Devotional

బందరు శక్తిపటం ప్రత్యేకతలు

బందరు శక్తిపటం ప్రత్యేకతలు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో పూజలతో కొందరు అమ్మవారిని కొలుస్తారు. మరికొందరు శక్తిపటాలను ఎత్తుకుని మొక్కుబడులు తీర్చుకుంటారు. దేశంలో కోల్‌కతా తరువాత జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోనే శక్తిపటాల వూరేగింపు జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెక్కుసంఖ్యలో తరలివస్తుంటారు. నల్లని దుస్తులతో ఒక చేతిలో చురకత్తి రెండవ చేతిలో 50 కిలోల బరువున్న ఆరడుగుల శక్తిపటాన్ని భుజానకెత్తుకుని నిర్వహించే ప్రదర్శన భక్తిభావాలను పెంపొందిస్తుంది. ఒక వైపు ఆంజనేయస్వామి మరొకవైపు కాళికామాత చిత్రాలను నయనమనోహరంగా రూపొందించిన శక్తిపటం చూపరులకు కనువిందు చేస్తుంది.

***దశాబ్దాల క్రితం మాజీ సైనికుడు దాదా కోల్‌కతాలోని కాళికామాత చిత్రపటాన్ని ఈడేపల్లిలో ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈయన అక్కడి సంప్రదాయమైన శక్తిపటాల ప్రదర్శనను ఈ ప్రాంతానికి పరిచయం చేశారు. పట్టణంలోని శక్తిగుడి, గొడుగుపేట ఉమాగుడి శక్తిపటాలు పోటీపడి ప్రదర్శనలు నిర్వహించేవి. ప్రస్తుతం పలు ప్రాంతాలనుంచి భక్తులు శక్తిపటాలను ఎత్తుకుని భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. రుద్రభూమిలో తెల్లవారు జామున పూజలు చేసి శక్తిపటాన్ని ఎత్తుకునే వ్యక్తి ఉపవాస దీక్షను స్వీకరిస్తారు. మొహానికి కాళికామాత ముఖచిత్రాన్ని కరాళంగా ధరిస్తారు. దీనివల్ల శక్తిపటాన్ని ఎత్తుకునే వ్యక్తి వూపిరి ఆడకపోయినా అలానే పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో వూరేగుతూ తమ భక్తిని తెలియజేయడంతో శక్తిపటాల ప్రాధాన్యతను తెలియజేస్తారు. పక్కన ఉన్న భక్తులు శక్తిపటాన్ని ధరించిన వ్యక్తికి విసన కర్రలతో విసురుతూ సహాయ సహకారాలు అందిస్తారు. ప్రధర్శనకు ముందు నడిచే కనకతప్పెట్ల విన్యాస శబ్దాలకు అనుగుణంగా చిందు వేయడంలో కూడా శక్తిపటధారి అనుభవం కలిగి ఉంటాడు. దీనివల్ల ప్రదర్శనలో వైవిధ్య భంగిమలను జనరంజకంగా ప్రదర్శిస్తారు. ఉదయం ఉపవాస దీక్షతో మొదలైన శక్తిపట ప్రదర్శన సాయంత్రంవరకు కొనసాగుతుంది. ఈ శక్తిపటం ధరించడం వల్ల కోరెన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ఎక్కువమంది శక్తిపటాలను ఎత్తుకోవడానికి పోటీ పడుతుంటారు. దీంతో దసరా వస్తోందంటేనే శక్తిపటాల తయారీ, దేవతామూర్తుల చిత్రీకరణ, చిత్రపటాలకు ప్రత్యేక గుర్తింపు లభించే రీతిగా అలంకరణలలో భక్తులు తలమునకలై ఉంటారు.ఉత్సవాలు ప్రారంభం కాగానే ఆయా ప్రాంతాలు శక్తిపటాల వూరేగింపులతో పండుగ శోభ సంతరించుకుంటుంది. పట్టణంతోపాటు ఆయా ప్రాంతాలకు చెంది వృత్తిరీత్యా పలు రాష్ట్రాలు వివిధ దేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ మొక్కుబడులు చెల్లించుకునేందుకు కుటుంబసభ్యులతో సహా తరలివస్తారు. వారు అంతా శక్తిపటాలను కట్టుకుని మొక్కుబడులు తీర్చుకుంటారు.

***విజయదశమినాటి ప్రదర్శన ప్రత్యేకం
నవరాత్రుల రోజుల్లో చేసి విన్యాసాలతో పోల్చితే విజయదశమి రోజు కోనేరుసెంటరులో అన్ని ప్రాంతాల శక్తిపటాలు ఒకేచోటకు చేరి చేసే ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకుంటుంది. పలువురు కళాకారులు పవిత్ర వేషధారణలతో కోనేరు సెంటరుకు చేరుకుంటారు. అనంతరం ఆయా ప్రాంతాలనుంచి వూరేగింపుగా బయలుదేరిన శక్తిపటాలు తమ ప్రాంత ప్రాతినిధ్యాన్ని చాటేలా ఒకరితో ఒకరు పోటీపడుతూ చేసే విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి.దీనిలో భాగంగా తీన్‌మార్‌, కనకతప్పెట్ల శబ్ధాలకు అనుగుణంగా శక్తిపట దారులు చేసే విన్యాసాలు, యువకుల నృత్యాలతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావారణం సంతరించుకుంటుంది. ఆ రాత్రి ప్రదర్శనలో పాల్గొన్న శక్తిపటాల విజేతలకు బహుమతులు కూడా అందజేస్తారు. బహుమతులు దక్కించుకోవాలన్న ఆకాంక్షతో శక్తిపటదారుల నృత్యాలతోపాటు పటాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు.కోనేరు సెంటరులో భక్తుల కోలాహలం నడుమ చేసే ప్రదర్శనలతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.