Food

డ్రాగన్ ఫ్రూట్ రుచి అదరహో!

డ్రాగన్ ఫ్రూట్ రుచి అదరహో!

ఏంటి నన్ను చూసి భయపడుతున్నారా.. నా శరీరం అంతా ముళ్లతో ఉన్నట్లు కనిపిస్తోందా?! నా పండేమో కాస్త డ్రాగన్లా ఉంది కదూ! అందుకే నన్ను డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అంటారు నిజానికి నేను చెట్టును కాదు మొక్కను! నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉందా? ఇంకేం.. చకచకా చదివేయండి మరి!

***ముంజకాయలాంటి రుచి…

* నేను కాక్టస్ కుటుంబానికి చెందినదాన్ని.

* హైలోసరస్ అండాటస్ అనేది నా శాస్త్రీయ నామం.

* నా చెట్టుకు కాసే పండునే మీరు డ్రాగన్ ఫ్రూట్, పిటాహయ, పిటాయ పండు అంటారు.

* నాలో ఎన్నో పోషక విలువలు ఉండటంతో నాకు ఈ మధ్య డిమాండ్ ఏర్పడింది.

* నేను ఎక్కువగా మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలో పెరుగుతాను.

* కొంతకాలంగా నన్ను ఇండోనేషియా, తైవాన్, వియత్నాం, థాయ్లాండ్, పిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణ భారతదేశంలోనూ సాగు చేస్తున్నారు.

* హవాయ్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఆస్ట్రేలియా, చైనా, సైప్రస్ దేశాల్లోనూ అక్కడక్కడ కనిపిస్తుంటా.

* నా రుచి కొద్దిగా ముంజకాయలా ఉంటుంది.

***పగలు పూసి.. రాత్రి వాలి..

* నా పండులోని విత్తనాలను ఓ రోజు నీడలో ఆరబెట్టి చల్లితే చాలు వారం రోజుల్లో మొక్కలొచ్చేస్తాయి.

* నాటిన 2 నుంచి 3 సంవత్సరాల్లోనే పూలు, కాయలు కాస్తాయి.

* మేము పెరగాలంటే నీరు ఇంకిపోయే నేలలు, సుమారు 20 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం.

* మేము ఎడారిలో పెరిగే ముళ్ల చెట్లలా ఉంటాం. తీగ చెట్లకు ఆసరాగా కర్రలు పెట్టినట్లే మాకు ఆసరాగా స్తంభాలను నాటుతారు.

* నా పువ్వులు తెల్లగా, లోపల పసుపు పుప్పొడితో పెద్దగా ఉంటాయి. ఇవి రాత్రుల్లో పూసి, ఉదయానికి వాలిపోతాయి.

* పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది.

* డ్రాగన్ కాయలు ఎక్కువగా నిల్వ ఉండవు. అందుకే వీటిని కోసిన 24గంటల లోపు మార్కెట్కు తరలిస్తారు.

***ఎముకలకు బలం..

* 100 గ్రాముల పండులో దాదాపు 268 కెలొరీలుంటాయి.

* ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చే ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి.

* మెగ్నీషియం, కాల్షియం, ఐరన్లాంటి పోషకాలు మీ శరీరానికి అందుతాయి.

* విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో పాటు బి1, బి2, బి3 విటమిన్లూ ఉంటాయి.

* బరువు తగ్గడానికి, శరీరంలోని ఎముకలు గట్టిపడడానికీ ఉపయోగపడతాయి.

* నా పండ్లతో ఐస్ క్రీంలు, కేకులు, జెల్లీలు తయారు చేస్తారు.

* పూలను కొన్ని చోట్ల టీ చేసుకోవడానికీ వాడతారు.

***రంగును బట్టే రకాలు…

* నా పండ్లు ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా గులాబీ రంగు పండ్లే అందుబాటులో ఉంటాయి.

* గుజ్జు సైతం తెలుపు, ఎరుపు రంగుల్లో రకాలను బట్టి ఉంటుంది.

* వీటిలో ఎరుపు రంగు గుజ్జున్న పండ్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి.

* కొన్నిచోట్ల నీలి రంగు డ్రాగన్ పండ్లూ దొరుకుతుంటాయి.

* ఎర్రటి గుజ్జున్న డ్రాగన్ కాయకు కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.