Business

కోర్టులో కొచ్చర్‌కు ఎదురుదెబ్బ-వాణిజ్యం

కోర్టులో కొచ్చర్‌కు ఎదురుదెబ్బ-వాణిజ్యం

* ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసిన చందాకొచర్ భర్త దీపక్ కొచ్చర్ కు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

* ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తనకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఆదివారం ట్వీట్‌ చేశారు. తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి అంతా ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు.

* పండుగ సీజన్‌లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కోవిడ్‌–19 సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితోపాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఈ పథకం అమలుతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది.

* మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. బుధవారం(28న) సమావేశంకానున్న కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. 28న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్‌) ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. బుధవారం బోర్డు ప్రకటించనున్న ప్రత్యేక డివిడెండ్‌కు నవంబర్‌ 5 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించినట్లు తాజాగా తెలియజేసింది. ఇంతక్రితం 2008 మార్చిలో ఎల్‌అండ్‌టీ ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ఎలక్ట్రికల్‌, ఆటోమేషన్‌ బిజినెస్‌ను ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌కు ఆగస్ట్‌లో విక్రయించింది. ఈ విక్రయం పూర్తికావడంతో ప్రత్యేక డివిడెండ్‌ యోచన చేపట్టి ఉండవచ్చని ఈ సందర్భంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

* దీపావళికి ముందు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగితే.. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరగవచ్చని సీనియర్‌ సాంకేతిక నిపుణులు గౌరవ్‌ రత్నపార్ఖీ పేర్కొంటున్నారు. బీఎన్‌పీ పరిబాస్‌ ప్రమోట్‌ చేసిన షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్‌.. స్వల్ప కాలంలో మార్కెట్లను మించి మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు పరుగుతీసే వీలున్నట్లు భావిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సాంకేతిక అంశాల ఆధారంగా మార్కెట్లపై అంచనాలను వెల్లడించారు. అంతేకాకుండా మూడు బ్లూచిప్‌ స్టాక్స్‌ను కొనుగోలుకి సిఫారసు చేశారు.