Politics

మోడీజీ ₹55వేల కోట్లు ఆమోదించండి-తాజావార్తలు

మోడీజీ ₹55వేల కోట్లు ఆమోదించండి-తాజావార్తలు

* పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017-18లో సాంకేతిక కమిటీ, రివైజ్డ్ కాస్ట్‌ కమిటీ ఆమోదించిన రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు పోలవరం నిధుల అంశంపై ఈ నెల 28న ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. సవరించిన అంచనాలను సీడబ్ల్యూసీ, సాంకేతిక కమిటీ ఆమోదించాయని చెప్పారు. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిన అంచనా మొత్తం అవమానకరంగా ఉందని జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని గుర్తు చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. నిర్వహణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని విభజన చట్టంలో పేర్కొన్నట్లు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులన్నీ తీసుకుని కేంద్రమే నిర్మాణాన్ని చేపట్టాలని జగన్‌ కోరారు.

* కొవిడ్‌ ఆంక్షల సడలింపు తర్వాత రుణగ్రహీతలు పెరగడం, మొండి బకాయిలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐకి లాభాల పంట పండింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకు నికరలాభం ఆరు రెట్లు పెరిగి రూ. 4,251కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 655 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. ఇక ఆదాయం కూడా రూ. 22,759.52కోట్ల నుంచి రూ. 23,650.77కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐసీఐసీఐ వెల్లడించింది.

* ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్‌-19ను నిర్ధారించేందుకు ముక్కు లేదా నోటి ద్వారా స్వాబ్‌ను సేకరించి కొవిడ్‌ ఉందో లేదో పరీక్షిస్తున్నాం. వ్యాధి సంక్రమణను అరికట్టే ఉద్దేశంతో ఈ టెస్టులను నిర్వహిస్తున్నాం. దీనివల్ల డబ్బుతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. పైగా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడమూ కష్టంతో కూడుకున్న వ్యవహారం. అదే క్షణాల్లో చిన్నపాటి బ్రీత్‌ టెస్ట్‌ ద్వారా కొవిడ్‌-19ను నిర్ధారించగలిగితే? అమెరికా ఫ్లోరిడాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ పరిశోధకులు అలాంటి ఓ కొత్త టెస్టును అభివృద్ధి చేశారు. అర్ధరాత్రివేళ మందుబాబులు వాహనాలు నడపకుండా గుర్తించేందుకు పోలీసులు ఉపయోగించే బ్రీత్‌ అనలైజర్‌ లాంటిదే ఈ టెస్ట్‌.

* భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. అయితే, కొవిడ్‌ సోకినవారిలో మరణాలు తక్కువగా ఉండటం, కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడం శుభసూచికం. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 551 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. అలాగే, మన దేశంలో మరణాల రేటు 1.5శాతం కంటే తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ప్రతి 10లక్షల మంది జనాభాలో 88 మరణాలు నమోదవుతున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయంది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తుండటం వల్లే మరణాలు పెరగకుండా అదుపులో ఉంచగలుగుతున్నామని తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.49శాతంగా ఉంది.

* బిహార్‌ ఎన్నికలపై శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సీఎం అయినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. ఈ మేరకు పుణెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు.

* ఈ ఏడాది ఇప్పటికే చాలా విచిత్రంగా గడిచింది. రైలు పెట్టెల్లాగా ఒకదాని వెంట ఒకటి ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని వణికించాయి. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. దీంతో పాటు భారీ వర్షాలు, వరదల, భూకంపాలు.. ఇలా ఈ 2020లో చాలా చూశాం.. చూస్తున్నాం.. మళ్లీ కొత్తగా ఆకాశంలో బ్లూమూన్‌ ఏంటని కంగారుపడొద్దు. దీని వల్ల మనకు కలిగే నష్టం ఏం లేదు. చందమామ తెల్లగా, ప్రశాంతంగా, చల్లని వాతావరణం పంచి మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందని మనందరికీ తెలుసు.. అయితే ఈ బ్లూమూన్‌ ఏంటి? చందమామ ఇవాళ నీలంగా మారనున్నాడా? ఆకాశం రంగులో మనకు దర్శనమివ్వనున్నాడా? అని అనుకుంటున్నారా.! అయితే ఇది చదివేయండి..ఇవాళ (అక్టోబరు31) రాత్రి 8:15 గంటల తర్వాత చంద్రుడు ‘బ్లూమూన్‌’గా దర్శనమివ్వనున్నాడు. అంటే నీలి రంగులో కనిపించడు. సాధారణంగా ఉంటే పరిమాణం కంటే కొద్దిగా పెద్దగా.. ప్రకాశవంతంగా.. మరింత తెల్లగా కనిపిస్తాడు అంతే. దీంతో పాటు జాబిల్లి పక్కన ప్రకాశవంతమైన మరో ఎర్రగా ఉన్న నక్షత్రం లాంటిది దర్శమిస్తుంది. ఇది భూమికి పక్కనే ఉన్న మరో గ్రహం అంగారకుడు.

* విభజన తర్వాత కొత్త రాష్ట్రంలో పరిపాలనను అనేక సంక్షోభాలతో ప్రారంభించాం…అయినా, రెండంకెల వృద్ధి రేటు సాధించామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. దేశవృద్ధి రేటు కంటే 3.5శాతం ఎక్కువ వృద్ధిరేటుసాధించినట్లు చెప్పారు. ముంబయి ఐఐటీ విద్యార్థులతో ఆన్‌లైన్‌ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలతోపాటు కరోనా సంక్షోభం గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్‌ వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సమర్థత బయటపడుతుంది. వర్చువల్‌ కార్యాలయాలు, డిజిటల్‌ వేదికలు ఈ సంక్షోభంలో వచ్చిన వినూత్న ఆలోచనలే. కొత్త రాష్ట్రంలో అనేక సంక్షేమాలతో పాలన ప్రారంభించామన్నారు.

* జీవితంలో మనం అనుకున్న విజయం సాధించిన తర్వాతే.. అసలైన కష్టాలు మొదలౌతాయని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అంటున్నారు. తిండి, ఇంటి అద్దె కోసం ఇబ్బందిపడే రోజులే బాగుంటాయని వివరించారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘స్ట్రగ్లింగ్‌ డేస్‌’ గురించి మాట్లాడారు. ‘నిజానికి మన ‘స్ట్రగ్లింగ్‌ డేస్‌’లో తిండి కోసమో, అద్దె కట్టడం కోసమో ఇబ్బందిపడి ఉంటాం. అవి అసలు కష్టాలే కాదు. ఒక పూట తినకపోయినా ఏం కాదు.. ఎండలో ఎండినా ఫర్వాలేదు. ఏదో తెలియని కసితో పరిగెడుతుంటాం. వారానికి ఓసారి అర కిలో చికెన్‌ తెచ్చుకుంటే పండగ. నమ్మండి.. ఇవే మంచి రోజులు. ఒకవేళ మీరు అనుకున్న సక్సెస్‌ డేస్‌ వచ్చేస్తే ఇకంతే..’ అని పేర్కొన్నారు.

* దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా.. పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.11వేలకోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం కేవలం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని చెప్పారు. కానీ భాజపా నేతలు మాత్రం పింఛనులో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు, తాను అబద్ధాలు చెబుతున్నట్టు ప్రచారంచేస్తున్నారని సీఎం మండిపడ్డారు. పింఛన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధమని ఎవరైనా నిరుపిస్తే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతానని సవాల్‌ విసిరారు. శనివారం జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. భాజపా నేతలకు ఓట్లు మాత్రమే కావాలి తప్ప ప్రజలు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించామన్నారు. రైతులను కాపాడుకొనేందుకు పిడికిలి బిగించాలని, యుద్ధానికి కదలాలన్నారు. మక్కలు సాగుచేస్తే మద్దతు ధర రాకుండా రైతులు మునిగిపోతారన్నారు. నష్టపోయినా సరే ఈసారి మక్కలు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.

* ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో గురువారం రాత్రి నాటి పరిస్థితి ఇది.. ఎటు చూసినా కార్ల లైట్లే.. ఎక్కడ విన్నా హారన్ల మోతే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పారిస్‌ చుట్టూ 700 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభించడంతో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ విధించడమే ఇందుకు కారణం.శుక్రవారం నుంచి ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో గురువారం సాయంత్రం నుంచే దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించే ప్రజలు తమ స్వస్థలాలు బయల్దేరారు. ఇంకేముంది నగరాల వెలుపలకు దారితీసే రహదారులన్నీ కార్లు, వాహనాలతో కిటకిటలాడాయి. వేల సంఖ్యలో వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గురువారం రాత్రి పారిస్‌ నగరం చుట్టూ దాదాపు 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయినట్లు ఫ్రాన్స్‌ స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.