Agriculture

పాడిపశువులకు టీకాలు వేయిస్తున్నారా?

పాడిపశువులకు టీకాలు వేయిస్తున్నారా?

పాడి పశువులను రైతు ప్రతి రోజూ గమనించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనపడితే తక్షణమే సంబంధిత పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారంగా ఉంటుంది. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి.పాడిపశువులకు వ్యాధులు రాకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు అంటువ్యాధులు సోకక ముందే నివారణ చర్యగా వ్యాధినివారణ టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. పాడి పశువులు అంతః, బాహ్య పరాన్న జీవులకు లోనయినప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
***పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు:
* సూక్ష్మజీవుల (బాక్టీరియా) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసిస్‌.
* సూక్ష్మాతి సూక్ష్మ జీవులు (వైరస్‌) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గాలికుంటు, శ్వాసకోశవ్యాధి, మశూచి వ్యాధి.
* అంతర పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు– ఉదా.. కుందేటి వెర్రి (సర్రా), థైలేరియాసిస్, బెబీసియోసిస్, కార్జపు జలగవ్యాధి, మూగబంతి.
*ఇతర వ్యాధులు– ఉదా.. పాల జ్వరం, పొదుగు వాపు, చర్మవ్యాధులు, దూడల మరణాలు.
*రైతులు తమ పశు సంపదను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులలో పోషించి, సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ పద్ధతులపై సరైన అవగాహన ఏర్పరచుకొని రక్షించుకున్నట్లయితే ఆర్థికంగా ఎంతో లాభపడతారు.