Politics

ఏపీలో ఎన్నికలపై అభిప్రాయ సేకరణ

ఏపీలో ఎన్నికలపై అభిప్రాయ సేకరణ

ఏపీలో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ సేకరిస్తున్నారు. అభిప్రాయ సేకరణకు హాజరు కావాలని 19 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం నుంచి ఇప్పటికే సమాచారాన్ని పంపారు. ఇవాళ ఉదయం భాజపా, సీపీఎం, బీఎస్పీ నేతలు వేర్వేరుగా ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎస్‌ఈసీతో సమావేశం అనంతరం భాజపా నేత సత్యనారాయణ మాట్లాడుతూ… గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరినట్టు చెప్పారు. బీఎస్పీ నేత పుష్పరాజ్‌ మాట్లాడుతూ… ఎన్నికలు మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని కోరామని చెప్పారు. కరోనా దృష్ట్యా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, కేంద్ర పోలీసు బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు తెలిపారు. గతంతో పోలిస్తే కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీ కి సూచించినట్టు సీపీఎం నేత వెంకటేశ్వరరావు వెల్లడించారు. కొవిడ్‌ కారణంగా మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారని ఎన్నికల కమిషనర్‌ను అప్పట్లో విమర్శించిన వైకాపా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఉంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లం అని వైకాపా ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా రమేశ్‌కుమార్‌ ముందుకు వెళ్లడాన్ని ఖండిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య కార్యదర్శి ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ముందు పార్టీలను సమావేశానికి పిలవడంలోనే ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతోందని అంబటి పేర్కొన్నారు.