ పథకాన్ని 2020 జులై 14న ఎయిరిండియా తీసుకొచ్చింది. తర్వాత సెప్టెంబరు 30 వరకు గడువును పొడిగించింది. తాజాగా వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా జనరల్‌ మేనేజర్‌ (ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌) మీనాక్షి కశ్యప్‌ వెల్లడించారు. ఎయిరిండియాలో మొత్తం 13,000 మంది శాశ్వత ఉద్యోగులుండగా, నెలవారీ వేతన వ్యయం రూ.230 కోట్ల వరకు అవుతోంది. ఎల్‌డబ్ల్యూపీ అవకాశం కల్పించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 60 మంది ఉద్యోగులు మాత్రమే ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో వార్షిక వేతన బిల్లులో రూ.7 కోట్ల వరకు సంస్థకు కలిసొస్తుందని తెలుస్తోంది.

* కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఇచ్చిన ప్రత్యేక గ్రాంట్లను వినియోగించుకోవడంలో కొన్ని రాష్ట్రాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఇచ్చిన నిధుల్లో సగం కూడా ఖర్చుపెట్టుకోలేక పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి కరోనాపై పోరు కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.మూడు వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మూడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తప్ప మిగిలిన రాష్ట్రాలన్నీ పూర్తిగా వినియోగించుకున్నాయన్నారు. మహారాష్ట్ర కేవలం 42.5 శాతం నిధుల్ని మాత్రమే ఉపయోగించుకుందన్నారు. చండీగఢ్‌ 47.8 శాతం, దిల్లీ 75.4 శాతం నిధుల్ని వినియోగించుకున్నాయన్నారు.

* ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటర్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఏమ్‌ఎస్‌ఐ) ఎంట్రీ లెవెల్‌ బైక్‌లను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అధిక సామర్థ్యం గల బైక్‌లు, స్కూటర్‌ల విభాగంలో కంపెనీ ఇప్పటికే మార్కెట్‌ను విస్తరించిందని కంపెనీకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు. గతంలో హోండా విడుదల చేసిన సీడీ 110 మోడల్‌ కంటే దిగువ స్థాయిలో కొత్త బైక్‌ను తీసుకురావాలని భావిస్తోంది.