NRI-NRT

అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది?

అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది?

త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అధ్యక్ష తరహా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నిక మిగిలిన దేశాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సూత్రం అధ్యక్ష పదవిలో ఉన్న వారికి చక్కగా సరిపోతుంది. ఎందుకంటే.. పార్టీ నేతలను ఒప్పించిన అభ్యర్థే పోటీలో ఉంటాడు. ఆ తరువాత అతడు ప్రజలనూ మెప్పించాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికలు గతం కంటే ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే.. 2016 ఎన్నికల సమయంలో ఏమాత్రం గెలవడు అనుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయఢంకా మోగించి అందరి అంచనాలు తలకిందులు చేశాడు. అదే ట్రంప్‌ ఈసారి మళ్లీ పోటీ చేస్తుండటంతో మళీ ఎన్నికల్లో ఏం మ్యాజిక్కు చేస్తాడన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
***ఇవి తప్పనిసరి…!
అమెరికా అధ్యక్ష పదవిలో పోటీ చేయాలంటే ఆ అభ్యర్థి మొత్తం నాలుగు దశలను దాటాల్సి ఉంటుంది. 1. ప్రైమరీ కాక్సెసెస్, 2.సాధారణ ఎన్నికలు, 3.ఎలక్ట్రోరల్‌ కాలేజీ, 4. ప్రమాణ స్వీకారం. అధ్యక్షుడి బరిలో నిలిచేవారు ముందు ఆ దేశంలో జన్మించిన పౌరుడై ఉండాలి. కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. దాదాపు దేశంలో 14 ఏళ్లు నివసించి ఉండాలి. ఇవి అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థికి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు. అక్కడ రెండే పార్టీలు మొదటి రిపబ్లికన్, రెండోది డెమోక్రాటిక్‌. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న వ్యక్తి అయినా సరే.. పార్టీలో అంతర్గతంగా జరిగే పోటీ లో నెగ్గాలి. ఇందుకోసం ప్రత్యక్ష (చేతులు ఎత్తడం ) లేదా పరోక్ష (బ్యాలెట్‌) పద్ధతిలో ఎన్నుకుంటారు. దీనిని ప్రైమరీ క్యాక్యుస్‌ అంటారు. వీళ్లు తిరిగి పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థిని ఎన్నుకుంటారు. వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
**ఎలక్ట్రోరల్‌ ఓట్లే కీలకం
చాలా ఇతర దేశాల ఎన్నికలతో పోలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే జరుగుతాయి. ఈ రెండు పార్టీల్లోని ఏదో ఒకదాని నుంచి అధ్యక్షుడు ఎన్నికవుతారు. 18 ఏళ్లు నిండిన అమెరికా పౌరులంతా ఎన్నికల్లో ఓటేస్తారు. కానీ, కేవలం వీరు ఓట్లేసినంత మాత్రాన అధ్యక్షులైపోరు. వీరితోపాటు ఎలక్ట్రోరల్‌ కాలేజీలో ఉన్న ఓట్లుకూడా ముఖ్యమైనవే. ఎవరు ఎక్కువ ఎలక్ట్రోరల్‌ ఓట్లు సాధిస్తారో వారే విజేతలవుతారు. క్రితంసారి ఈ ఓట్లే ట్రంప్‌ విజయానికి బాటలు పరిచాయి.
**ఎలక్ట్రోరల్ ఓట్లు ఎన్ని ఉంటాయి?
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు. ప్రతీ రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు ఉంటారు. అంటే 100 మంది సెనేటర్లు, రాజధాని వాషింగ్టన్‌లో ముగ్గురు ఉంటారు. మొత్తం 103 మంది. వీరు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్ట్రోరల్‌ కాలేజీలో ఓటేసేందుకు 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 538 ఎలక్ట్రోరల్‌ ఓట్లుంటాయి.
*ఎన్నికలు– ప్రమాణస్వీకారం..
538 ఎలక్ట్రోరల్‌ ఓట్లలో…. 270 కంటే ఎవరు ఎవరు సాధిస్తారో వారే విజేత. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతిసారి నవంబర్‌ మొదటి సోమవారం తర్వాతి మొదటి మంగళవారం జరుగుతాయి. సర్వసాధారణంగా మూడో తేదీకి అటు ఇటుగా ఎన్నికలుంటాయి. తరువాత విజేతగా నిలిచిన అభ్యర్థి జనవరిలో ప్రమాణ స్వీకారం చేస్తారు.