Devotional

అక్షరంలో అమ్మ శక్తి

అక్షరంలో అమ్మ శక్తి

కాలం దైవాధీనం… దైవం మంత్రాధీనం అంటారు. భగవత్‌ శక్తి అంతా మంత్రాల్లో నిక్షిప్తమై ఉందని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ తీర్థస్వామి తన మంత్రసాధనలు అనే పుస్తకంలో విశదీకరించారు. ఇందులో బీజాక్షరాలకు విశేష ప్రాధాన్యం ఉంది. మంత్రాలను బీజాక్షరాలతో సంపుటీకరించి పలికినప్పుడు అద్భుతమైన శక్తి పుడుతుందని చెప్పారు. వామకేశ్వర తంత్రంలో శ్రీ విద్యా సంబంధమైన మంత్రాలున్నాయి. ఇందులోని షోడశాక్షరీ మంత్ర విశ్లేషణలో బీజాక్షరాల వివరణ కనిపిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః అనే బీజాక్షరాలను శాక్తేయ ప్రణాలు అంటారు. అవి జగన్మాత శక్తిని వెల్లడిస్తాయి.
*శ్రీం:
ఈ బీజాక్షరంలోని శ వర్ణానికి శుభం, ఆనందం అనే అర్థాలున్నాయి. సకల శుభప్రదమైందిది.
*హ్రీం:
దీన్ని మాయా బీజాక్షరంగా చెబుతారు. అవ్యక్తమైన జగత్కారిణికి ఇది ప్రతిబింబం. దధీచి సంహితలో దీనికి సంబంధించిన వివరణ కనిపిస్తుంది.
*క్లీం:
దీన్ని కామ బీజం అంటారు. సాధకుడి కోర్కెలు తీరేందుకు ఈ బీజాక్షరంతో కూడిన మంత్రజపం ఉంపయోగపడుతుందని చెబుతారు.
*ఐం:
ఇది సరస్వతీ వాక్బీజం. విద్య కోరుకునేవారు ఈ బీజాక్షరంతో మంత్ర సాధన చేయాలని నిర్దేశించారు. తద్వారా సరస్వతీ మాత అనుగ్రహాన్ని పొందవచ్చు.
*సౌః:
ఈ బీజాక్షరం అర్ధనారీశ్వరాత్మకం. దీన్ని సౌభాగ్య బీజం అని కూడా అంటారు.