Devotional

దసరా అంటే బెజవాడ దుర్గమ్మదే!

Vijayawada Dasara Durgamma Special Story - Telugu Devotional News

బెజవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో ‘ప్రభలు’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉత్సవం చివరిరోజున పదుల సంఖ్యలో వాహనాలను అలంకరించి, దేవతల రూపాల్లో ఉన్న కళాకారులు నిల్చొని ఉంటారు. రథాల ఆకారంలో వాహనాలను అలంకరిస్తారు. వాటి ముందు తప్పెటగుళ్లు, భాజాభజంత్రీలు, భేతాళ నృత్యాలు, గారడీ విద్యలు, కోలాటాలు.. ఇలా ఎన్నో చిత్రవిచిత్ర వేషాలతో కళాకారులు సందడి చేస్తారు. ఎంతో అద్భుతంగా సాగే ప్రభల్ని నిర్వహించటానికి నగరపెద్దలు పోటీలు పడతారు.

**దశాబ్దాలుగా నిరాటంకంగా వేడుకలు

బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలు కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైనవి. ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వేడుకగా ప్రకటించిన దుర్గమ్మ సన్నిధిలోని దసరా వేడుకలకు ఎన్నో చారిత్రక.. పురాణ.. ఇతిహాస విశేషాలున్నాయి. స్థానిక ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వందల ఏళ్లుగా అత్యంత వైభవంగా నిరాటంకంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కీలుడనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చిన జగన్మాత అతడికి వరం ఇవ్వడం, ఆ వర ప్రభావంతో కీలుడు ఇంద్రకీలాద్రిగా మారటం, కీలాద్రిపై అమ్మ దుర్గాదేవిగా అవతరించటం, బ్రహ్మదేవుడు మల్లికాపుష్పాలతో అర్చించిన కారణంగా ఇక్కడి పరమేశ్వరుడు మల్లికార్జునస్వామిగా ప్రసిద్ధిపొందటం, ఇంద్రకీలాద్రిపై మహాభారతకాలంలో అర్జునుడు తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించటం, మహోగ్రరూపిణిగా ఉన్న దుర్గమ్మను శాంతపరచడానికి ఆదిశంకరాచార్యులు ఇంద్రకీలాద్రి మీద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం, నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన విజయదశమి రోజున చేసే శమీపూజకు ఇక్కడి స్థలపురాణంతో సంబంధం ఉండడం.. ఇలా ఎన్నో విశేషాలు, చారిత్రక గాథలు విజయవాడ దసరా వేడుకలతో ముడిపడి ఉన్నాయి.

**కనకదుర్గమ్మగా పేరొచ్చిందిలా..

పూర్వం విజయవాడను మాధవవర్మ అనే మహారాజు పాలించేవాడు. ధర్మ మార్గంలో పాలిస్తూ ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. ఒకరోజు మాధవవర్మ కుమారుడు తన రథం మీద నగరంలో పర్యటిస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు ఒక బాలుడు ఆ రథచక్రాల కిందపడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లి రాజకుమారుడి కారణంగానే తన బిడ్డ మరణించాడని రాజుకు ఫిర్యాదు చేస్తుంది. కలలో కూడా ధర్మం తప్పని మహారాజు తన రాజ్యానికి వారసుడు, తన వంశాంకురమైన యువరాజుకు మరణశిక్ష విధిస్తాడు. మాధవవర్మ ధర్మనిష్ఠకు మెచ్చిన దుర్గాదేవి అతడి రాజ్యంలో కనకవర్షం కురిపిస్తుంది. అప్పటినుంచి ఇంద్రకీలాద్రి మీద కొలువైన దుర్గాదేవి కనకదుర్గాదేవిగా లోకప్రసిద్ధి పొందింది. చనిపోయిన బిడ్డలిద్దరూ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహంతో మళ్లీ బతుకుతారు.

**జమ్మిదొడ్డికి చారిత్రక గాథ..

దుర్గామల్లేశ్వరుల భక్తుడైన పండితయ్య విజయవాడలో క్రమం తప్పకుండా ఆచార విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. నిత్యం హోమాలు చేస్తూ, శివుడు తప్ప మరో లోకం లేదన్నట్లు ఉండేవాడు. పండితయ్యకు ప్రజల్లో ఉన్న మంచిపేరును చూపి గిట్టనివారు కుతంత్రాలు చేసి, అతడికి నిప్పు దొరకకుండా చేశారు. దీంతో పండితయ్య ఎంతో ఆవేదన చెంది. తన ఇష్టదైవమైన పరమేశ్వరుడుని ఆరాధించి, అగ్నిని తన ఉత్తరీయంలో మూటకట్టుకుని, గ్రామం చివరకు చేరుకుని, అక్కడ ఉన్న ఒక జమ్మి చెట్టుకు తన ఉత్తరీయాన్ని వేలాడదీస్తాడు. తన మంత్రబలంతో వూళ్లొ ఎక్కడా నిప్పు పుట్టకూడదని శపిస్తాడు. శాపం వల్ల వూళ్లొ నిప్పు వెలగకపోవటంతో ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురయ్యారు. తప్పు తెలుసుకున్న ప్రజలు అప్పటి నగరపాలకుడైన వేంగి రాజును వెంటబెట్టుకుని, పండితయ్య ఉన్న ప్రాంతానికి వచ్చి, అతడిని ప్రార్థిస్తారు. పండితయ్య శాపాన్ని వెనక్కుతీసుకుని, గ్రామస్తులతో కలిసి, తన పూర్వ నివాసానికి చేరుకుంటాడు. ఆ విధంగా పండితయ్య నిప్పును తన ఉత్తరీయంలో బంధించి శమీవృక్షానికి కట్టిన ప్రాంతం, ఆ వృక్షం చారిత్రక ప్రసిద్ధిపొందాయి. శమీవృక్షం ఉన్న ప్రాంతం కూడా కాలక్రమంలో ‘జమ్మిదొడ్డి’గా ప్రసిద్ధిపొందింది. ఇప్పటికీ జమ్మిదొడ్డి ఉన్న ప్రాంతాన్ని స్థానికులు పరమపవిత్రంగా ఆరాధిస్తారు. దసరా ఉత్సవాల్లో ఇక్కడ పూజలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల చివరిరోజున చేసే శమీపూజను ఈ వృక్షానికే అధికారికంగా దేవస్థాన అర్చకులు నిర్వహిస్తారు.

**విజయవాడ పోలీసు ఆచారం..

విజయవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన వాటిలో పోలీసు ఆచారం ఒకటి. ఇంద్రకీలాద్రి ఉన్న ప్రాంతం స్థానికంగా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్‌కు ఇంద్రకీలాద్రికి సంబంధించిన ఆచారాలు వందల సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడం గొప్ప విశేషం. ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడుచుగా, స్టేషన్‌ ప్రాంతంలో ఉన్న రావి చెట్టును, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. అందుకే ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో విజయవాడ పోలీసు అధికారులు అమ్మవారికి పుట్టింటివారి పాత్ర పోషిస్తారు. కొండమీద దసరా ఉత్సవాలు మొదలయ్యే ముందురోజే స్టేషన్‌లో వేడుకలు ప్రారంభమవుతాయి.