DailyDose

ఉప్పుటేరులోకి జారిన లోకేశ్ ట్రాక్టర్-తాజావార్తలు

ఉప్పుటేరులోకి జారిన లోకేశ్ ట్రాక్టర్-తాజావార్తలు

* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపునకు గురైన పంటలు, ఆక్వా చెరువులను పరిశీలించేందుకు పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి లోకేశ్ ‌వెళ్లారు. ఆకివీడు మండలంలోని మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో ముంపు బారిన పడిన వరి చేలను పరిశీలించారు. అనంతరం ఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లేందుకు లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో రహదారి పక్కన ఉప్పుటేరులోకి ట్రాక్టర్‌ జారింది. దీంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే వేరే ట్రాక్టర్‌ తెప్పించి పర్యటన కొనసాగించారు. అనంతరం ఆకివీడులోని పునరావాస కేంద్రాన్ని లోకేశ్‌ సందర్శించారు. అక్కడ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

* సిద్దిపేటలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి అక్కడికి వెళ్లారు. దుబ్బాక ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రఘునందన్‌ సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో కిషన్‌రెడ్డి సిద్దిపేట బయల్దేరి వెళ్లారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన కరీంనగర్‌ నుంచి సిద్దిపేట చేరుకున్నారు. రఘునందన్‌ బంధువుల ఇళ్లపై దాడులు, సోదాలను ఖండిస్తు్న్నట్లు బండి సంజయ్‌ చెప్పారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. సిద్దిపేటలో దాడులు, సోదాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. భాజపా ముఖ్యనేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ కూడా సిద్దిపేట చేరుకున్నారు.

* పోలవరానికి ప్రస్తుతం కేంద్రం ఇస్తామంటున్న నిధుల గురించి కేంద్ర కేబినెట్‌ గతంలోనే స్పష్టతనిచ్చిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. అప్పట్లో కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయంపై తీర్మానం చేసినా.. తెదేపా ప్రశ్నించలేదని ఆరోపించారు. సోమవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. 2013-14 తర్వాత ప్రాజెక్టు వ్యయం, భూమి విస్తీర్ణం పెరిగినా ఒప్పుకున్న మొత్తానికి ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించబోమని కేంద్రం తెదేపా ప్రభుత్వానికి స్పష్టం చేసిందని తెలిపారు. అప్పట్లో భాజపాతో కలిసి ఉన్నప్పటికీ తెదేపా కేంద్రాన్ని ప్రశ్నించలేదని మంత్రి వ్యాఖ్యానించారు.

* కొవిడ్‌-19 బారిన పడ్డ ప్రముఖుల జాబితాలోకి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

* మొదటి దశ పోలింగ్‌ నేపథ్యంలో బిహార్‌లో ఎన్నికల ప్రచారానికి ఈ రోజు బ్రేక్ పడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఆర్జేడీ నేత, మహాకూటమా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ సోమవారం ఉదయం ట్విటర్‌లో ఉల్లిగడ్డల దండతో దర్శనమిచ్చారు. కూరగాయల ధరలు సామాన్యులను బాధిస్తున్న క్రమంలో కేంద్రంపై విమర్శలు చేస్తూ ఈ ఫొటోను షేర్ చేశారు.

* మూడేళ్ల చిన్నారిని కిడ్నాపర్‌ చెర నుంచి రక్షించేందుకు ఓ రైలు సుమారు 200 కిలోమీటర్లకు పైగా ఆగకుండా ప్రయాణించింది. ఎట్టకేలకు ఆ చిన్నారిని తల్లి చెంతకు చేర్చేలా చేసింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయం విచారణ సమయంలో వెలుగుచూసింది.

* కొవిడ్‌-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. కాగా ఈ పెరుగుదల లీటరుకు రూ.3 నుంచి 6 వరకు ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.

* మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా మద్యం తెచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మూడు మద్యం సీసాలు తెచ్చుకునేందుకు కూడా అనుమతి లేదని.. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే మద్యాన్ని కేంద్రం నిబంధనల మేరకు అనుమతిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

* ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. షార్జా వేదికగా పంజాబ్, కోల్‌కతా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు.

* దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. రఘునందన్‌ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్‌ రావు ఇళ్లలో అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అంజన్‌ రావు ఇంట్లో అధికారులకు రూ.18.67లక్షలు లభించాయి.

* బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెరపడింది. ఈ నెల 28న (బుధవారం) 71 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలకు వాడీ వేడిగా ప్రచారం సాగింది. అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిహార్‌ రాజకీయాలను హీటెక్కించాయి. ప్రధాని నరేంద్ర మోదీ మూడు ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఓట్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా తొలి విడత ప్రచారం సాగింది.

* కరోనా నియంత్రణకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా వృద్ధులు, యువతలో ఒకేలాంటి రోగనిరోధక ప్రతిస్పందనను కలిగిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే వృద్ధుల్లో ప్రతికూల స్పందన కూడా చాలా తక్కువగా ఉందని బ్రిటన్‌కు చెందిన ఔషధ సంస్థ ఆస్ట్రాజెనికా సోమవారం వెల్లడించింది.

* కొవిడ్‌-19 మహమ్మారి మన తరంలో అతి పెద్ద సంక్షోభం’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్త సంఘీభావానికి పిలుపునిస్తూ ప్రపంచ ఆరోగ్య సదస్సుకు సంబంధించి ఆన్‌లైన్‌ సెషన్‌ను ఆయన ప్రారంభించారు. వనరుల కొరతతో అల్లాడుతున్న పేద దేశాలకు వైద్యపరంగా సహకరించాలని అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నేతలు, నిపుణులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

* టెలికం రంగ దిగ్గజ సంస్థ ఎయిర్‌ టెల్‌ సోమవారం కీలకమైన ముందడుగు వేసింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న క్లౌడ్‌ కమ్యూనికేషన్స్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ‘ఎయిర్‌టెల్‌ ఐక్యూ’ అనే ఓమ్ని కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటును ఇండియన్‌ ఎంటర్‌ప్రైజ్‌ కమ్యూనికేషన్స్‌లో విప్లవాత్మక మార్పుగా ఎయిర్‌టెల్‌ పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ మార్కెట్‌ విలువ బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది ఏటా 20శాతం వృద్ధి సాధిస్తోంది.

* సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ రాజకీయాల్లో చేరారు. కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆమెతో పాటు మరికొందరు రాందాస్‌ అథవాలే సమక్షంలో ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారు. పాయల్‌ తమ పార్టీలో చేరిన సందర్భంగా అథవాలే ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, పాయల్‌ను ఆర్‌పీఐ(ఏ) మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

* ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజు వ్యవధిలో 51,544 నమూనాలను పరీక్షించగా 1,901 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,08,924కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు.