Business

హైదరాబాద్‌ను వదిలేసిన APSRTC-వాణిజ్యం

హైదరాబాద్‌ను వదిలేసిన APSRTC-వాణిజ్యం

* దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను ప్రకటించింది. మొత్తం 2,028 ప్రత్యేక బస్సులను ఈ పండగ సీజన్‌లో నడపనుంది. అయితే, తెలంగాణ, ఏపీ ఆర్టీసీల మధ్య ఏర్పడిన ఇంటర్‌ స్టేట్‌ వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో భారీ డిమాండ్‌ ఉండే హైదరాబాద్‌ను మాత్రం ఈ స్పెషల్స్‌ జాబితా నుంచి పక్కన పెట్టింది. అంటే.. హైదరాబాద్‌కు బస్సులు లేకుండానే పండగ స్పెషల్స్‌ నడవనున్నాయి. ఈ మేరకు దసరా స్పెషల్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు నడపటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

* గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తనకు 6.5 లక్షల రూపాయల ఆస్తి పన్ను విధించడంపై నటుడు రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. చెన్నైలోని తన ప్రాపర్టీ రాఘవేంద్ర కళ్యాణ మండపంపై ఈ పన్ను చెల్లించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపింది. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన మార్చి 24 నుంచి రాఘవేంద్ర కళ్యాణ మండపం మూసివేసి ఉందని, అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజినీ తరపు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. కాగా ఈ విషయమై మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును విత్‌డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీ తరపు లాయర్ కోర్టును కోరారు.

* గుంటూరు రైల్వే జంక్షన్‌ మీదుగా ఐదు రైళ్లకు రైల్వేబోర్డు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. అక్టోబరు 20వ తేదీ నుంచి నవంబరు 30వ తేదీ వరకు శబరి, నారాయణాద్రి, నరసాపూర్‌, అమరావతి, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలకు బోర్డు మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపింది. ఈ రైళ్లన్నీ పాత సమయపట్టిక ప్రకారమే నడుస్తాయి. వీటిల్లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం నుంచే నడపడం ప్రారంభించారు. ఇప్పటికే తిరుపతి – విశాఖపట్నం – తిరుపతి వారంలో మూడు రోజులు ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌కి రైల్వేబోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. రానున్న దసరా, దీపావళి పండగల సందర్భంలో సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరుపతి, శబరిమల, తిరువనంతపురం, విశాఖటపట్నం ప్రాంతాల నుంచి రాకపోకలకు ఈ రైళ్లు ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. ఈ రైళ్లన్నింటికీ తత్కాల్‌ ఛార్జీ వసూలు చేస్తారు. అలానే త్రీటైర్‌ ఏసీ కోచ్‌లు ఎక్కువగా అందుబాటులో ఉంచుతారు. ఎలాంటి రాయితీలు వర్తించవు.

* ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి థియేటర్లు తెరవద్దని ఎగ్జిబిటర్లు నిర్ణయం.కేంద్రం అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో..13 జిల్లాల ఎగ్జిబిటర్లు నేడు విజయవాడలో సమావేశమయ్యారు.50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్ల నిర్వహణ కష్టమన్న ఎగ్జిబిటర్లు.రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభం ఎప్పుడో తెలిసేందుకు మరి కొన్ని రోజుల సమయం.