Health

ఇంకా ICUలోనే రాజశేఖర్-TNI కరోనా బులెటిన్

ఇంకా ICUలోనే రాజశేఖర్-TNI కరోనా బులెటిన్

* ఏపీలో కరోనా బులెటిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 74,757 నమూనాలను పరీక్షించగా 2,901 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. కడప జిల్లాలో 4, చిత్తూరు 3, కృష్ణా 3, తూర్పుగోదావరి 2, ప్రకాశం 2, అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6,625కి చేరింది. ఒక్కరోజులో 4,352 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 27,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76,96,653 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

* గత నెలలో విడుదల చేసిన అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను కేంద్రం మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్‌ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్‌ నెలాఖరు వరకు వర్తిస్తాయని స్పష్టంచేసింది. కరోనా వైరస్‌ ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో అన్ని రకాల ఆంక్షలూ కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్‌ల బయట దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పించిన కేంద్రం.. అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, 50శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకొనేందుకు అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్‌ 30న అన్‌లాక్‌-5 మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభణతో దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నవంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టంచేసింది.

* కరోనాతో పోరాడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చికిత్స పొందుతున్న సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు మంగళవారం బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్‌ రత్నకిషోర్‌ తెలిపారు.

* ఇటలీలో కరోనా తీవ్రత తగ్గాక రోజుకు కేవలం 200 కరోనా కేసులు మాత్రమే వచ్చాయి. ఇక తగ్గిందనుకున్న సమయంలో ఒక్కసారిగా మరోసారి వైరస్‌ విజృంభించింది. ఇక్కడ ఇప్పుడు నిన్న ఒక్కరోజే 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో 26 వేలు, స్పెయిన్‌లో 17వేలు, యూకేలో 20వేలు, జర్మనీలో 12వేలు, బెల్జియంలో 15వేలు, స్విట్జర్లాండ్‌లో 17 వేలు, రష్యాలో 17 వేల కేసులు వచ్చాయి. మొత్తంగా ఐరోపాలోని చిన్నాచితకా దేశాలను కూడా కలుపుకొంటే కేసుల సంఖ్య ఒక్కరోజే 2 లక్షలు దాటేసింది.

* రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే మంగళవారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయన్ను దక్షిణ ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా ఆయన సోమవారం తన పార్టీ(రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా)లోకి నటి పాయల్‌ ఘోష్‌ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.