Editorials

చైనాను ఓడించిన ఇండియా

చైనాను ఓడించిన ఇండియా

అరుణాచల్ ప్రదేశ్‌లోని సమ్డొరాంగ్ చు లోయలో 202 ఎకరాల వ్యూహాత్మక భూమిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఇలా భూమిని హస్తగతం చేసుకోవడం ద్వారా 34 ఏండ్ల తరువాత చైనాను భారత్‌ ఓడించింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుమ్డెకాంగ్ చు ఫ్లాష్ పాయింట్ సమీపంలో 202 ఎకరాల వ్యూహాత్మక భూమిపై 1986 లో భారత్‌కు చైనాతో వివాదం ఏర్పడింది. రెండు దేశాల సైన్యాలు ఎనిమిది నెలలుగా ముఖాముఖిగా ఉన్నాయి. ప్రస్తుత ప్రతిష్ఠంభనకు ముందు చైనాతో చివరిసారిగా 200 మంది భారతీయ సైనికులు నిలబడ్డారు. సుమ్డొరాంగ్ చు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో ప్రవహించే నది. ఇది నామ్కా చు, న్యామ్జాంగ్ చు సంగమం ప్రదేశం నుంచి ఈశాన్యంగా ప్రవహిస్తుంది. చైనా సైన్యం 1986 లో ఇదే నది ఒడ్డున లుంగ్రో లా పాస్ సమీపంలో ఉన్న 202 ఎకరాల మేత మైదానాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. 1980 లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు సమ్డొరాంగ్ చు వివాదం ప్రారంభమైంది. తవాంగ్‌ను ఎట్టి పరిస్థితిలోనైనా రక్షించాలని ఇందిరాగాంధీ కోరుకున్నారు. 1982-83 లో ఇందిరాగాంధీ అప్పటి జనరల్ కేవీ కృష్ణారావు ప్రణాళికను ఆమోదించారు. ఇది భారత-చైనా సరిహద్దు (ఎల్‌ఏసీ) లో గరిష్ట మోహరింపును ప్రతిపాదించింది. చైనాతో యుద్ధం జరిగితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్‌ను కాపాడాలని ఇందిరాగాంధీ భావించారు. దీనిపై, 1984 లో భారతదేశం సుమ్డొరాంగ్ చు వద్ద అబ్జర్వేషన్ పోస్టను స్థాపించింది. వేసవిలో సైనికులు ఇక్కడ కనిపిస్తుండగా.. శీతాకాలంలో ఈ పోస్ట్ ఖాళీగా ఉండేది.

1986 జూన్‌లో తవంగ్‌లోని సమ్డొరాంగ్‌ చు ప్రాంతంలో చైనా దళాలు శాశ్వత పోస్టులు నిర్మిస్తున్నట్లు భారత్ పెట్రొలింగ్ బృందం గుర్తించింది. ఇక్కడ చైనా కూడా తన హెలిప్యాడ్‌ను నిర్మించింది. దీనిపై భారత్ తన 200 మంది సైనికులను శాశ్వతంగా మోహరించింది. శీతాకాలం నాటికి ఈ ప్రాంతం నుంచి తన సైన్యాన్ని తొలగిస్తే, భారతదేశం దానిని ఆక్రమించదని చైనాకు ప్రతిపాదించింది. అయితే చైనా మాత్రం ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి నిరాకరించింది. 1987 లో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడి, భారత- చైనా బలగాలు ఎనిమిది నెలలు ముఖాముఖిగా ఉన్నాయి. అప్పటి నుంచి ఈ 202 ఎకరాల భూమి ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగానే ఉన్నది. సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉన్నందునే చైనా దానిపై కన్నేసినట్లు తెలుస్తున్నది.

తూర్పు లడఖ్‌లో చైనాతో ఆరు నెలల ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. మే ఆరంభం నుండి దళాలు మరిన్ని ప్రదేశాలలో మోహరించారు. ఒక వైపు, సరిహద్దులో దళాల మోహరింపు పెరుగగా.. అదే సమయంలో, చైనా సరిహద్దుకు దాని వ్యూహాత్మక పరిధిని పెంచడానికి భారతదేశం అన్ని రకాల సన్నాహాలు చేసింది. అందుకే చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న తవాంగ్ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్దిర్ గ్రామంలో అదే 202.563 ఎకరాల లుంగ్రో గ్రేజింగ్ గ్రౌండ్ (జీజీ) లో కొత్త రక్షణ నిర్మాణాన్ని అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తున్నది. అందుకే అక్టోబర్ 12 న తవాంగ్ వెళ్లే కీలకమైన రహదారిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా నెచిఫు సొరంగానికి పునాదిరాయి వేశారు. దీనిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మిస్తున్నది. ఈ సొరంగం నిర్మించిన తరువాత భారత సైన్యం చైనా సరిహద్దుకు చేరుకోవడం సులభం అవుతుంది.