Politics

చంద్రబాబుకు బాధలు-తాజావార్తలు

Auto Draft

* కళకళలాడిన ప్రజారాజధాని అమరావతిని నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రాజధాని నిర్మాణ పనులను ఏడాదిన్నరగా ఆపేశారని.. అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానమని వ్యాఖ్యానించారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

* నటి భూమిక.. తన భర్త భరత్‌ నుంచి విడిపోయిందంటూ వస్తోన్న వార్తలకు సదరు నటి గట్టిగానే సమాధానమిచ్చారు. సెలబ్రిటీ యోగా టీచర్‌గా పేరుపొందిన భరత్‌ ఠాకూర్‌ను 2007లో భూమిక వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా భూమిక.. సోషల్‌మీడియాతోపాటు బయటకూడా సింగిల్‌గానే కనిపిస్తుండటంతో ఆమె.. తన భర్త నుంచి విడాకులు తీసుకుందంటూ ప్రచారం సాగింది. కాగా, తాజాగా సదరు అవాస్తవ ప్రచారాలపై భూమిక పరోక్షంగా స్పందించారు. భరత్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసి.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

* భారత్‌- చైనా సరిహద్దుల్లో రహదారుల నిర్మాణంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత్‌ చేపట్టిన ఈ చర్యలవల్లే చైనా వెన్నులో వణుకుపుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుచోట్ల నిర్మించనున్న పార్టీ ఆఫీసులకు ఏకకాలంలో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. గడిచిన ఆరేళ్లలో ప్రధాని మోదీ హయాంలో లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు దాదాపు 4,700 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారులను కేంద్రం నిర్మించిందన్నారు. అంతేకాకుండా ఆర్మీ ట్యాంకర్లు పోయేందుకు వీలుగా 14.7 కి.మీ మేర వంతెనలు నిర్మించామన్నారు.

* బిహార్‌ ఎన్నికల్లో భాగంగా భాజపా చేసిన ఉచిత కొవిడ్‌ టీకా హామీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విభిన్నంగా స్పందించారు. జీవితాల్ని కాపాడే కరోనా టీకాను భాజపా ఎన్నికలతో ముడిపెట్టిందని విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘భారత ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌పై తమ వ్యూహాలను ప్రకటించింది. దీని బట్టి మనకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందాలంటే రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడో తెలుసుకోవాలి’అంటూ వ్యంగ్యంగా ప్రస్తావించారు. భాజపా ప్రకటించిన ఈ హామీపై ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం తీవ్రంగా స్పందించారు. బిహార్‌ ప్రజలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తే.. మరి భాజపా అధికారంలో లేని రాష్ట్రాల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. భాజపాకు ఓటు వేయని భారతీయులకు ఉచితంగా టీకా అందజేయరా?అని ప్రశ్నించారు.

* బిహార్‌లోని అధికార కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్‌జనశక్తి అధినేత చిరాగ్ పాసవాన్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై తన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ వరస ట్వీట్లలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగా, ఆ రాష్ట్రంలో అక్టోబర్‌ 28 నుంచి మూడు దశలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

* భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పాక్‌ మిలిటరీ కోర్టు జాదవ్‌కు విధించిన శిక్షపై సమీక్షించడానికి సహకరించే బిల్లును పాకిస్థాన్‌ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం సూచనల మేరకు పాక్‌ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లు ఆ దేశ న్యాయశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాల్ని పాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. పాక్‌ న్యాయ శాఖ మంత్రి నసీమ్‌ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ న్యాయస్థానం సూచనల మేరకు జాదవ్‌కు విధించిన శిక్షపై సమీక్ష కోరే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాం. దీనికి పార్లమెంటరీ కమిటీ నుంచి ఆమోదం లభించింది. ఈ చట్టం ద్వారా శిక్షకు వ్యతిరేకంగా జాదవ్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’నసీమ్‌ తెలిపారు. కాగా ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందకపోతే ఐసీజే తీర్పును ఖాతరు చేయని కారణంగా పాక్‌ ఆంక్షల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నసీమ్‌ హెచ్చరించారు. తొలుత పలు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ.. కమిటీ ఛైర్మన్‌ ఓటింగ్‌ ద్వారా బిల్లును ఆమోదించారు.

* చెరువుల ఆక్రమణ, సరైన మురుగునీటి వ్యవస్థ, వరద కాల్వలు లేకపోవటం, పాలకుల నిర్లక్ష్యం ప్రస్తుత హైదరాబాద్ దుస్థితికి కారణమంటున్నారు ‘సేవ్ లేక్స్ ‘ ఉద్యమకారులు, ఇంటాక్ సంస్థ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ పి.అనురాధారెడ్డి. హైదరాబాద్‌తో పాటు దేశవిదేశాల్లో పలు చెరువులు పురాతన కట్టడాల గురించి ఆమె సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఈనాడు, ఈటీవీతో తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న చెరువులు అలనాటి పాలకులు మనకు ఇచ్చిన వరం. నగర వాసులకు బతుకుదెరువు నిచ్చింది చెరువులే. అప్పటి పాలకులు ముందు చూపుతో వాటిని ఏర్పాటు చేశారు. వాటి నుంచి మనకు ఎంతో ప్రయోజనం చేకూరింది. చాలా ఏళ్ల వరకు హుస్సేన్‌సాగరే హైదరాబాద్‌కు తాగునీరు అందించింది. అలాంటిది నేడు కాలుష్యమయం అయిపోయింది. చెత్తాచెదారం ఇతరత్రా వ్యర్థాలతో దీనిని కలుషితం చేసేశారు’’ అని ఆమె వివరించారు.

* నగరంలోని పాతబస్తీ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఫలక్‌నుమా, కందికల్‌, హఫీజ్‌బాబా నగర్‌ ప్రాంతాల్లో వరద నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. పాతబస్తీలోని తాజా పరిస్థితులను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందం వెంట జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా నగరంలో వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. రూ. 8,633 కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు గుర్తించామని చెప్పారు. రహదారులకు రూ. 222 కోట్లు, జీహెచ్‌ఎంసీలో రూ. 567 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. చాంద్రాయణ గుట్ట ఫ‌ల‌క్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్‌ఓబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి)ని, ముంపుకు గురైన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధితులతో మాట్లాడిన కేంద్ర బృందం..ఆర్‌ఓబీకి రెండు వైపులా చేప‌ట్టిన‌ పునరుద్ధరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడిక తీత పనులను పరిశీలించింది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో మొద‌టి అంత‌స్తులోకి కూడా నీళ్లు వ‌చ్చిన‌ట్లు ఆ ప్రాంత ప్రజ‌లు కేంద్ర క‌మిటీకి వివ‌రించారు. ఇప్పటికీ రోడ్లపై, ఇళ్లలోనూ వరద నీరు పేరుకుపోయి ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు నీళ్లలో నాన‌డం వల్ల త‌మ ఇళ్ల గోడ‌లు దెబ్బతిన్నాయ‌ని వాపోయారు. 40 సంవత్సరాల క్రితం ఫలక్‌నుమా ఆర్‌ఓబీని నిర్మించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ కేంద్ర బృందానికి వివరించారు. ఈ ఆర్‌ఓబీవ‌ల‌న ఇన్నర్ రింగ్‌రోడ్డు, చార్మినార్ ప్రాంతాల‌కు రోడ్డు స‌దుపాయం అనుసంధానం అయిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా పల్లె చెరువు నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీటి నాలా 7 మీట‌ర్ల వెడ‌ల్పు ఉంటుంద‌ని, అది ఆర్‌ఓబీ కింద నుండి వెళ్తుంద‌ని తెలిపారు. ప‌ల్లెచెరువు తెగిపోవ‌డం వ‌ల‌న వ‌చ్చిన వ‌ర‌ద‌తో ఈ ప్రాంతానికి అపార న‌ష్టం జ‌రిగిన‌ట్లు లోకేశ్‌ కుమార్‌ వివరించారు.

* ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు పంట నష్టపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని.. పరిహారాన్ని అందించడంలోనూ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పవన్‌ ఆరోపించారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని పవన్‌ కోరారు.

* రక్షణ రంగంలో భారత్‌ మరో అడుగు ముందుకేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి నాగ్‌ చివరి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ రేంజ్‌ నుంచి నాగ్‌ మిసైల్‌ క్యారియర్ (ఎన్‌ఏఎమ్‌ఐసీఏ) ద్వారా దీనిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక నాగ్‌ క్షిపణులు ఉత్పత్తి దశకు చేరుకున్నట్లయింది.

* లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని లేహ్‌ పట్టణాన్ని చైనాలో చూపించే విధంగా ఉన్న ట్విటర్‌ లొకేషన్ సెట్టింగ్‌లపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారతీయ పౌరుల మనోభావాలను గౌరవించండి’ అంటూ ఆ సంస్థను హెచ్చరించినట్లు గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత పటాన్ని తప్పుగా చూపడంపై ప్రభుత్వ నిరసనను వ్యక్తం చేస్తూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ట్విటర్ సీఈఓ జాక్‌ డోర్సేకు లేఖ రాసినట్లు తెలిపాయి.

* చైనాతో జో బైడెన్‌ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించడంతో పాటు, అమెరికాను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతోందంటూ చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరుకునపెట్టే అంశాన్ని ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ బయటపెట్టింది. స్వయంగా ట్రంపే చైనాలో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.