DailyDose

ఏపీలో స్థానిక ఎన్నికల ఆలోచన మాకు లేదు-తాజావార్తలు

ఏపీలో స్థానిక ఎన్నికల ఆలోచన మాకు లేదు-తాజావార్తలు

*ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. దసరా తర్వాత కరోనా తీవ్రత పెరిగే వీలుందని.. నవంబర్‌, డిసెంబర్‌లో మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. తప్పకుండా జరపాల్సినవి కనుకే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో స్థానిక ఎన్నికలను పోల్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

*ముంబయిలోని ఓ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సమీపంలో ఉన్న 3500 మంది స్థానికులను అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. నగరంలోని నాగ్‌పడా ప్రాంతంలో ఉన్న సిటీ సెంట్రల్‌ మాల్‌లో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి ఎగసిపడిన మంటలను ఆర్పేందుకు తెల్లవారుజాము వరకూ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

*అనారోగ్యంతో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఆయన ఛాతినొప్పితో అస్వస్థతకు గురికావడంతో దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘‘ఛాతినొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

*రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎస్‌పీసీ)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుతో దీనిని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌ఎస్‌పీసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నారు

*తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు 2019పై చర్చించేందుకు ఏర్పాటైన పార్లమెంట్‌ సంయుక్త కమిటీ (జేపీసీ) ముందు హాజరయ్యేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నిరాకరించింది. సంబధిత అంశంపై చర్చించే నిపుణులు విదేశాల్లో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం చేయడం అంత సురక్షితం కాదని ఆ కంపెనీ కమిటీకి తెలియజేసినట్లు తెలిసింది. భేటీకి గైర్హాజరును తీవ్రంగా పరిగణిస్తామని ప్యానెల్‌ ఛైర్మన్‌, భాజపా ఎంపీ మీనాక్షి లేఖి తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. మచిలీపట్నంలో గురువారం మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు బస్సుల విషయంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులతో చర్చించామని.. ఎటూ తేలకపోవడంతో ఆ రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందిస్తే త్వరలో బస్సులు నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

*భారీ వర్షాలు, వరదల కారణంగా అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న పంటలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ, పత్తి తదితర పంటలను పరిశీలించారు. మోకాళ్ల లోతు బురదలో దిగి రైతులతో మాట్లాడారు. ముందుగా గుత్తి మండలం కరిడికొండలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన లోకేశ్‌.. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

*వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు నిరసన సెగ తగిలింది. గోషామహల్‌ నియోజకవర్గం అబిడ్స్‌ చీరగ్‌ గల్లీలోని నేతాజీ నగర్‌లో వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేసేందుకు స్థానిక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి మంత్రి వెళ్లారు. అక్కడి సమస్యలను మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన స్థానిక భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి, మంత్రి తలసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

*రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎస్‌పీసీ)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుతో దీనిని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌ఎస్‌పీసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

*హైదరాబాద్‌ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ఠ నాయకత్వంలోని కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం రఘురామ్‌, కేంద్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.కె కుష్వారా నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

*తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లాల్లో ఏర్పడిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాలో తలా ఏడు, వేలూరు, తెన్‌కాశి, తిరునల్వేలి జిల్లాల్లో తలా ఐదు, కాంచీపురం, తిరుపత్తూర్‌, రాణిపేట, కళ్లకురిచ్చి జిల్లాల్లో తలా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

*ప్రజల సౌకర్యార్థం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్‌ను గురువారం ప్రారంభించింది.

*ఒక తరం నుంచి మరో తరానికి అందించాల్సింది వారసత్వ సంపదలుకాదని, భాష, జ్ఞాన,సంస్కృతి అనేవే అసలైన సంపదలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖండాంతరాల్లో ఉన్నా మన భాషను కాపాడుతూ సుసంపన్నం చేస్తున్నారని ప్రశంసించారు. బతుకమ్మ ఉత్సవాల నేపధ్యంలో ఆస్ర్టేలియా, న్యూజీలాండ్‌ సంయుక్త అంతర్జాల తెలుగు సాంస్కృతిక మహోత్సవ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భాషను సుసంపన్న చేయాలన్నతపన పాలకులకు ఉండాలని, ఆ దిశగా అందరం ప్రయత్నం చేయాలని అన్నారు. చలం రచించిన బిడ్డల శిక్షణ పుస్తకాన్ని అందరూ చవాల్సిందన్నారు.

*భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆటో స్టాక్‌ల దన్నుతో నిఫ్టీ మరోసారి 11900 మార్కునకు ఎగువన నమోదైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 127.01 పాయింట్లు (0.31 శాతం) లాభపడి 40685.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.90 పాయింట్లు (0.28 శాతం) బలపడి 11930.40 వద్ద క్లోజ్ అయ్యింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్, బజాజ్ ఆటో తదితర షేర్లు నిఫ్టీలో ముందంజలో ఉన్నాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, గెయిల్ తదితర షేర్లు వెనుకంజలో ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఒక్క ఫార్మా తప్ప దాదాపు అన్ని సూచీలు లాభాలతోనే ముగిశాయి. ఆటో సెక్టార్ 3 శాతం లాభంతో ముందంజలో ఉంది.

*ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అగ్రిసెట్‌, అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2020 ఫలితాలను వైస్‌ఛాన్సలర్‌ డా.ప్రవీణ్‌రావు శుక్రవారం విడుదల చేశారు. రెండేళ్ల అగ్రికల్చర్‌ డిప్లోమా, మూడేళ్ల అగ్రి ఇంజనీరింగ్‌ డిప్లోమా కోర్సు పూర్తిచేసిన విద్యార్ధులకు బీఎస్సీ(హానర్స్‌), అగ్రికల్చర్‌, బి.టెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా అగ్రిసెట్‌, అగ్రిఇంజనీరింగ్‌ సెట్‌ను నిర్వహిస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా అగ్రి డిప్లోమాకోర్సుల విద్యార్ధుల కోసం ఆన్‌లైన్‌లో ప్రదేశ పరీక్షనుగడిచిన మూడేళ్లుగా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.

*తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆరా తీశారు. వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు

*నీటి గుంట‌లో దిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం అనకాపల్లి మండలం అంకిరెడ్డి పాలెంన‌కు చెందిన బాలురు స‌ర‌దాగా ఈత కొడ‌తామ‌ని నీటి గుంట‌లో దిగారు. అయితే లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతో నీటి మడుగులో ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చ‌నిపోవ‌డంతో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.

*ఇంద్ర కీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని చినజీయర్‌ స్వామి దర్శించుకున్నారు. చిన్న జీయర్ స్వామికి దుర్గ గుడి ఈవో సురేష్‌ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. చిన్న జీయర్‌ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

*రైతును రాజు చేయటమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మధిర మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రైతు బంధు, రైతు బీమా, సాగుకు నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్‌, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తూ అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని అన్నారు.