DailyDose

విషమంగా నాయుని ఆరోగ్యం-తాజావార్తలు

విషమంగా నాయుని ఆరోగ్యం-తాజావార్తలు

* రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారు.. అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్‌ రవి ఆండ్రూస్, మరో డాక్టర్‌ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన్యాయమూర్తికి ఏపి సీఎం రాసిన లేఖను బహిరంగ పర్చడం ద్వారా సదరు న్యాయమూర్తిపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆరోపించింది. బహిరంగంగా ఫిర్యాదు చేసినవారితో జడ్జీలు ఘర్షణ పడరని, దీన్ని ఆసరాగా చేసుకొని ఏపి ముఖ్యమంత్రి ఇలా వ్యవహరిస్తున్నారని బార్ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇలాంటి సమయంలో న్యాయవ్యవస్థను కాపాడే బాధ్యతను ప్రజలు, బార్‌ కౌన్సిల్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బయట పెట్టడం ద్వారా న్యాయవ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలని సీఎం చూస్తున్నారని కౌన్సిల్‌ ఆరోపించింది. దేశ న్యాయవ్యవస్థనే అస్థిరపర్చాలనే ఇలా జడ్జిలపై దాడి చేశారని తెలిపింది. ఏపి ముఖ్యమంత్రి పలు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న అంశాన్ని ప్రస్తావిస్తూ… లేఖను బహిరంగ పర్చడం ద్వారా జడ్జిలపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారని పేర్కొంది. న్యాయవ్యవస్థను దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నాలను బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని కౌన్సిల్‌ ఛైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు.

* దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా సెప్టెంబర్‌ 13 న జరిగిన నీట్‌ పరీక్షా ఫలితాలు, షెడ్యూల్‌ ప్రకారం సోమవారం విడుదల కావాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో జాప్యం నెలకొన్న విషయం తెలిసిందే. మహమ్మారి కరోనా కారణంగా, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉండిపోవడం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో నేడు ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈసారి నీట్‌ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్‌లతోపాటు జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌ చట్టం–2019లో సవరణ చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించామని, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని మంత్రి తెలిపారు. స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ చాలావరకు తగ్గింది. మునుపటితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా చాలా వరకు తగ్గాయి. మరీ ముఖ్యంగా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. తాజాగా.. ఏపీలో 3,967 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే.. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,75,470కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 24 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన మరణాలతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,382 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 38,979 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,30,109 కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లారు.

* ఫేస్‌బుక్‌ ద్వారా మహిళతో పరిచయం పెంచుకుని ఆమె ఇంట్లోనే చోరీకి పాల్పడి జైలు పాలయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. నూజివీడు డీఎస్‌పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన అల్లు వసంత అనే మహిళతో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కర్నాటి ప్రవీణ్ రెడ్డి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ రెడ్డి తరచూ తూర్పు దిగవల్లిలోని వసంత ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఓ రోజు వసంత ఇంటిలో లేని సమయంలో దాదాపు 3 లక్షల రూపాలయ విలువైన బంగారు నగలను అపహరించుకు పోయాడు. నగలు కనిపించకపోయే సరికి వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నూజివీడు రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం విషయం బయటపడింది. ప్రవీణ్ రెడ్డి వద్ద నుండి నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడ్ని జైలుకు పంపారు.

* ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఆహారాన్ని ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వివిధ దేశాల్లో భారతీయ రెస్టారెంట్లు లాభసాటి వ్యాపారంతో దూసుకుపోవటమే ఇందుకు నిదర్శనం. కాగా, భారతీయ ఆహారమంటే లొట్టలేసే వారి జాబితాలోకి తైవాన్‌ అధ్యక్షురాలు సై ఇంగ్‌ వెన్‌ కూడా చేరటం విశేషం. తనకు భారతీయ వంటకాలు అంటే చాలా ఇష్టమని.. తమ దేశంలో భారతీయ రెస్టారెంట్లు ఉండటం అదృష్టమని కూడా ఆమె పొగిడేశారు.

* తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనసేవైన పెద్దశేష వాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చిన పెద్దశేష వాహనాన్ని పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో అలంకరించారు. ఉభయదేవేరులతో కలిసి ఏడుతలల శేషవాహనంపై గోవిందరాజస్వామి అవతారంలో అభయప్రదానం చేశారు. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడంతో మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆలయంలోనే చేశారు.

* అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందన్న వార్తలు అవాస్తవమని కథానాయకుడు, నిర్మాత నాగార్జున స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని అనేక వార్తలు ప్రచారమయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు దట్టమైన పొగతో కూడిన వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సోషల్‌మీడియాలో స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆ వార్తలు అవాస్తవం. అంతా సాధారణంగా, సురక్షితంగానే ఉంది’ అని నాగ్‌ ట్వీట్‌ చేశారు.

* అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిహార్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ)నేత తేజస్వి యాదవ్ శుక్రవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అలసిపోయారని, ఆయన రాష్ట్రాన్ని చూసుకోలేరని ఎద్దేవా చేశారు.

* ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను మోదీ ఆవిష్కరించారు. వీటి వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో దేశంలోని పాతరికార్డులన్నీ చెరిగిపోయాయన్నారు. రైతులకు కనీస మద్ధతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇది ఆహార భద్రతకు ఎంతో అవసరమని మోదీ వెల్లడించారు. సరైన వసతులు లేనందువల్ల ఆహారధాన్యాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారుతోందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

* అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే కమిటీ వేశామని, నిపుణులు నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు.