Devotional

ఆదిశక్తి నవరూపాలపై మార్కండేయ పురాణంలో స్తోత్రం

ఆదిశక్తి నవరూపాలపై మార్కండేయ పురాణంలో స్తోత్రం

ముగ్గురమ్మలకూ మూలపుటమ్మగా, సమస్త విశ్వాన్నీ నడిపించే ఆదిశక్తిగా వినుతికెక్కిన దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో… నవ దుర్గలుగా భక్తులను అనుగ్రహిస్తోంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు ఈ రూపాల గురించి వివరించినట్టు మార్కండేయ పురాణంలోని దేవీ కవచంలో…

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ/
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం/
పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ/
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్‌
నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః8
అని ప్రస్తావితమయింది.
*********నవదుర్గావతారాలూ, వాటి విశిష్టతలూ ఇవి:
**శైలపుత్రి
నవ దుర్గలో మొదటి అవతారం శైలపుత్రి. హిమవంతుని కుమార్తె. ఆమె వాహనం వృషభం. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించి ఉంటుంది.
**బ్రహ్మచారిణి
పరమశివుణ్ణి భర్తగా పొందడానికి వేల సంవత్సరాలు తపస్సు చేసిన అమ్మవారు బ్రహ్మచారిణిగా పూజలందుకుంటోంది. తపోదీక్షా చిహ్నాలుగా జపమాల, కమండలంతో ఆమె కనిపిస్తుంది.
**చంద్రఘంట
శిరస్సున చంద్రుణ్ణి ధరించిన చల్లని తల్లి చంద్రఘంట. ఆమె వాహనం పులి. ఈ రూపంలో అమ్మవారిని సేవిస్తే భూత ప్రేత పిశాచాది భయాలు తొలగిపోతాయని ప్రతీతి.
**కూష్మాండ
చిరు దరహాసంతో బ్రహ్మాండాన్ని సృజించిన అమ్మ కూష్మాండ. ఆమెకు కూష్మాండ (గుమ్మడికాయ) బలి అంటే ప్రీతి కాబట్టి ఆ పేరుతో ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమె వాహనం పులి.
**స్కందమాత
స్కందుడు అంటే కుమారస్వామి. ఆయనకు తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. ఒడిలో షణ్ముఖుడితో ఆమె దర్శనం ఇస్తుంది. ఆమె సింహవాహని.
**కాత్యాయని
పార్వతీదేవి తనకు కుమార్తెగా జన్మించాలని కాత్యాయన మహర్షి తపస్సు చేశాడు. ఆయన అభీష్టం నెరవేర్చిన అమ్మవారు కాత్యాయనిగా ప్రసిద్ధి చెందింది. ఆమె వాహనం సింహం.
**కాళరాత్రి
గార్ధభం (గాడిద) వాహనంగా కలిగిన కాళరాత్రి అత్యంత భయంకర స్వరూపిణి. కానీ ఆమె సకల శుభాలనూ ప్రసాదించే చల్లని తల్లి అని భక్తుల విశ్వాసం.
**మహాగౌరి
శివుడి అర్ధాంగికావడానికి కఠోర తపస్సు చేసిన పార్వతి శరీరం నల్లగా మారిందట! అందుకే అమ్మవారికి మహా గౌరి అనే పేరు వచ్చింది. ఆమె వాహనం ఎద్దు, అభయ, వరద ముద్రలతో ఆమె కరుణిస్తుందని భక్తుల విశ్వాసం.
**సిద్ధిధాత్రి
శివుడికి సర్వ సిద్ధులనూ ప్రసాదించిన దేవత సిద్ధిధాత్రి అని దేవీ పురాణం చెబుతోంది. కమలంపై పద్మాసనంలో కూర్చొనే ఈ అమ్మవారిని దర్శించినంత మాత్రాన కోరికలు నెరవేరుతాయని నమ్మిక. ఆమె వాహనం సింహం.
***శ్రీశైలంలో నవదుర్గావతారాల్లో…
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి చేసే అలంకారాలు వేరు… అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి అయిన శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భ్రమరాంబాదేవికి చేసే అలంకారాలు వేరు. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ నవరాత్రుల్లో స్వర్ణకవచాలంకృత దుర్గ, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, దుర్గ, మహిషాసుర మర్దని, రాజరాజేశ్వరీ అలంకారాల్లో దర్శనమిస్తుంది. శక్తిపీఠం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అమ్మవారిని దేవీ కవచంలోని ఆమెను స్తుతించే నవదుర్గల రూపాల్లోనే అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూష్మాండదేవి, స్కంధమాత, కాత్యాయనీ దేవి, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి రూపాల్లో అలంకరణ చేస్తారు. ఉత్సవాల చివరిరోజు ఉదయం సిద్ధిధాత్రిగా, సాయంత్రం నిజరూపంలో భ్రమరాంబాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీశైలంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో గ్రామోత్సవం విశేషమైనది. అమ్మవారినీ, శ్రీ మల్లికార్జున స్వామినీ రోజుకో వాహనంపై ఆసీనులను చేసి, గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు.