Editorials

మైసూరు దసరా నవరాత్రి నిండా గజరాజ రాచరికమే!

దసరా నవరాత్రి నిండా గజరాజ రాచరికమే!

దసరా అంటే మైసూరు… మైసూరు అంటే దసరా… ఇంత అద్భుతంగా ఎక్కడైనా జరుగుతాయా… అనే స్థాయిలో ఉండే ఈ వేడుకల్లో ఆకర్షణ, అందం అంతా గజరాజుల ఊరేగింపే… అదే జంబూ సవారీగా దేశవ్యాప్తంగా పేరొందింది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగుల ఎంపిక, పోషణ, శిక్షణ… అన్నీ ఓ పద్ధతిలో జరుగుతాయి…

**మైసూరు దసరా ఉత్సవాలకు, ఏనుగులకు విడదీయరాని సంబంధం. కొన్ని వందల ఏళ్ల నుంచి మహారాజుల కాలం నుంచే ఈ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. విజయనగర సామ్రాజ్యంలో దసరా ఉత్సవాల్సి ఘనంగా నిర్వహించేవారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దసరా దిబ్బను ఇప్పటికీ హంపిలో చూడవచ్చు. హంపిలో ఉత్సవాలను చూసి స్ఫూర్తిపొందిన సామంత రాజు ఒడయారు 1610లో శ్రీరంగపట్టణంలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలానికి రాజధాని నగరం మైసూరుకు మారడంతో ఉత్సవాలు కూడా మైసూరులోనే నిర్వహిస్తున్నారు. విజయదశమి రోజు జంబూ సవారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఏనుగు అంబారీపై అప్పట్లో మహారాజు ఊరేగేవారు. అప్పట్లో ఏనుగుపై ఏర్పాటుచేసే దాదాపు 750 కేజీల బరువుండే బంగారు అంబారీపై మహారాజు ఆశీనులయ్యేవారు. ఆయన ఊరేగింపుగా వస్తుంటే దారివెంట మహారాజుకు జయం కలగాలి…. మహారాజు దీర్ఘకాలం పాలించాలి…. అంటూ నినాదాలతో పరిసరాలు మార్మోగేవి. రాచరికాలు, రాజాభరణాలు రద్దయ్యేవరకూ ఈ సంప్రదాయం కొనసాగింది. ఆ తరువాత మహారాజుకు బదులు చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అంబారీపై ఊరేగిస్తున్నారు.

***ఈ ఏనుగుల ప్రత్యేకతే వేరయా…
ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగుల ఎంపిక పక్కాగా ఉంటుంది. వీటిని సాధ్యమైనంత వరకు కర్ణాటకలోని వివిధ శిబిరాల నుంచే ఎంపిక చేస్తారు. ముందుగా శరీర సౌష్ఠవాన్ని పరిశీలిస్తారు. దృఢమైన శరీరం, వెడల్పాటి వెన్నుభాగం, బరువుల్ని సునాయాసంగా మోయగలగడం, అన్నిటికీ మించి శాంత స్వభావం ఈ ఏనుగులకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. ఎలాంటి పరిస్థితిలోనైనా చలించకుండా ఉండే గజరాజును అంబారీ మోసేందుకు వినియోగిస్తారు. కర్ణాటకలో నాగరహొళె, బందీపుర అభయారణ్యాల్లోని వివిధ శిబిరాల్లో ఉండే పెంపుడు ఏనుగుల నుంచి ముందుగా ఈ లక్షణాలున్న ఏనుగులను గుర్తిస్తారు. పశు వైద్యులతో కూడిన నిపుణుల కమిటీ అన్ని పరీక్షలూ నిర్వహిస్తుంది. అంబారీ ఏనుగుతో పాటు దానికి ఇరువైపులా నడిచేందుకు సన్నిహితంగా ఉండే ఆడ ఏనుగులను ఎంపిక చేస్తారు.

** అవకాశం వాటికే… అంబారీని మోసే గజరాజుల్లో అత్యధికసార్లు జంబూ సవారీలో పాల్గొన్న గజరాజుగా ద్రోణ పేరు తెచ్చుకుంది. 1981 నుంచి 1997 వరకు ఇది అంబారీని మోసింది. 1998లో నాగరహొళె అభయారణ్యంలోని బల్లె ప్రాంతంలో కొమ్మల ఆకుల్ని తెంచుకునే యత్నంలో విద్యుదాఘాతానికి బలైంది. ద్రోణ తరువాత అంబారీని మోసే బాధ్యతను బలరామ చేపట్టింది. 1999 నుంచి 2011 వరకు ఈ బాధ్యతను నిర్వహించింది. దాదాపు 750 కేజీల బరువుండే స్వర్ణ అంబారీని నాలుగు గంటల పాటు మోసే క్రమంలో కంటికి దెబ్బతగలడంతో బలరామ కూడా పక్కకు తప్పుకుంది. 2012 నుంచి అర్జున అంబారీని మోస్తోంది. అంతకుముందు అర్జున ఇతర ఏనుగుల్లా ఉత్సవాల్లో పాల్గొనేది. నాగరహొళె అభయారణ్యంలోని బల్లె శిబిరం నుంచి తెచ్చిన అర్జున దసరా ఉత్సవాల్లో 19 ఏళ్ల నుంచి పాల్గొంటోంది. ఈసారి కూడా అర్జునదే అంబారీ సేవ భాగ్యం. అర్జునకు వారసుడిగా ధనుంజయ అనే గజరాజును ఎంపిక చేశారు. వచ్చే ఏడాది కోసం ధనుంజయకు ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. విక్రమ, గోపి, చైత్ర, వరలక్ష్మి, బలరామ, అభిమన్యు, ద్రోణ, కావేరి, విజయ, ప్రశాంత్‌ ఏనుగులు జంబూ సవారీ శిక్షణలో పాల్గొంటున్నాయి.

**రిహార్సల్స్‌ ఇలా…
ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులు రాచనగరికి చేరుకున్న తర్వాత వాటికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ ప్యాలెస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బస నుంచి అంబారీని మోసే గజరాజు అర్జున నేతృత్వంలో ఇతర ఏనుగులు జంబూ సవారీ రిహార్సల్స్‌లో పాల్గొంటాయి. చామరాజకూడలి, కె.ఆర్‌కూడలి, సయ్యాజీరావు రోడ్డు, ఆయుర్వేద ఆస్పత్రి కూడలి మీదుగా ఐదు కిలోమీటర్ల దూరంలోని బన్ని మంటప మైదానం వరకు రిహార్సల్స్‌ ఉంటుంది. ఉదయం బన్ని మంటపానికి వెళ్లిరాగానే చల్లటి నీళ్లతో శుభ్రంగా స్నానం చేయిస్తారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారం అందిస్తారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. జంబూ సవారీ రోజు ఊరేగింపు బయలుదేరిన విషయాన్ని చాటేందుకు 21 సార్లు ఫిరంగుల్ని పేలుస్తారు. ఈ ప్రక్రియ సందర్భంగా ఏనుగులు బెదరకుండా ఉండేందుకు ఉత్సవాలకు 15 రోజుల ముందు నుంచి ఫిరంగుల్ని ఏనుగులకు సమీపంలో పేలుస్తారు.
**మహారాజు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగేందుకు కాలివద్ద మీట ఉండేదట. మీటను నొక్కగానే మావటీ వద్ద ఎర్రదీపం వెలిగేది. అప్పుడుఏనుగును నిలిపేవారని చెబుతారు.
**ఆ ప్రక్రియ పేరు ఖెడ్డా…
ఏనుగుల్ని బంధించే పద్ధతిని ఖెడ్డాగా పిలుస్తారు. మహారాజుల కాలంలో ఉన్న ఈ విధానం ఇప్పుడు నిషేధంలో ఉంది. అడవుల్లో గోతిని తవ్వి దాన్ని ఆకులతో కప్పి ఉంచుతారు. ఏనుగులు సంచరిస్తుండే ప్రాంతం నుంచి వాటిని ఈ గోతి వైపు తరుముకుంటూ వస్తారు. బెదురుతూ వచ్చే ఏనుగు గోతిలో పడుతుంది. దీన్ని సురక్షితంగా శిబిరానికి తరలిస్తారు. దీన్నే ఖెడ్డా ఆపరేషన్‌ అని పిలుస్తారు. శిబిరానికి చేరుకున్న ఏనుగును మూడు నెలల పాటు కొయ్యలతో ఏర్పాటు చేసిన ప్రాంతంలో బందీని చేస్తారు. మూడు నెలల తరువాత ఇతర పెంపుడు ఏనుగుల వెంట అడవుల్లోకి తీసుకెళతారు. అడవుల్లో కొయ్య దూలాల్ని మోసేందుకు వినియోగిస్తారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తరువాత అలాంటి పనుల నుంచి వీటికి విముక్తి లభించింది. కొన్ని సందర్భాల్లో మచ్చిక అయ్యేందుకు మరింత ఎక్కువ సమయం అవసరమవుతుంది. వచ్చే ఏడాది అంబారీ మోసేందుకు ఎంపికైన ధనుంజయ హసన్‌ జిల్లాలో పొలాల్ని ధ్వంసం చేస్తున్న సమయంలో బంధించిన ఏనుగుల్లో ఒకటి.
*జంబూ సవారీకి సిద్ధం చేసే ఏనుగులకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కో ఏనుగుకు ఉదయం 15-20 కేజీల ఉడికించిన కూరగాయలు, ఉద్ది, పెసరబేడలు, ఆవిరితో ఉడికించిన బియ్యం అందచేస్తారు. కూరగాయల్లో రోజూ ముల్లంగి, దోసకాయలు, నూల్‌కోల్‌ ఉండేలా చూస్తారు. మగ ఏనుగులకు రోజూ కేజీ వెన్న, అంబారీని మోసే అర్జునకు కేజీన్నర వెన్నను ప్రత్యేకంగా తినిపిస్తారు. మధ్యాహ్నం ఒక్కో ఏనుగుకు 35 కేజీల కుసురెను తినిపిస్తారు. ఉడికించిన వడ్లు, బెల్లం, కొబ్బరికాయ, వేరుసెనగ చెక్క, తగినంత ఉప్పును ఎండుగడ్డిలో ఉండలుగా చుట్టి కుసురెను తయారుచేస్తారు. ఆ తరువాత ఏనుగులు తమకు కేటాయించిన స్థలాల్లో సేదతీరుతాయి. సాయంత్రం తిరిగి రిహార్సల్స్‌. రాత్రికి పచ్చగడ్డి, మర్రి ఆకుల్ని ఆహారంగా తీసుకుంటాయి. రోజులో ఒక్కో ఏనుగు 400 నుంచి 600 కేజీల ఆకుల్ని ఆహారంగా తీసుకుంటాయి.
**ఇదీ గజగాథ…
*అర్జున
బరువు 5365 కిలోలు. ఆరేళ్లుగా అమ్మవారిని మోసే భాగ్యం అర్జునదే. నాగరహోళె శిబిరం నుంచి సేకరించారు.
*ధనుంజయ
బరువు 4040 కేజీలు. ఒకప్పుడు దూకుడుగా ఉండే ఈ గజరాజు ఇప్పుడు సౌమ్యతకు మారుపేరు. అందుకే అంబారీ ఏనుగు అర్జునకు వారసుడిగా ఎంపిక చేశారు.
*విక్రమ
బరువు 3990 కేజీలు. 45 సంవత్సరాల వయస్సు. 14 ఏళ్ల నుంచి దసరా ఉత్సవాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. వేడుకల అనంతరం దుబారె ఏనుగుల శిబిరంలో ఉంచుతారు
*గోపీ
బరువు 4435 కేజీలు. 36 సంవత్సరాల వయస్సు. దుబారె శిబిరంలో ఉంచుతారు. ఎనిమిదేళ్ల ఉత్సవాల అనుభవం ఉంది.
*చైత్
2970 కేజీల బరువుంది. దీని వయస్సు 47 సంవత్సరాలు. బందీపుర అభయారణ్యంలోని శిబిరంలో ఉంటుంది. అర్జునకు స్నేహితురాలిగా పేరుతెచ్చుకుంది. దసరా ఉత్సవాల్లో మూడుసార్లు పాల్గొంది
*వరలక్ష్మీ
….. దీని బరువు 3120 కేజీలు. వయస్సు 62 సంవత్సరాలు. మత్తిగోడు శిబిరం నుంచి వచ్చింది. దసరా ఉత్సవాల్లో తొమ్మిదేళ్లుగా పాల్గొంటోంది.
*బలరామ
దీని బరువు 4910 కేజీలు. మత్తిగోడు శాశ్వత శిబిరం. 22 సంవత్సరాలుగా ఉత్సవాల్లో ముఖ్యపాత్ర. అంబారీని అనేక సార్లు మోసిన అనుభవం కూడా ఉంది.
*అభిమన్యు
బరువులో 4930 కేజీలుగా నమోదుచేసుకుంది. ప్యాలెస్‌ వాద్య బృందాల వాహనాన్ని లాక్కుని వెళ్లే ఏనుగుగా పేరుతెచ్చుకుంది. మత్తిగోడు శిబిరానికి చెందింది.
*ద్రోణ
3900, కావేరి- 2830, విజయ- 2790, ప్రశాంత్‌ 4650 కేజీల బరువులు తూగాయి.