DailyDose

గీతం యూనివర్శిటీ కట్టడాలు కూల్చివేత-తాజావార్తలు

గీతం యూనివర్శిటీ కట్టడాలు కూల్చివేత-తాజావార్తలు

* కరోనాతో బాధపడుతూ నటుడు రాజశేఖర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుమార్తె శివానీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు.‘‘సిటీ న్యూరో సెంటర్‌లోని డాక్టర్‌ కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం మా తండ్రిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మా తండ్రి కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు’’ అని శివానీ ట్వీట్‌ చేశారు

* విశాఖ గీతం యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వర్సిటీ ప్రధాన ద్వారం, ప్రహరీ గోడతోపాటు సెక్యూరిటీ రూమ్‌లను పడగొట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ, బుల్‌డోజర్లతో కూల్చివేత చేపట్టారు. వేకువజామునే ఈ సమాచారం తెలుసుకున్న వర్సిటీ యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండానే కూల్చివేశారని ఆరోపించింది. రుషికొండ మార్గంలో ఉన్న భారీ గేటును తొలుత కూల్చేసిన అధికారులు అనంతరం ప్రహరీ గోడలను కూల్చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రహరీ కూల్చివేత పూర్తయ్యాక, వైద్య కళాశాల నార్త్‌గేటులో ఉన్న ప్రహరీ గోడను పడగొట్టారు. ముందుగానే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవ్వరినీ రానివ్వలేదు. కూల్చివేత సమాచారం తెలిసి తెదేపా శ్రేణులు వర్సిటీ వద్దకు చేరుకున్నాయి.

* కోల్‌కతా అద్భుతం చేసింది. కీలకమైన సమయంలో ప్లేఆఫ్స్‌ రేసులో ముందడుగు వేసింది. దిల్లీపై తిరుగులేని విజయం సాధించింది. సమీకరణాలతో సంబంధం లేకుండా ఉండేందుకు రన్‌రేట్‌ను సైతం పెంచుకుంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (5/20), ప్యాట్‌ కమిన్స్‌ (3/17) దెబ్బకు దిల్లీ విలవిల్లాడింది. 195 పరుగుల లక్ష్య ఛేదనలో 135/9కే పరిమితమైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (47; 38 బంతుల్లో 5×4), రిషభ్‌ పంత్‌ (27; 33 బంతుల్లో 2×4, 1×6) మినహా మరెవ్వరూ రాణించలేదు.

* ఆదాయపన్ను చెల్లింపు దారులకు వెసులుబాటు కలిగిస్తూ ఆర్థిక శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి గడువును పొడిగించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లను డిసెంబర్‌ 31 లోగా చెల్లించే వీలు కలుగుతుంది. ఇక ఆడిటింగ్‌ అనంతరం పన్ను చెల్లించేవారు మరో నెల అనంతరం అంటే జనవరి 31, 2021 లోగా సమర్పించవచ్చని ఆ శాఖ తెలిపింది.

* ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన సమరం జరుగుతోంది. దుబాయ్ వేదికగా హైదరాబాద్‌, పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు.

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తాను చెప్పిన పంటనే సాగు చేయాలంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని అగాథంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీఎం కేసీఆర్ మాటలు నమ్మి, సన్నరకం వరి సాగు చేసిన రైతులు నష్టపోయారని అన్నారు. రైతులకు జరిగిన నష్టానికి బాధ్యులెవరని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

* జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) పోరాటం చేస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. తమది భాజపా వ్యతిరేక వేదికే తప్ప దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. పీఏజీడీ దేశ వ్యతిరేకి అంటూ భాజపా అసత్య ప్రచారం చేస్తోందని, అది నిజం కాదన్నారు. ఇది భాజపా వ్యతిరేక కూటమి అనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదని విలేకర్ల సమావేశంలో అన్నారు.

* చైనా నుంచి వస్తోన్న ‘ఎల్లో డస్ట్‌’తో ఉత్తర కొరియా వణికిపోతోంది. తాజాగా దేశవ్యాప్తంగా అలెర్ట్‌ ప్రకటించడంతోపాటు, నిర్మాణ పనులపై నిషేధం విధించింది. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కిటికీలను కూడా బంధించి పెట్టుకోవాలని అక్కడి అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌(ఖ్ఛ్ట్వ్)ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని సూచించింది. చైనా నుంచి వస్తోన్న ‘ఎల్లో డస్ట్’‌ వల్ల కరోనావైరస్‌ కిమ్‌ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతోనే ఉ.కొరియా ఈచర్యలు చేపట్టింది.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై పడుతోంది. తాజాగా మనదేశ యువతపైనా ఇది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ చూపిన ప్రభావంతో దాదాపు 31శాతం మంది కౌమర దశలో ఉన్న యువత తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది. గత నాలుగు నెలల కాలంలో బాలికలు లింగ వివక్షకు గురికావడంతోపాటు చదువుకు కూడా దూరమవుతున్నట్లు తెలుస్తోంది.

* బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మేనిఫెస్టోలో ఉచిత కరోనా వైరస్‌ టీకా హామీ ఇచ్చిన భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. దీనిపై శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. ఆమె గురువారం మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా తాము బిహార్‌లో అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు, ఉచితంగా టీకాను అందిస్తామంటూ హామీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీకా హామీపై విపక్షాలన్నీ విరుచుకుపడటంతో పాటు, చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరాయి.

* ఆగస్టు 15న టీమ్‌ఇండియా క్రికెటర్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ త్వరలోనే టీ20 మెగా లీగ్‌ నుంచి కూడా తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం తన జెర్సీని జోస్‌బట్లర్‌కు బహుమతిగా ఇచ్చిన ధోనీ.. శుక్రవారం రాత్రి ముంబయితో మ్యాచ్‌ అనంతరం పాండ్య బ్రదర్స్‌కు కూడా అలాగే చేశాడు. తన 7వ నంబర్‌ జెర్సీని బహూకరించాడు. ఈ ఫొటోను లీగ్‌ నిర్వహకులు తమ ట్విటర్‌లో పోస్టు చేయగా పలువురు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,919 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,342 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,04,026కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,566 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. కరోనా కారణంగా వాయిదా వేసిన ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను నవంబర్‌ నెల వేతనంతో చెల్లించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన సగం జీతాలను 5 విడతలుగా ప్రభుత్వం చెల్లించనుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామ్‌ రెడ్డి తెలిపారు.