Devotional

డిసెంబరు 15 నుండి భద్రాద్రి అధ్యయనోత్సవాలు

డిసెంబరు 15 నుండి భద్రాద్రి అధ్యయనోత్సవాలు

భద్రాద్రి రామాలయంలో డిసెంబరు 15 నుంచి 2021 జనవరి 4 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. కొవిడ్‌ నిబంధనల మేరకు అవసరమైన పనులకు త్వరలోనే టెండర్లను పిలవనున్నారు. సెక్టార్‌ టిక్కెట్ల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే అంతర్జాలంలో వీటిని విక్రయించాలని భావిస్తున్నారు. శ్రీరామనవమి సమయంలో కొన్ని టిక్కెట్‌లను ఇలా విక్రయించినప్పటికీ కొవిడ్‌ కారణంగా భక్తులకు ప్రవేశాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించారు. అప్పటితో పోల్చితే ఆంక్షలు సడలుతున్నాయి. ప్రధాన ఉత్సవానికి ఇంకా సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.
*రోజుకో అవతారంలో దర్శనం
స్వామివారు రోజుకో రూపంలో దర్శనం ఇచ్చి మిథిలా మండపంలో పూజలు అందుకోనున్నాడు. ఆ తర్వాత తిరువీధి సేవ ఉంటుంది. కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నందున వీటిని కొనసాగిస్తారని భక్తులు ఆశిస్తున్నారు. డిసెంబరు 15న మత్స్యావతారంలో స్వామి దర్శనమిస్తారు. 16న కూర్మావతార దర్శనం ఉంటుంది. ఆ రోజు నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువీధి సేవ చేస్తారు. 17న వరాహావతారం, 18న నరసింహావతారం, 19న వామనావతారం, 20న పరశురామావతారం, 21న శ్రీరామావతారం, 22న బలరామావతారం, 23న శ్రీ కృష్ణావతారంలో దర్శన భాగ్యం కలుగుతుంది. 24న శ్రీ తిరుమంగై ఆళ్వార్‌ పరమ పదోత్సవం ఉంటుంది. అదే రోజు సాయంత్రం పవిత్ర గోదావరిలో హంసాలంకారంలో స్వామివారు విహరిస్తారు. ఈ తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. 25న శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 6 వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజు రాత్రి నుంచి రాపత్తు ఉత్సవాలు మొదలు కానుండగా స్వామివారు రోజుకో మండపానికి వెళ్లి పూజలు అందుకోనున్నారు.