DailyDose

ఆర్డీవోపై అయ్యన్నపాత్రుడు దుర్భాషలు-తాజావార్తలు

ఆర్డీవోపై అయ్యన్నపాత్రుడు దుర్భాషలు-తాజావార్తలు

* మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం అందుకున్నారు. పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టిన అడ్డగోలు నిర్మాణాల్ని తొలగించిన నేపథ్యంలో గీతం కళాశాలలో టీడీపీ నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్‌డీవో, ఆ నా….. సస్పెండ్‌ చేయాలి’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

* గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చి ఉంటే బాగుండేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమకు ఎవరి మీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదని, గీతం వర్సిటీ ఆక్రమించినవి ప్రభుత్వ భూములు కాబట్టే అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘గీతం యూనివర్సిటీ అక్రమించుకున్న భూములు వెనక్కి తీసుకోకూడదా? చంద్రబాబు బంధువులు అయినంత మాత్రాన భూములు వదిలేయాలా? ఈ భూముల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆరు నెలల క్రితం నుంచి గీతం భూములపై వివాదం నడుస్తోంది. ఆ భూముల విషయంలో చంద్రబాబు ఎదురుదాడి చేయడం సరికాదు.

* గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ మరోసారి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టెక్నాలజీ పేరుతో పోలవరం అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్‌ అంచనాల పెంపుపై విచారణ జరగాలని ఎమ్మెల్సీ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ‘2013లో ఎంత రీహాబిలిటేషన్‌ అవుతుందని చెప్పారో.. 2015కల్లా దాని అంచనా పెరిగిపోయింది. దానిపై విచారణ జరగాలి. గతంలోనే నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశాం’ అని అన్నారు.

* కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రైతులకు ఇబ్బందులు లేకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఆయన శనివారం గుజరాత్‌లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

* పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధాని మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారని, ఈ మేరకు తేదీలు కూడా ఖరారయ్యాయని ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఇదే తరహాలో మాట్లాడారు. భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలూ తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ వార్తల్లోకెక్కారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దు తదితర సమయాల్లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అంతే వేగంగా నిర్ణయాలు ఉంటాయని స్వతంత్రదేవ్‌ చెప్పుకొచ్చారు.

* శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణోత్సవం మండలంలో మలయప్ప స్వామిని వేంచేపు చేశారు. స్వామివారు పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు ధరించి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా సంప్రదాయం ప్రకారం తితిదే ఈవోకు పరివట్టం కట్టారు.

* కొవిడ్‌-19 బారిన పడిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌నుద్దేశించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బయట పరిస్థితి ఏ విధంగా ఉందో ఫడణవీస్‌కు ఇప్పుడు తెలిసొచ్చి ఉంటుందని అన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉద్ధవ్‌ అస్సలు ఇంటి నుంచి బయటకు రావట్లేదంటూ ఇటీవల భాజపా విమర్శలు చేసిన నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడుతూ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బయట పరిస్థితి బాగాలేదని, జాగ్రత్తగా ఉండాలని ఫడణవీస్‌కు తాము సూచించామని రౌత్‌ చెప్పారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలందించాలని సీఎం ఉద్ధవ్‌.. ఆస్పత్రి వర్గాలకు సూచించినట్లు తెలిపారు. ఫడణవీస్‌కు శనివారం కరోనా పాజిటివ్‌ అని తేలిన సంగతి తేలింది. ప్రస్తుతం ఆయన ముంబయిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

* విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది.

* ఐదేళ్ల తెరాస పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా జిల్లాలోని దౌల్తాబాద్‌లో మంత్రి ప్రసంగించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,16,000 ఇస్తున్నామన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం.. భాజపా వాళ్లు ఇస్తారా?అని ప్రశ్నించారు. ఓట్లు అడిగేందుకు మాత్రమే కాంగ్రెస్, భాజపా నాయకులు వస్తారని.. ప్రజల కష్టసుఖాల్లో ఎప్పటికీ తోడుండేది తెరాస పార్టీయేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

* వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న వారంద‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌గ‌రంలో వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు పూర్త‌య్యేందుకు కీల‌క పాత్ర పోషించిన మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌నర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ స‌త్య‌నారాయ‌ణ‌, క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి, ఇత‌ర అధికారుల‌ను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు. ప్ర‌జా సంక్షేమం కోరే వారికి అమ్మ‌వారి దీవెన‌లు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని సీఎస్ పేర్కొన్నారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా 80 వేల కుటుంబాల‌కు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 120 కోట్ల మేర ఆర్థిక సాయం చేసిన‌ట్లు తెలిపారు. ఈ విజ‌య‌ద‌శ‌మి వేళ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు అంతా శుభ‌మే జ‌ర‌గాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌ ఆకాంక్షించారు.