Editorials

అనుకున్నది ఒకటి.అయింది ఒకటి. గోవిందా! గోవిందా!!

అనుకున్నది ఒకటి.అయింది ఒకటి. గోవిందా! గోవిందా!!

పీహెచ్‌డీ పూర్తిచేసి సైంటిస్ట్‌ కావాల్సిన వ్యక్తి.. అర్చకుడిగా మారారు. దాదాపు పాతికేళ్లు శ్రీవారి సేవలో కొనసాగారు. ఒక దశలో భగవత్ స్వరూపంలా ఖ్యాతి గడించారు. చివరకు దైవనామస్మరణ విడిచి రాజకీయ భజన మొదలెట్టారు. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి.. ఆఖరుకి శ్రీవారి సేవకే దూరమయ్యారు. అయినవారికి అధికారం దక్కినా.. ఆయన ఆశించిన ఫలితం మాత్రం ఇప్పటికీ పొందలేకపోతున్నారు. ఇంతకీ ఆ అయ్యవారు ఎవరు? ఆయనకు ఆ పరిస్థితి ఎదురైంది ఎందుకు? వివరాలు ఈ కథనంలో చూద్దాం.
*కొత్తతరం రాకతో కష్టాలు మొదలు..
రెంటికీ చెడ్డ రేవడి అన్నట్లుగా మారిందట తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు పరిస్థితి. తిరుమల శ్రీవారి ఆలయం గురించి తెలిసిన ప్రతిఒక్కరికి పరిచయం ఉన్న పేరు రమణ దీక్షితులు. శ్రీవారికి నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు వంశపారంపర్యంగా సేవలు అందిస్తున్నారు. వాటిలో గోల్లపల్లి వంశం నుండి రమణ దీక్షితులు ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. రమణ దీక్షితులు ఉన్నత విద్యను అభ్యసించడం, అప్పట్లోనే పీజీ పూర్తిచేసి ఉండటంతో.. శ్రీవారి ఆలయంపై వేగంగానే పట్టు సాధించారు. మొత్తం అర్చక వ్యవస్థకు పెద్ద దిక్కుగా మారారు. అయితే అర్చకులలో కొత్తతరం రాకతో.. ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. రమణ దీక్షితులు వ్యవహారశైలితో అర్చకుల మధ్య గ్యాప్ బాగా పెరుగుతూ వచ్చింది. చివరకు ఆయన వ్యతిరేక వర్గం ఒకటి బలంగా తయారైంది. టీటీడీ కూడా తనకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుందని ఆయన భావించారట. అందుకే టీటీడీపై బెదిరింపు ధోరణిని ప్రారంభించారట. ఇందులో భాగంగానే 2018 మే 15న జరిగిన పాలకమండలి సమావేశానికి ఒకరోజు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. టీటీడీ అధికారులు, పాలకమండలిపై ఆరోపణలు చేశారు. అవి చాలవన్నట్లు అప్పుడు ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు.
*ఆ చర్యతో అన్ని ద్వారాలు మూసుకుపోయాయి…
నాడు టీటీడీ పాలకమండలి.. రమణ దీక్షితులు వ్యవహారంపై కన్నెర్ర జేసింది. అసలు సంబంధం లేని తమపై ఆరోపణలు చేయడం, ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో.. రమణ దీక్షితులుపై వెంటనే చర్యలకు ఉపక్రమించింది పాలకమండలి. వయోపరిమితి నిబంధన తెరపైకి తెచ్చి 65 ఏళ్లు పైబడిన అర్చకులతో పదవీ విరమణ చేయించింది. దీంతో రమణ దీక్షితులుసహా ప్రధాన అర్చకులుగా ఉన్నవారు పదవీచ్యుతులయ్యారు. అలాగే ఆగమ సలహామండలి నుంచి కూడా ఆయనను తొలగించింది. ఈ చర్యతో రమణ దీక్షితులకు ఉన్న అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. శ్రీవారి ఆలయంతో ఉన్న 24 ఏళ్ల అనుబంధం ఒక్కసారిగా తెగిపోయినట్లు అయింది. ఈ పరిస్థితికి కారణం.. రమణ దీక్షితులు స్వయంకృతాపరాధమేనని టాక్.
*అనుకున్నది ఒకటి.. అయినది మరొకటి…
శ్రీవారి సేవకు దూరమవడంతో రమణ దీక్షితులు.. టీడీపీ ప్రభుత్వంపై, టీటీడీపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి తనకు అన్యాయం జరిగిందని విన్నవించారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి ప్రధాన అర్చక బాధ్యతలు అప్పగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారంలోకి రావడంతో.. రమణ దీక్షితులు రీ ఎంట్రీ లాంఛనమేనని అందరూ భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆయనను తొలగించే సమయంలోనే టీటీడీ పాలకమండలి ప్రణాళికా బద్ధంగా వ్యవహరించింది. వారి వంశానికి చెందినవారిని ప్రధాన అర్చకులుగా నియమించడంతోపాటు ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసింది. దీంతో జగన్ ఇచ్చిన హామీని అమలు చేసే అవకాశం ప్రస్తుత టీటీడీ పాలకమండలికి కష్టంగా మారిందట.
*సీఎం ఆదేశాలతో…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జగన్ తనకు ఇచ్చిన హామీని టీటీడీ అధికారులు, పాలకమండలి అమలు చేయకపోవడాన్ని.. రమణదీక్షితులు పలుమార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనకు ఆలయంలో బాధ్యతలు కేటాయించాలని సీఎం ఆదేశించారట. ఈ మేరకు రమణదీక్షితులు అంశంపై చర్చించిన పాలకమండలి.. చివరకు గతేడాది డిసెంబరులో రమణ దీక్షితులుని ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే గొల్లపల్లి వంశం తరఫున ఉన్న వ్యక్తిని తొలగించి తనను ప్రధాన అర్చకుడిగా నియమించకపోవడం పట్ల దీక్షితులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ తరఫున అధికారులు రమణ దీక్షితులుతో చర్చలు జరిపిన తర్వాత.. గతేడాది డిసెంబర్ 30న శ్రీవారి ఆలయంలో గౌరవ ప్రధాన అర్చకులుగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
*కొట్టుమిట్టాడుతున్న దీక్షితులు..
ప్రస్తుతం రమణ దీక్షితులు తన విధులకు దూరంగా ఉంటున్నారు. ఓ వైపు కోర్టులో టీటీడీపై న్యాయపోరాటం చేస్తూ.. మరోవైపు సుబ్రమణ్యస్వామి ద్వారా టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం అధీనం నుంచి తప్పించి వంశపారంపర్య హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కొద్దినెలలుగా టీటీడీ పాలకమండలి, అధికారులపై ట్విట్టర్ వేదికగా దీక్షితులు విమర్శలు చేస్తున్నారట. ఇప్పుడు ప్రభుత్వంపై కూడా అడపాదడపా విమర్శలు సంధిస్తున్నారు. మొత్తంమీద అనుకున్నది ఒక్కటి.. అయిందొక్కటి అన్నట్టుగా రమణదీక్షితులు పరిస్థితి ఉందట. టీటీడీలో రెండున్నర ఏళ్లుగా స్వామి కైంకర్యాలకు దూరం అవడంతోపాటు ఐదు బ్రహ్మోత్సవాలకు ఆయన దూరం కావాల్సివచ్చింది. తిరిగి తాను కోరుకున్న స్థానం ఎప్పుడు దక్కుతుందో కూడా తెలియని స్థితిలో రమణదీక్షితులు కొట్టుమిట్టాడుతున్నారని టీటీడీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.