Politics

నేడు “ధరణి” ప్రారంభించనున్న కేసీఆర్

నేడు “ధరణి” ప్రారంభించనున్న కేసీఆర్

రాష్ట్రంలో గురువారం నుంచి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రానుంది. రెవెన్యూ సంస్కరణల్లో ఇదో మైలురాయిగా నిలవనుంది. ఈ పోర్టల్‌ ద్వారా ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందనున్నాయి. దస్తావేజుల రాతకోతలు అవసరం లేని ఈ విధమైన సేవలు మరే రాష్ట్రంలోనూ లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో వీటికి అంకురార్పణ జరుగుతోంది. ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్నారు.
ధరణితో మేలు ఏమిటంటే..
తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 గురువారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగితాలపై కొనసాగుతున్న దస్త్రాల నిర్వహణ ఇకపై ధరణి పోర్టల్లో డిజిటల్‌ రూపంలో కొనసాగుతుంది. యజమానికి తెలియకుండా భూ వివరాల్లో ఎటువంటి మార్పు చేర్పులకు వీలుండదు. యజమాని ఆధార్‌ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు జరుగుతాయి. యజమాని సెల్‌ఫోన్‌కు పంపే ఓటీపీ ఆధారంగానే ఈ మార్పులు జరుగుతాయి. అక్రమంగా భూ యాజమాన్య హక్కులు మార్చడం వంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. అంతేకాదు వేలి ముద్రతోనే (బయోమెట్రిక్‌) దస్త్రాలు తెరుచుకుంటాయి.
రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ సేవలకు ఒకే సాఫ్ట్‌వేర్‌
రిజిస్ట్రేషన్లు.. మ్యుటేషన్ల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల సేవలను ఒకే సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచింది. దీనివల్ల వ్యవసాయ భూములను మండల తహసీల్దారు కార్యాలయాల్లోనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. గతంలో భూమిపై యాజమాన్య హక్కులు పొందాలంటే మ్యుటేషన్‌ కోసం గ్రామస్థాయిలో వీఆర్వో నుంచి డిప్యూటీ తహసీల్దారు వరకు పలుమార్లు తిరిగితే తప్ప పూర్తయ్యేదికాదు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యుటేషన్‌ కూడా పూర్తయిపోతుంది.
* సాగు భూమిని వ్యవసాయేతర రంగాలకు వినియోగించుకోవాలంటే అనుమతులకు (నాలా) అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త చట్టంతో తిరస్కారానికి వీలులేదు. వాల్టా నిబంధనలు మినహాయించి తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సిందే.
* భూముల భాగ పంపిణీ, వారసత్వ బదిలీ వ్యయప్రయాసలకు చెల్లుచీటి పడనుంది. కుటుంబ సభ్యులు తహసీˆల్దారు సమక్షంలో అంగీకార పత్రం రాసిస్తే ధరణి పోర్టల్లో యాజమాన్య హక్కుల కల్పన వెంటనే పూర్తవుతుంది.
మ్యుటేషన్‌ ఛార్జీల్లో మార్పులు
పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో మ్యుటేషన్‌ ఛార్జీలను ప్రభుత్వం సవరించింది. పురపాలక సంఘాల్లో రిజిస్ట్రేషన్‌ విలువలో 0.1 శాతం లేదా రూ.1000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. జీహెచ్‌ఎంసీ సహా నగర పాలక సంస్థల్లో రిజిస్ట్రేషన్‌ విలువలో 0.1 శాతం లేదా రూ.3000.. ఈ రెండింటిలో ఏది గరిష్ఠంగా ఉంటే అంత వసూలు చేస్తారు.
రూ. 51.30 కోట్లు విడుదల
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు తోడు తహసీల్దారు కార్యాలయాలను కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 570 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అమల్లోకి రానున్నాయి. ధరణి అమలుకు రూ. 51.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి తహసీల్దార్‌ కార్యాలయానికి రూ. 9 లక్షల చొప్పున కేటాయించింది.

రిజిస్ట్రేషన్ల సేవలు ప్రారంభంకావడానికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోర్టల్లో స్టాంపు రుసుం, చలానా సంబంధిత వివరాలకు సంబంధించి సాంకేతికంగా కొన్ని సమస్యలు ఏర్పడటంతో చివరి సమయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం.