Business

మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి-వాణిజ్యం

మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి-వాణిజ్యం

* మందు బాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు డోర్స్‌ మూసివేసింది ఏపీ సర్కార్… అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు  జారీ చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది… పన్నులు చెల్లించి మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతిలేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్షార్హులని అబ్కారీ శాఖ పేర్కొంది. మద్యం అక్రమ రవాణతోపాటు.. ఆదాయం కోల్పోతుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే విషయంలో ఆంక్షలు విధించింది ఏపీ సర్కార్.. కాగా, ఇప్పటి వరకు మూడు బాటిళ్ల మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే.. తాజా ఉత్తర్వుల్లో వాటిపై నిషేధం విధించింది. 

* కొవిడ్‌-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. కాగా ఈ పెరుగుదల లీటరుకు రూ.3 నుంచి 6 వరకు ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య కుదిరిన కొనుగోలు ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్‌ విషయంలో అమెజాన్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ స్టే విధించింది. ఈ నిలుపుదల 90 రోజుల పాటు అమలులో ఉండనుంది.

* మార్కెట్‌ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 9:43 గంటల సమయంలో సెన్సెక్స్‌ 83 పాయింట్లు నష్టపోయి 40,601 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 11,902 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.53 వద్ద కొనసాగుతోంది. అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడం సూచీలపై ప్రభావం చూపుతోంది. దీంతో ఆసియా మార్కెట్లు మందకొడిగా కొనసాగుతున్నాయి.

* కొంత కాలంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో విలీనం కానుందన్న వార్తలకు చెక్‌ పడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటార్లు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా ఈ అంశంపై కామెంట్‌ చేయడానికి ఏమీ లేదని పేర్కొంది. ఈ మేరకు కంపెనీ చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ రోహిత రావ్‌ తెలిపారు.

* కరోనా భయాలు వెంటాడిన వేళ, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 540 పాయింట్లు నష్టపోగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 11,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.85గా ఉంది.